2025 బాక్సాఫీస్.. చిన్న సినిమాలదే పెద్ద విజయం
డిసెంబర్ 31, 2025 Published by Srinivas

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే బాలీవుడ్. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే. తగ్గేదేలే అన్నంతగా దూసుకుపోతోంది టాలీవుడ్. 2024లో తన హవా చూపించిన టాలీవుడ్, 2025లో కూడా ప్రభంజనం కొనసాగింది. ఎప్పట్లానే విజయాల శాతం సింగిల్ డిజిట్ దాటనప్పటికీ, సక్సెస్ అయిన సినిమాలు మాత్రం సరిహద్దులు దాటాయి. రికార్డ్ కలెక్షన్లతో యావత్ దేశం ఆశ్చర్యపోయేలా చేశాయి.
కేవలం మాస్, హీరోయిజం ఉన్న చిత్రాలకే పరిమితమైపోలేదు పరిశ్రమ. ఓవైపు భారీ బడ్జెట్ సినిమాలను ఆదరిస్తూనే, మరోవైపు విభిన్నమైన కథాంశాలతో వచ్చిన చిన్న సినిమాలకూ బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు. 2025లో అలా మెరిసిన చిత్రాల సమాహారం మీకోసం..

ఏడాది బిగ్గెస్ట్ సినిమా, ఆరంభంలోనే వచ్చేసింది. అదే ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేశ్ హీరోగా అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం, సిసలైన సంక్రాంతి హిట్ గా నిలిచింది. అంతేకాదు, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వకపోయినా, 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి టాలీవుడ్ మార్కెట్ సత్తా చాటింది.
వెంకటేశ్ కెరీర్ లోనే కాదు, దిల్ రాజు బ్యానర్ పై కూడా కూడా ఇదే అతిపెద్ద విజయం. అప్పటికే ఓ భారీ డిజాస్టర్ తో ఇబ్బంది పడుతున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ను ఒడ్డున పడేసింది ఈ చిత్రం. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు. జనవరిలో రిలీజైన ఈ సినిమా రికార్డును డిసెంబర్ వచ్చినా ఇంతవరకు మరో సినిమా అధిగమించలేకపోయింది. అలా ఈ ఏడాది అతిపెద్ద విజయంగా నిలిచింది ‘సంక్రాంతికి వస్తున్నాం’.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రేంజ్ లో కాకపోయినా, ఉన్నంతలో విజయవంతమైన చిత్రం ‘డాకూ మహారాజ్’. బాలకృష్ణ-బాబీ కలయికలో వచ్చిన ఈ చిత్రం, సంక్రాంతి అడ్వాంటేజ్ ను చక్కగా క్యాష్ చేసుకుంది. ఫలితంగా ఈ ఏడాది అత్యథిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా అవతరించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇది బయ్యర్లకు నష్టాలు తెచ్చిపెట్టిందనేది కఠోర వాస్తవం.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్లుగా నటించగా.. బాబీ డియోల్ తెలుగుతెరకు విలన్ గా పరిచయమయ్యాడు. తమన్ సంగీత దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది.

సంక్రాంతి సినిమాల సందడి ముగిసిన తర్వాత వచ్చి, ఘనవిజయం సాధించిన చిత్రం ‘తండేల్’. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి పాటలు, ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం, అతడి కెరీర్ లోనే అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. సాయిపల్లవి హీరోయిన్ గా నటించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఇక ‘కోర్ట్’ సినిమా నుంచి ఈ ఏడాది చిన్న సినిమాల హవా మొదలైంది. ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు ఓ వైరల్ సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలైన తర్వాత కంటెంట్ తో ఎట్రాక్ట్ చేసింది. నాని నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా, అతడి బ్యానర్ ప్రతిష్టను మరింత పెంచడంతో పాటు, టాలీవుడ్ కు ఓ మంచి సక్సెస్ అందించింది. రెవెన్యూ పరంగా చెప్పాలంటే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా తర్వాత మంచి లాభాలు తెచ్చిపెట్టిన రెండో సినిమాగా నిలిచింది ‘కోర్ట్’.

ఇక ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. చిన్న సినిమాగా వచ్చిన ‘మ్యాడ్’ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇది అంతకుమించి విజయాన్ని సాధించింది. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కలిసి చేసిన హంగామా, కుర్రాళ్లకు మంచి వినోదాన్ని అందించడంతో పాటు, నిర్మాత నాగవంశీకి మంచి లాభాల్ని కూడా తెచ్చిపెట్టింది.

మిడ్ రేంజ్ హీరోల్లో ఇప్పటికే ఉన్నత స్థానానికి చేరుకున్న నాని, 2025లో కూడా మరపురాని విజయాన్ని అందించాడు. సూపర్ హిట్టయిన ‘హిట్’ ఫ్రాంచైజీకి సీక్వెల్ గా తెరకెక్కిన ‘హిట్ – ది థర్డ్ కేస్’ చిత్రంతో మరో విజయాన్ని అందుకున్నాడు. ‘హిట్-3’గా పిలిచే ఈ సినిమాను శైలేష్ కొలను డైరక్ట్ చేయగా, నేచురల్ స్టార్ కెరీర్ లో విలక్షణ చిత్రంగా నిలిచింది. అయితే ఓవరాల్ గా విజయం కింద నమోదైనప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో బయ్యర్లను ఇది ఆదుకోలేకపోయిందనేది వాస్తవం.
సైలెంట్ గా వచ్చి మంచి విజయాన్నందుకున్న మరో చిత్రం ‘సింగిల్’. శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు డైరక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది విజయాల్లో ఒకటగా నిలిచింది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది శ్రీవిష్ణు చేసిన సినిమా ఇదొక్కటే. చేసిన ఒక్క సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు ఈ చిన్న హీరో.

ఇక భారీ అంచనాలతో వచ్చి ఆ అంచనాల్ని అందుకున్న చిత్రం ‘కుబేర’. సుదీర్ఘ విరామం తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నందుకుంది. అదే టైమ్ లో ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని కూడా కలిగించింది. ధనుష్, నాగార్జున, రష్మిక నటించిన ఈ ఎమోషనల్ డ్రామా, విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్ అనిపించుకుంది. నాగార్జున హీరో పాత్రల నుంచి కాస్త పక్కకొచ్చి, కొత్తగా ప్రయత్నించడం ఈ సినిమాతోనే మొదలైంది. అలా కుబేర సినిమా నాగ్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది.

‘కోర్ట్’, ‘మ్యాడ్ స్క్వేర్’, ‘సింగిల్’ సినిమాల తర్వాత మరో చిన్న సినిమా ఘన విజయం సాధించింది. ఇంకా చెప్పాలంటే, చిన్న సినిమాల్లో పెద్ద విజయం దీనిదే. అదే ‘లిటిల్ హార్ట్స్’ సినిమా. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకుంది. సాయి మార్తాండ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో మౌళి, శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించారు. యువతకు నచ్చే అంశాలతో, సునిశిత హాస్యంతో, ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఈ సినిమా అందరికీ నచ్చింది. మరీ ముఖ్యంగా మౌళి యాక్టింగ్ కు కుర్రకారు కనెక్ట్ అయ్యారు.

ఓవైపు చిన్న సినిమాలు సక్సెస్ అవుతుంటే, మరోవైపు పెద్ద సినిమాలు కూడా అదే ఊపు కొనసాగించాయి. అలా వచ్చిందే ‘మిరాయి’. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమా హిట్టయింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో పాటు, సనాతన ధర్మాన్ని చూపించిన విధానం అందరికీ నచ్చింది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా, దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఈ సంవత్సరం అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.

‘మిరాయి’ తర్వాత ‘ఓజీ’ థియేటర్లలోకి వచ్చింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఆ స్థాయిలో అంచనాలు అందుకోలేకపోయినప్పటికీ, పవన్ స్టార్ డమ్ కు తగ్గట్టు భారీగా వసూళ్లు సాధించింది. సుజీత్ దర్శకత్వంలో, దానయ్య నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడక్కడ బయ్యర్లు ఇబ్బంది పడినప్పటికీ, ఓవరాల్ గా పవన్ బాక్సాఫీస్ సత్తాను మరోసారి టాలీవుడ్ కు రుచి చూపించింది ‘ఓజీ’ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
గతేడాది ‘క’ సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం, ఈ ఏడాది కూడా తనకుంటూ ఓ విజయాన్ని నమోదుచేశాడు. అతడు నటించిన ‘కె-ర్యాంప్’ సినిమా దీపావళి బరిలో విజేతగా నిలిచింది. నిజానికి ఈ సినిమాకు ప్రారంభంలో నెగెటివ్ టాక్ వచ్చింది, అయినప్పటికీ సినిమా విజయతీరాన్ని చేరింది. ఈ ఏడాది నెగెటివ్ టాక్ తో మొదలై, విజయం అందుకున్న సినిమా ఇదే. జైన్స్ నాని డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. కెరీర్ లో ఆమెకిదే తొలి విజయం.
చిన్న సినిమాల్లో కాస్త పెద్ద సినిమాగా చెప్పుకోవచ్చు ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాన్ని. ఎందుకంటే రష్మిక లాంటి స్టార్ హీరోయిన్, అల్లు అరవింద్ లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బ్యాకింగ్ తో వచ్చింది కాబట్టి. గట్టిగా ప్రచారం చేసిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. పెట్టిన పెట్టుబడికి తగ్గ ఆదాయం కూడా అందుకుంది. ఓవరాల్ గా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా యావరేజ్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాతో నటిగా రష్మిక మరో మెట్టు పైకెదిగింది.
ఇక ఏడాది చివర్లో మరో రెండు చిన్న సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం ఈ ఏడాది కొసమెరుపు. ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. వీటికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలు పక్కనపెడితే.. ఈ చిన్న సినిమాలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రావడం, ప్రేక్షకులు ఈ సినిమా చూడ్డానికి థియేటర్లకు రావడమే పెద్ద విషయం.
ఇక 2025కు ఫినిషింగ్ టచ్ ఇస్తూ వచ్చింది ‘అఖండ-2’. బాలకృష్ణ-బోయపాటి సూపర్ హిట్ కాంబినేషన్ ఈ సినిమాకు అతిపెద్ద బలం. ఇప్పటివరకు పరాజయం అన్నదే ఎరగని ఈ జంట, ‘అఖండ-2’తో మాత్రం బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయారు. ఇంకా చెప్పాలంటే ఘోర పరాజయం పాలైంది. కొన్నవాళ్ళు అందరూ 50 శాతం నష్టపోతున్నారు. డిసెంబర్ లో ఒక్క భారీ హిట్ లేదు.
ఇలా ఈ ఏడాది 240కి పైగా చిత్రాలు రిలీజ్ అవ్వగా, 16 సినిమాలు విజయం సాధించాయి. వీటిలో ఎక్కువగా చిన్న సినిమాలే ఉండడం 2025 టాలీవుడ్ బాక్సాఫీస్ ప్రత్యేకత.
