
పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వల్లభనేని లాంటి వ్యక్తులు బయట ఉండకూడదని, వాళ్లను జైళ్లో పెట్టాలని అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి.. వల్లభనేని వంశీ ఇండియా నుంచి పారిపోయే ప్రయత్నం చేశారని, ఇప్పుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారని విమర్శించారు.
వంశీ వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఈపాటికి ప్రాణాలతో ఉండే వారు కాదని.. ఈ రోజు కూడా అరెస్టు తర్వాత రకరకాల నాటకాలకు తెరలేపారని అన్నారు. తమ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఒక పేద వ్యక్తిని ప్రాణాలు తీస్తానని భయపెట్టి కేసు విత్ డ్రా డ్రామాలాడారని ఆరోపించారు.
తమ నాయకులను ఏం పీకుతారంటూ కూసిన వంశీ, ఎన్నికల ఫలితాల సమయంలో మొదటి రౌండ్ లోనే అమెరికాకు పారిపోయారని.. క్రూరమృగం లాంటి వంశీని ఆయన కుటుంబసభ్యులే శిక్షించాలని డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీ పేరు చెబితేనే చార్లెస్ శోభారాజ్ గుర్తుకొస్తాడని అన్నారు.
