Download App

ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి…

మార్చి 18, 2026 By Suresh Thota
మార్చి 19వ తేదీ ఉగాది "పరాభవ" నామ సంవత్సరం పేరుతో ఈ తెలుగు నామ సంవత్సరం మనకి పరిచయం కాబోతుంది. చాలామంది "పరాభవ" అంటే అవమానాలు ఎదురవుతాయి. పేరులోనే ఉన్నది పరాభవం అనుకుంటారు. చాలామంది ఈ సంవత్సరం పేరు విని భయపడుతున్నారు. నిజానికి పరాభవ నామ సంవత్సరం అంటే...
ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి…

మార్చి 19వ తేదీ ఉగాది “పరాభవ” నామ సంవత్సరం పేరుతో ఈ తెలుగు నామ సంవత్సరం మనకి పరిచయం కాబోతుంది. చాలామంది “పరాభవ” అంటే అవమానాలు ఎదురవుతాయి. పేరులోనే ఉన్నది పరాభవం అనుకుంటారు. చాలామంది ఈ సంవత్సరం పేరు విని భయపడుతున్నారు.

నిజానికి పరాభవ నామ సంవత్సరం అంటే పరాభవాలు అధికంగా ఉంటాయి అని కాదు.

“పరాభవ” అర్థం ఏమిటంటే, పరా అంటే పరా భట్టారిక(లలిత దేవి)….. భవ అంటే సాక్షాత్తు భవుడు, అంటే పరమశివుడు. అనగా ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు, సత్య, ధర్మ, భక్తి మార్గంలో జీవితాన్ని ప్రజలు అనుసరిస్తూ ఉండాలని, వాళ్ళని సదా తమ కరుణా కటాక్ష వీక్షణలతో, తమ బిడ్డలు ను రక్షిస్తారని దీని అర్థం గా వేద పండితులు చెబుతున్నారు.

చైత్ర మాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథి నాడు ఉగాది జరుపుకుంటారు. ఉగాది (సంవత్సరాది) పండుగ గురించి “ధర్మ సింధు” మరియు “నిర్ణయ సింధు” రెండింటిలోనూ వివరణాత్మకమైన సమాచారం ఉంది.

“ఉగాది” విధానం ను ఇలా “ధర్మసింధు” లో “పంచవిధుల సమన్వితం”గా ఇలా సూచించియున్నారు…
1) తైలాభ్యంగనం
2) నూతన సంవత్సరాది స్తోత్రం
3) నింబకుసుమ భక్షణం(ఉగాది పచ్చడి సేవనం)
4) ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
5) పంచాంగ శ్రవణం
ఈవిధంగా “పంచకృత్య నిర్వహణ” గా నిర్వర్తించాలని “ధర్మ సింధు” లో నిర్ణయించారు.

“తైలాభ్యంగనం”…

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి.

ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసినచో లక్ష్మి, గంగా దేవి ల అనుగ్రహాన్ని పొందగలుగుతారు.
“అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం” (అభ్యంగన స్నానం సర్వ అవయవాల పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా.
ఆరోగ్య రీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలభ్యంగనానికీ విశేష ప్రాధాన్యమీయబడినది.

ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి…

“నూతన సంవత్సర స్తోత్రం”….

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్య, దీప, ధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకుల తోరణాలతో, పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించాలి.

“ఉగాది పచ్చడి సేవనం”….

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేవనం అత్యంత ప్రధానమైనది, మామిడి కాయ, వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక చెరకు ముక్కలు, ఉప్పు, మిరియాలు, ఈ షడ్రుచుల ను ఉగాది పచ్చడి అంటారు.

“అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌” అని “ధర్మ సింధు” లో చెప్పబడినది.

ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు ఆరోగ్యప్రదాయని కూడా, సుఖాలకు పొంగకు, దుఃఖానికి క్రుంగకు, సుఖదుఃఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి.

“పూర్ణ కుంభదానం”

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం.

ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు(మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

“పంచాంగ శ్రవణం”

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే లభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, గురువు విద్య బుద్దులు, శుక్రుడు అంగ సౌష్టవాన్ని, బుధుడు తెలివితేటలు ,చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు ధైర్యాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.

అలాగునే ఈ “ఉగాది” పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, మన గంటల పంచాంగం తయారు చేస్తారు.

“శ్లోకం”:

“శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం”

ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading