ఇట్లు అర్జున మూవీ రివ్యూ
Published నవంబర్ 13, 2026 by Srinivas
Itlu Arjuna Review Telugu: అనీష్, అనశ్వర రాజన్ జంటగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. వెంకీ కుడుముల నిర్మాణంలో తమన్ సంగీతం అందించిన చిత్రమిది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Anaswara Rajan’s Itlu Arjuna Movie Review In Telugu:
కింగ్ అక్కినేని నాగార్జున, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి మొదలు పెడితే… తెలుగులో పలువురు స్టార్ హీరోలు ప్రమోట్ చేసిన సినిమా ‘ఇట్లు అర్జున’. ‘షిరిడీ సాయి’ నిర్మాత మహేష్ రెడ్డి రెండో కుమారుడు అనీష్ హీరోగా పరిచయం అయ్యారు. అనశ్వర రాజన్ హీరోయిన్. వెంకీ కుడుముల నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. పాటలతో పాటు ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచాయి. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.
కథ (Itlu Arjuna Movie Story):
అర్జున్ (అనీష్) దొంగ. చిన్నప్పటి నుంచి కీర్తి (అనశ్వర రాజన్) అంటే ప్రేమ. మూగవాడు కావడంతో ఆ విషయాన్ని చెప్పలేడు. అర్జున్ దొంగ కావడంతో అతడిని బిల్డింగ్ వాసులందరూ వెలి వేస్తారు. ఒక్కరు కూడా మాట్లాడరు. అనూహ్యంగా కీర్తి ఫ్రెండ్ అవుతుంది. ఆమెకు ఓ సాయం చేయబోయి ఆమెతో పాటు మర్డర్ విట్నెస్ అవుతాడు అర్జున్.
అర్జున్ కోసం ఓ వైపు పోలీసులు, మరోవైపు పెద్దన్న (ముఖేష్ రుషి) గ్యాంగులో పని చేసే రౌడీలు వెతకడం మొదలు పెడతారు. వెయ్యి కోట్ల రూపాయల హవాలాకు చెందిన ఓ రహస్యం అర్జున్ చేతికి చిక్కుతుంది. అప్పుడు అతను ఏం చేశాడు? ప్రాణాపాయం నుంచి ఎలా తప్పించుకున్నాడు? కీర్తిని ఎలా కాపాడాడు? చివరకు తన ప్రేమను చెప్పాడా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ: కొత్త కుర్రాడిని పరిచయం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రాబోయే రోజుల్లో అతడికి ఈ సినిమా ఫౌండేషన్ అవ్వాలి. స్టార్ కిడ్స్ అయితే ఫ్యామిలీ ఇమేజ్ ఉంటుంది కనుక భారీ ఫైట్లు, యాక్షన్ సీక్వెన్సులూ చేసినా చెల్లుతుంది. అనీష్ నిర్మాత తనయుడు కావడంతో బాయ్ నెక్స్ట్ డోర్ తరహా దొంగ క్యారెక్టర్ రాసుకుని, అతనికో క్యూట్ – సింపుల్ లవ్ స్టోరీ రాసి… కమర్షియల్ ఫార్మాట్ కథలోకి ఆ క్యారెక్టర్, ప్రేమ కథను తీసుకువెళ్లి మంచి పని చేశారు దర్శకుడు మహేష్ ఉప్పాల.
జీ5 ఓటీటీలో వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ’కి దర్శకత్వం వహించిన మహేష్ ఉప్పాల… ‘ఇట్లు అర్జున’తో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అయ్యారు.మొదటి సినిమాకు హీరో క్యారెక్టర్ పరంగా కమర్షియల్ ఫార్మాట్ నుంచి బయట పడటానికి ప్రయత్నించారు. అయితే విలన్ ట్రాక్ మాత్రం మరీ రొటీన్ పంథాలో రాసుకున్నారు. వెయ్యి కోట్లు హవాలా డబ్బు కోసం, నేర సామ్రాజ్యంలో పెద్దన్న స్థానంపై కొందరు కన్నేయడం, పెద్దన్న కొడుకును చంపేయడం వంటివి సినిమా ప్రారంభంలో ఆసక్తి కలిగించాయి. అయితే… అనీష్, అనశ్వర ప్రేమ కథ మొదలైన తర్వాత ఆ కోట్ల కథ సైడ్ ట్రాక్ అయ్యింది. తమన్ పాటలకు తోడు కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది. ఇంటర్వెల్ వరకు అసలు ఎటువంటి జర్క్ లేకుండా సాఫీగా సాగింది. ఇంటర్వెల్ తర్వాత నుంచి వెయ్యి కోట్ల కథలోకి హీరో హీరోయిన్లు ఎంటరైన తర్వాత వచ్చే సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మళ్లీ రొటీన్ కమర్షియల్ పంథాలోకి సినిమాను తీసుకు వెళ్ళాయి. చివరకు కమర్షియల్ ఎండింగ్ ఇచ్చారు.

‘ఇట్లు అర్జున’కు బిగ్గెస్ట్ ప్లస్ తమన్ మ్యూజిక్. మంచి పాటలు ఇచ్చారు. వాటికి కొరియోగ్రఫీ కూడా బావుంది. ఆర్ఆర్ విషయంలో కూడా తక్కువ ఏం చేయలేదు. కానీ కొన్ని సన్నివేశాల్లో పవన్ ‘ఓజీ’ని గుర్తు చేశారు. సినిమాటోగ్రఫీ సైతం బావుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ ఫీల్ తీసుకు వచ్చింది. వెంకీ కుడుముల నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో ఉన్నాయి. కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేసేటప్పుడు అంతఖర్చు చేయడం రిస్క్. అయినా తగ్గలేదు.
మొదటి సినిమాకు మూగవాడి క్యారెక్టర్ చేయడం అంత సులభం కాదు. డైలాగులు లేకున్నా హావభావాలతో చాలా వరకు మెప్పించారు అనీష్. హీరో అన్నట్టు కాకుండా మనలో ఒకడు అని ఆడియన్స్ కనెక్ట్ అయ్యే పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అనశ్వర రాజన్ క్యూట్ లుక్స్, ఇంప్రెస్సివ్ యాక్టింగ్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకోవడం గ్యారెంటీ. వెన్నెల కిషోర్ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో నవ్వించారు. బ్రహ్మాజీ, గెటప్ శ్రీను కూడా! ముఖేష్ రుషిది రెగ్యులర్ విలన్ రోల్. ఆయన లుక్ బాలేదు. పెట్టుడు గెడ్డం, మీసం మరీ తెలిసిపోతున్నాయి. ఎలాంగో కుమారవేల్, అట్టకత్తి దినేష్, అరుణ భిక్షు, రోహన్ రాయ్ తదితరులు తమ తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.
Itlu Arjuna Movie Verdict:
హీరో క్యారక్టర్ పరంగా కొత్తగా… కథ (హీరో వర్సెస్ విలన్ గేమ్) & స్క్రీన్ ప్లే పరంగా కమర్షియల్ పంథాలో తీసిన సినిమా ‘ఇట్లు అర్జున’. ట్విస్టులు, కొన్ని సన్నివేశాలను దర్శకుడు మహేష్ ఉప్పాల బాగా హ్యాండిల్ చేశారు. ఇదొక డీసెంట్ కమర్షియల్ ఫిల్మ్. తమన్ పాటలు బావున్నాయి. అనీష్, అనశ్వర మధ్య ప్రేమకథతో పాటు వాళ్ళిద్దరి నటన కూడా బావుంది. కమర్షియల్ సినిమా ప్రేమికులను మెప్పిస్తుంది.
Rating: 



(3/5)
