
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిపై ఆశలు సన్నగిల్లాయి. టన్నెల్ లో వాళ్లు చిక్కుకొని 4 రోజులైంది. ఇప్పటికీ బురద, నీరు వస్తూనే ఉంది. నిమిషానికి 5వేల లీటర్ల నీరు ఊరుతున్నట్టు అధికారులు వెల్లడించారు. దీనికితోడు టన్నుల కొద్దీ బురద, రాళ్లు పేరుకుపోయినట్టు చెబుతున్నారు.
పరిస్థితిని పూర్తిస్థాయిలో అంచనా వేసిన అధికారులు, 8 మంది సజీవంగా ఉండడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం వాళ్లను ఎలాగైనా బయటకు రప్పించాలనే లక్ష్యంతో ఉంది. నిన్నట్నుంచి సహాయ చర్యల్ని మరింత వేగవంతం చేశారు. మరింతమంది సిబ్బందిని నియమించారు.

ప్రస్తుతానికైతే ర్యాట్ హోల్ మైనర్లు టన్నెల్ బోర్ మెషీన్ వరకు చేరుకున్నారు. నిన్న లోకో ట్రైన్ ట్రాక్ ను పునరుద్ధరించారు. గ్యాస్ కటింగ్ యంత్రాల్ని సరిచేశారు. ఈరోజు వెంటిలేషన్ ట్యూబ్ ను అందుబాటులోకి తీసుకొస్తారు.
ఈరోజు సాయంత్రానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. టన్నెల్ లోపల జరుగుతున్న పనుల్ని పర్యవేక్షించేందుకు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటుచేశారు. విద్యుత్, మంచినీటి వ్యవస్థను పునరుద్ధరించారు.
