
ధరలు దారుణంగా పడిపోయాయి. మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. ఏపీలో ఓ మిర్చి రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. దీంతో రైతుల్ని తక్షణం ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. దీనికి ఆ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేది హాజరవ్వగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. నిజానికి ఈ శాఖతో సంబంధం లేకపోయినా, చంద్రబాబు ఆదేశాల మేరకు, రైతుల సంక్షేమం కోసం రామ్మోహన్ నాయుడు వెళ్లి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు.
ఈ సమావేశంలో అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్-MIS కింద కొనుగోలు చేసి మార్కెట్ ధర, సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లించాలని మంత్రి కోరారు. దీనికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.
MIS కింద సేకరించే సరుకు గరిష్ట పరిమితిని 25 శాతం నుంచి 75 శాతానికి పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిగణలోకి తీసుకుంది.
