
తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమయ్యే శష్ట్యబ్ద చక్రంలో 40వ సంవత్సరమైన “పరాభవ” నామ సంవత్సరం తో ఈ ఉగాది ప్రారంభమైంది. సంప్రదాయం, పురాణాలు, జ్యోతిష్య విశ్లేషణల ప్రకారం ఈ సంవత్సరానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది.
పేరులోని అర్థం… అంతరార్థం ఏమిటి… అనేది తెలుసుకుందాం…
“పరాభవ” అనే పదానికి సాధారణంగా ఓటమి, అవమానం, తగ్గుదల, తిరోగమనం వంటి అర్థాలు ఉన్నప్పటికీ, పండితులు దీని అంతరార్థాన్ని భిన్నంగా విశ్లేషిస్తున్నారు. పాత వ్యవస్థల అంతం, కొత్త ప్రారంభాలకు సంకేతం గా, ప్రకృతిలో పాత ఆకులు రాలి కొత్త చిగుర్లు వచ్చే ప్రక్రియకు ప్రతీక గా, అహంకారం తగ్గి, వినయం పెరగాల్సిన అవసరాన్ని సూచించే సంవత్సరం గా దీన్ని భావించాలి తప్ప భయాన్ని కాదు, ఈ పేరు మార్పు కు, పునరుద్ధరణకు సూచన గా భావించాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం “వ్యవసాయం రంగం” లో ప్రభావం… జ్యోతిష్య అంచనాల ప్రకారం… కొన్నిచోట్ల అతివృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి , మూలంగా రైతులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి…. అయితే ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు ఉపయోగించికుని దిగుబడులు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని, తద్వారా వ్యవసాయ రంగం లో వినూత్న ఆలోచనలతో దిగుబడి పెరుగుతుందని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు.
ఆర్థిక రంగంలో అనిశ్చితి, ధరల పెరుగుదల కారణంగా, దేశీయ మరియు ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి… ధరల పెరుగుదల తో మార్కెట్ ఒడిదుడుకులు కు గురవుతుంది అంటున్నారు. ఆటోమొబైల్, విమానయాన, శాస్త్ర సాంకేతిక రంగంలో వృద్ధి పెరిగే అవకాశం ఉందని, అంతరిక్ష పరిశోధన లో సరికొత్త పురోగతి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
దేశీయంగా రాజకీయ పరిస్థితుల లో మార్పులకు సూచనలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ప్రభుత్వాల పై విమర్శలు , ప్రజల్లో అసంతృప్తి పెరగడం ద్వారా నాయకత్వ మార్పులకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాజకీయ నాయకులు కొంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని అంచనా.
అంతర్జాతీయంగా పలు దేశాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి అని, సరిహద్దు మార్పులు గురించి ఘర్షణాత్మక వైఖరితో జనం ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని దేశాలు గత పరాజయాలను అధిగమించి కొత్త శక్తితో ముందుకు సాగవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి.
ప్రకృతి వైపరీత్యాలు అనగా తుఫాను, భూకంపాలు వంటి విపత్తులు సంభవించే అవకాశాలపై కూడా పండితులు హెచ్చరికలు చేస్తున్నారు.
ప్రజల్లో… ఆరోగ్యం, మానసిక ఒత్తిడి పెరుగుదల, స్వల్ప అనారోగ్య సమస్యలు మానసిక ఆందోళనలు పెరగడం, దొంగతనాలు లేదా అశాంతి పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సానుకూల అంశాలు : – ఆర్థిక పురోగతి అవకాశాలు మెండుగా ఉన్నాయని, విద్యలో విజయాలు, ప్రేమ, కుటుంబ బంధాలు, ఆప్యాయతలు బలపడటం జరుగుతుందిఅని, అవే కాకుండా ఖర్చులు పెరగడం వంటి వాటితో పాటు…. మొత్తం మీద మిశ్రమ ఫలితాల సంవత్సరంగా చెబుతున్నారు.
జాగ్రత్తలు :– విజయానికి మార్గంగా జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్న ముఖ్యమైన అంశాలు …
- ఆవేశం తగ్గించుకోవాలి,
- తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
- ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి.
- అప్పులు ఇవ్వడం/తీసుకోవడంలో జాగ్రత్త.
- ఆరోగ్య నియమాలు పాటించాలి.
- ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి
- ముఖ్యంగా మాట మీద నియంత్రణ చాలా అవసరం అని పండితుల సూచన.
ముగింపు….
“పరాభవ” నామ సంవత్సరం పేరు కొంత ప్రతికూల భావన కలిగించినప్పటికీ, దీని అంతరార్థం పునరుద్ధరణ, మార్పు, ఎదుగుదల అని పండితులు చెబుతున్నారు.
“మాట అదుపు – ధనం పొదుపు” అనే సూత్రాన్ని పాటిస్తే, ఈ సంవత్సరం సవాళ్లను అధిగమించి విజయ తీరాలకు చేరుకోవచ్చని వారు నొక్కి చెబుతున్నారు.
