డిసి మూవీ రివ్యూ
Published ఆగస్ట్ 7, 2026 by Srinivas
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్‌గా.. మాస్ కమర్షియల్ మూవీస్‌కి కేరాఫ్‌గా పేరుగాంచిన లోకేష్ కనకరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం డీసీ (DC). ఈ సినిమాపై ఎందుకోగానీ తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి కారణం ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ కూడా కావొచ్చు. యాక్షన్, రొమాన్స్, క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
సర్కార్ టీమ్‌లో పనిచేసే గ్యాంగ్‌స్టర్.. దేవదాస్(లోకేష్ కనగరాజ్). గ్యాంగ్‌స్టర్ అయినా కూడా మంచి మనసున్న వ్యక్తి. ఓ వ్యక్తి తన కొడుకును ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలని కోరుకుంటాడు. ఈ క్రమంలోనే తన పొలం అమ్మి డబ్బు తీసుకుని పట్నానికి బయలుదేరాడు. మధ్యలో ఓ బ్రిడ్జిపై పోలీసులు ఉంటారు. అతని దగ్గర రూ.7 లక్షలు ఉన్నాయని తెలుసుకుని అతడిని చంపేసి ఆ డబ్బును పంచుకుంటారు. అదేంటని ప్రశ్నించిన అతని భార్యపై బ్రోతల్ కేసు ఓపెన్ చేస్తామంటూ బెదిరిస్తారు. ఆమె న్యాయం కోసం సర్కార్ దగ్గరకు వెళ్లి తన బాధను వెల్లడిస్తుంది. అప్పుడు సర్కార్ తన టీంను స్టేషన్‌కు పంపిస్తాడు. దేవదాస్ టీమ్ ఆ పోలీస్‌ని చంపేస్తారు. దీంతో సర్కార్ టీమ్‌ని ఏరేందుకు బోగరాజు సారథ్యంలోని పోలీస్ టీమ్ రంగంలోకి దిగుతుంది. కానీ దేవదాస్ టీం వాళ్లకి చిక్కకుండా వెళ్లి ఓ హోటల్‌లో తలదాచుకుంటారు. అక్కడ దేవదాస్.. పార్వతి(సంజనా కృష్ణమూర్తి)ని చూస్తాడు. ఆమెతో పరిచయం కాస్త ప్రేమగా మారుతున్న తరుణంలో ఓ అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ ఘటన తర్వాత దేవదాస్ ఏం చేస్తాడు? చంద్ర (వామికా గబ్బి) ఎవరు? దేవదాస్, చంద్రల పరిచయం ఎక్కడ.. ఎలా జరుగుతుంది? చివరికి ఈ కథ ఎటు వెళుతుంది? వంటి అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
దేవదాస్, పార్వతి కథ ఎంత పెద్ద సక్సెస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘దేవదాస్’ చిత్రానికి అడ్వాన్స్‌డ్ వర్షన్‌గా దీనిని చెప్పవచ్చు. ఒకవైపు క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. వాటి మధ్య అంతర్లీనంగా అందమైన ప్రేమకథ నడుస్తూ ఉంటుంది. ఎక్కడా ఎలాంటి వల్గారిటీ లేదు. ఒక డిగ్నిఫైడ్ ప్రేమకథ. అయితే వైలెన్స్ బాగా ఎక్కువైంది. ఒక పేదవాడికి న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేసినప్పుడు దానికి హీరో గ్యాంగ్ చేసే తిరుగుబాటుతో అసలు కథ ఆరంభమవుతుంది. ఒక హత్య ఎన్నో హత్యలకు కారణమవుతుంది. యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే బ్లడ్ పారించారు. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులతో విజిల్స్ కొట్టించారు. ఇక సంజన, వామిక రోల్స్‌ను మారిస్తే బాగుండేదేమో అనిపించింది. సంజన చాలా అందంగా కనిపించింది. వామికా ఎందుకోగానీ లుక్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, ఒక మంచి ప్రేమకథ, ఒక ప్రొస్టిట్యూట్ పడే వేదన.. అవకాశం వస్తే ఆమె తనను వేధించిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది వంటి అంశాలను చక్కగా చూపించారు. ఈ సినిమాకు మైనస్ అంటే వైలెన్స్‌తో పాటు ఇది కూడా చెప్పాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సీన్లు కన్విన్సింగ్‌గా అనిపించవు. కొంచెం సాగదీతగా కూడా అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే డిసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఎవరెలా నటించారంటే..
లోకేష్ కనగరాజ్.. దర్శకుడే కాదు.. హీరో మెటీరియల్ కూడా అనిపించారు. సినిమా ఆద్యంతం తనలోని ఎమోషన్స్‌ను క్యారీ చేస్తూనే.. సీరియస్‌నెస్ మెయిన్‌టైన్ చేయడం ఆకట్టుకుంటుంది. తన పాత్రకు తగినట్టుగా చక్కగా నటించారు. సంజనా కృష్ణమూర్తి పాత్ర నిడివి చాలా తక్కువ. అయినా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వామికా గబ్బి కూడా నటన పరంగా బాగానే చేసింది. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..
టెక్నికల్ పరంగా చెప్పాలంటే ముందుగా దర్శకుడు అరుణ్ గురించి చెప్పాలి. యాక్షన్ సీన్లను అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు డీసెంట్ ప్రేమకథను సైతం నడిపించారు. ఎడిటింగ్ పరంగా జాగ్రత్తవహించి ఉంటే బాగుండేది. మ్యూజిక్ పరంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ అద్భుతంగా BGM ఇచ్చారు, ఈ సినిమాకి మెయిన్ హీరో అనిరుధ్ అని చెప్పొచ్చు, కొన్ని కొన్ని సన్నివేశాల్లో మనం నిరాశపడతాం అనే సమయానికి తన BGM సినిమాని మరోస్తాయికి తీసుకెళ్తాయి
ఫైనల్‌గా.. వైలెన్స్ మాటున దాగిన అందమైన ప్రేమకథ
Rating: 



(3.25/5)
