Download App

‘అభిజిత్ లగ్నం’ ప్రాముఖ్యత …? భద్రాచలం సీతారాముల కళ్యాణం ఎందుకు అదే ముహూర్తంలో…?

మార్చి 27, 2026 By Suresh Thota
ఆధ్యాత్మిక సంప్రదాయాలలో, జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక స్థానం పొందినది "అభిజిత్ లగ్నం"… దీని పై మరోసారి చర్చ మొదలైంది. ఎందుకంటే ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం లో జరిగే సీతారాముల కళ్యాణం ఈ అభిజిత్ ముహూర్తంలోనే నిర్వహించడం వెనుక ఉన్న కారణాలపై ఆసక్తికర విషయాలు మననం చేసుకుందాం....
'అభిజిత్ లగ్నం' ప్రాముఖ్యత …? భద్రాచలం సీతారాముల కళ్యాణం ఎందుకు అదే ముహూర్తంలో…?

ఆధ్యాత్మిక సంప్రదాయాలలో, జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక స్థానం పొందినది “అభిజిత్ లగ్నం”… దీని పై మరోసారి చర్చ మొదలైంది. ఎందుకంటే ముఖ్యంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం లో జరిగే సీతారాముల కళ్యాణం ఈ అభిజిత్ ముహూర్తంలోనే నిర్వహించడం వెనుక ఉన్న కారణాలపై ఆసక్తికర విషయాలు మననం చేసుకుందాం.

అభిజిత్ లగ్నం అంటే ఏమిటి తెలుసుకుందాం…

ఒక రోజులో 24 గంటలను 30 ముహూర్తాలుగా విభజిస్తారు. వాటిలో పగటి సమయంలో వచ్చే ఎనిమిదవ ముహూర్తాన్ని “అభిజిత్ ముహూర్తం” అంటారు. ఇది సాధారణంగా మధ్యాహ్న సమయంలో వస్తుంది. ఈ కాలాన్ని “విజయ ముహూర్తం” అని కూడా అంటారు. సర్వదోషాలను తొలగించే శక్తి కలిగినదిగా శాస్త్రాలు పేర్కొంటాయి. అందుకే అత్యవసర పనులు, ప్రయాణాలు, ముఖ్య నిర్ణయాలకు ఇది శ్రేష్ఠమైన కాలంగా భావిస్తారు.

నారద పురాణం ప్రకారం మధ్యాహ్నం 12:00 గం కు పూర్వము ఒక ఘడియ తరువాత ఒక ఘడియ అనగా 11:36 గం నుండి మధ్యాహ్నం 12:24 గం వరకు అభిజిత్ ముహుర్తము. సూర్యోదయం నుండి నాల్గవ లగ్నం అభిజిత్ లగ్నము, ఈ లగ్నం సుదర్శన చక్రము వలె సర్వ దోషములను హరిస్తుంది అంటారు.

మైదాన ప్రాంతాలలో వేద పండితులు, దైవజ్ఞులు ఉండటం వలన ఆయా ప్రాంతాల్లో పంచాంగం కర్తలు ఉండి ముహూర్తాలు పెట్టడం అనేది జరుగుతుంది. కొండ ప్రాంతాల్లో వీరు ఉండే అవకాశాలు తక్కువగా ఉండటం వలన, ఈ అభిజిత్ లగ్నం లోనే అందరికీ వీలుగా ఉండేలా ఈ ముహూర్తం నిర్దేశించారు అని కొంతమంది భావన…. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ ఇదే ముహూర్తాన్ని పాటిస్తుంటారు.

భద్రాచలం లో శ్రీ సీతారాముల కళ్యాణం అభిజిత్ ముహూర్తంలోనే నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ కళ్యాణానికి హాజరు అవుతారు. ఈ భద్రాద్రి సీతారాముల కళ్యాణం దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. ఈ కళ్యాణాన్ని అభిజిత్ ముహూర్తంలోనే నిర్వహించడం వెనుక ప్రధాన కారణం శ్రీరాముడు జన్మించిన సమయం కూడా మధ్యాహ్న సమయంలోనే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన వివాహాన్ని కూడా అదే సమయానికి నిర్వహిస్తారు. అభిజిత్ అంటే “విజయం” అనే అర్థం.

ఆగమ శాస్త్రాల ప్రకారం అభిజిత్ ముహూర్తం

అన్ని దోషాలను తొలగిస్తుంది, శుభఫలితాలను ఇస్తుంది. అందుకే దైవకార్యానికి ఇది అత్యుత్తమ కాలంగా పరిగణిస్తారు. భద్రాచలం ఆలయ చరిత్రలో భక్త రామదాసు ది కీలక పాత్ర. 17వ శతాబ్దంలో ఆయన ఆలయాన్ని అభివృద్ధి చేసి, శ్రీరాముడికి నిత్యపూజలు, ఉత్సవాలను వ్యవస్థీకరించారు. శ్రీ రామదాసు కాలంలోనే సీతారాముల కళ్యాణం నిర్వహణకు స్థిరమైన పద్ధతులు అవలంబించారు. అయితే అభిజిత్ ముహూర్తంలోనే చేయాలనే సంప్రదాయం, జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా, ఆలయ ఆగమ సంప్రదాయాల ఆధారంగా క్రమంగా బలపడినదిగా పండితులు భావిస్తున్నారు. అంటే ఈ పద్ధతి పూర్తిగా రామదాసు కాలం నుంచే మొదలైంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ, ఆయన కాలంలోనే దీని ప్రాముఖ్యత పెరిగింది.

జ్యోతిష్య గ్రంథాల ప్రకారం అభిజిత్ ముహూర్తం అన్ని పనులకు మంచిదే, కానీ వివాహం వంటి వాటికి కొందరు అనుకూలం కాదని చెబుతారు కాని, భద్రాచలం లో స్వామి వారి కళ్యాణానికి ఇది వర్తించదు… ఎందుకంటే ఇది సాధారణ మానవ వివాహం కాదు, దైవిక కళ్యాణం అందువలన ఇది వర్తించదు. (దేవాలయ ఉత్సవం)

అభిజిత్ ముహూర్తం ముఖ్యంగా ప్రయాణాలకు అత్యంత శుభప్రదం. పంచాంగ దోషాలు ఉన్నా కూడా ఉత్తమ ఫలితాన్ని ఈ ముహూర్తం ఇస్తుందని నమ్మకం కాని, దక్షిణ దిశ ప్రయాణం మాత్రం చేయకూడదు అని కొందరు సూచిస్తున్నారు.

ముగింపు: అభిజిత్ లగ్నం అనేది జ్యోతిష్యంలో అత్యంత శక్తివంతమైన శుభకాలంగా భావించబడుతుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading