చంద్రయాన్ మూవీ రివ్యూ
Published నవంబర్ 13, 2026 by Srinivas
Chandrayaan Review Telugu: వేణు ఊడుగుల సమర్పణలో విడుదలైన సినిమా ‘చంద్రయాన్’. రాకెట్ తయారు చేసి చంద్రుడి మీదకు వెళ్లాలని ప్రయత్నించిన ఓ యువకుడి కథ ఇది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Chandrayaan 2026 Movie Review:
దర్శకుడిగా ‘నీది నాదీ ఒకే కథ’, ‘విరాటపాలెం’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన వేణు ఊడుగుల… ‘రాజు వెడ్స్ రాంబాయి’తో నిర్మాతగా మారారు. ఆ సినిమా విజయం తర్వాత ఆయన సమర్పణలో ‘చంద్రయాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివకుమార్ ఢీకొండ, స్వప్న ప్రియదర్శిని జంటగా శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ప్రవీణ్ మొలక నిర్మాత. ఈ సినిమా ఎలా ఉంది?
కథ (Chandrayaan 2026 Movie Story):
శివ (శివకుమార్ ఢీకొండ), అతని స్నేహితులు (రవి శివతేజ, వంశీధర్ గౌడ్)లకు శనిగాళ్ల సంఘం అని పేరు పెడతారు మందమర్రి ఊరి జనాలు. వాళ్ళు చేసే పనులు భరించలేక తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటేస్తారు. బైక్ రిపేరింగ్ రాకపోయినా గూగుల్‌ను అడుగుతూ తమకు వచ్చింది చేస్తూ మెకానిక్ షెడ్ పెడతారు. ఊరిలోకి కొత్తగా వచ్చిన బిందు (స్వప్న ప్రియదర్శిని)ని చూసి ప్రేమలో పడతాడు. ఏం సాధించావని పెళ్లి చేసుకోవాలని బిందు ప్రశ్నించడంతో రాకెట్ తయారు చేసి చంద్రుడు మీదకు వెళ్లాలని రెడీ అవుతాడు. అతనికి స్నేహితులు సాయం వస్తారు. శివ, అతని శనిగాళ్ళ సంఘం కలిసి రాకెట్ తయారు చేశారా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ (Chandrayaan 2026 Movie Analysis):
పరమానందయ్య శిష్యుల కథలు ఎప్పుడూ వినోదాన్ని పంచుతాయి. అందుకు కారణం… అమాయకత్వంతో శిష్యులు చేసే పనులు. ఓ ఊరిలో అటువంటి ముగ్గురు కుర్రాళ్ళ కథ ‘చంద్రయాన్’. తాతయ్య ఊరికి, ఊరిలో ప్రజలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ బతికే కుర్రాడు హీరో అయితే… స్నేహితుల్లో ఒకరికి జాతకాల పిచ్చి. ముహూర్తం చూడకుండా ఒక్క పని కూడా చేయడు. మరొకడు గూగుల్‌ను అడగకుండా ఏదీ చేయడు. వీళ్ళకు ఓ చిన్న పిల్లాడు కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పేపర్ మీద ఈ ఐడియా ఎగ్జైట్ చేసి ఉండొచ్చు. కానీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యాక సీన్స్, స్క్రీన్ ప్లే, ఫ్లో ఎలా ఉందో చూసుకోవాలి కదా. దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్, మిగతా టీమ్ ఒక్కసారి కూడా చెక్ చేసుకున్నట్టు లేదు. దాంతో హాఫ్ బేక్డ్ ప్రోడక్ట్ తెరపైకి వచ్చింది.

అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు… అమ్మాయి ప్రేమ కోసం రాకెట్ తయారు చేస్తాడు. అది సక్సెస్ అయ్యిందా? ఫెయిల్ అయ్యిందా? అనేది పక్కన పెడితే అతనిలో నిజాయతీ నచ్చి పెళ్ళికి సిద్ధపడుతుంది హీరోయిన్. మూడు ముక్కల్లో చెప్పే కథను రెండు గంటలు సాగదీశారు. ఒక్క సీన్, ఒక్క డైలాగ్ కూడా ఆకట్టుకోదు.
‘చంద్రయాన్’ సినిమా ఎక్కడ మొదలైందో ఇంటర్వెల్ దగ్గర కూడా అక్కడే ఉంటుంది. ఓ అరగంట నిద్రపోయి లేచినా సరే కథ ముందుకు కదలదు. ఊరందరి చేత చివాట్లు తినే బ్యాచ్‌ను చూపించారు. కథకు, క్యారెక్టర్లకు ఒక పర్పస్ ఉన్నట్టు అనిపించదు, కనిపించదు. పరమానందయ్య శిష్యులు లాంటి ముగ్గురు కుర్రాళ్లు అనుకున్నారు కానీ… వాళ్ళు చేసే పనుల్లో అమాయకత్వం మచ్చుకైనా కనిపించదు. ఊళ్ళో చెట్టుకింద చెప్పే కథలను మధ్యలో ఆపిస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఎంతో కొంత ఆసక్తి కలుగుతుంది. ‘చంద్రయాన్’ చూసేటప్పుడు అటువంటి ఆసక్తి ఒక్క శాతం కూడా కలగదు. అసలు దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ రాసిన డైలాగుల్లో ఒక్క జోక్ పేలలేదు. అంత పకడ్బందీగా స్క్రిప్ట్ రాశారు. రెండు గంటల సినిమాలో కొత్త డైలాగులు రాయడానికి కూడా ఆయన పెన్నులో ఇంక్ సరిపోలేదనుకుంట. ‘పీకినవ్ తియ్’ డైలాగును పదేపదే వినిపించారు. అదొక సిగ్నేచర్ స్టైల్, గొప్ప ఘనతలా ఫీలయ్యారు. స్నేహితులు ముగ్గురు చేత వేయించిన సిగ్నేచర్ స్టెప్ సైతం ఒక దశ తర్వాత విసిగిస్తుంది. రాకెట్ తయారీ సన్నివేశాలు మరింత నత్త నడకన సాగాయి. రాకెట్‌లో ‘థామస్’ అంటూ హీరో డైలాగులు చెప్పేటప్పుడు సహనం పూర్తిగా నశిస్తుంది. ఆ క్లైమాక్స్ ఏదో చూపిస్తే థియేటర్ నుంచి బయట పడొచ్చని ప్రేక్షకుడు ఎదురు చూసేలా దర్శకుడు సినిమా తీశారు.
టెక్నికల్ టీమ్, ప్రొడక్షన్ వేల్యూస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క పాట గుర్తు ఉండదు. సినిమా చూసేటప్పుడు కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ వంటివి రిజిస్టర్ అయ్యేలా ఉండవు. వేణు ఊడుగుల ఈ సినిమాను ఎందుకు ప్రజెంట్ చేశారనేది అర్థం కాదు. ఈ మూవీలో ఆయనకు ఏం నచ్చిందో అంతు బట్టదు.
హీరో శివకుమార్ ఢీకొండ నటనలో మెరుపులు లేవు. యాక్టింగ్, డైలాగ్ డెలివరీలో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని తెలంగాణ అమ్మాయిలా కనిపించలేదు. ఈవెంట్స్, టీవీ షోలలో ఛాన్స్ దొరికితే పంచ్ డైలాగులు వేసి నవ్వించే వంశీధర్ గౌడ్‌కు… ‘చంద్రయాన్’లో గూగుల్ మామను అడుగుతా అనడం తప్ప నటుడిగా ట్యాలెంట్ చూపించే అవకాశం రాలేదు. రవి శివతేజకూ అంతే. అప్పాజీ అంబరీష మాత్రం ఉన్నంతలో హుందాగా చేశారు. సినిమా చివరిలో జర్నలిస్ట్ సురేష్ కొండేటి అతిథి పాత్రలో మెరిశారు.
Chandrayaan 2026 Movie Final Verdict:
‘చంద్రయాన్’లో హీరో శివకుమార్ ఢీకొండకు ప్రతిసారీ ఓ ఊతపదం చెబుతారు… ‘పీకినావ్ తియ్’ అని. మినిమమ్ 30సార్లు అయినా చెప్పి ఉంటారు. సినిమా అంతా అయ్యాక ఎవరైనా ‘చంద్రయాన్ ఎలా ఉంది?’ అని అడిగితే ‘పీకింది తియ్’ అని చెప్పాలనిపిస్తుంది. అంతలా విసిగిస్తుంది. తెలంగాణ నేపథ్యంలో సినిమా అంటే తాగుడు, తినుడు, గొడవలు పడుడు అని ప్రేక్షకులు ఓ అభిప్రాయానికి వచ్చేలా కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ తాగుడు, తినుడు, గొడవలు వంటివి లేకుండా సినిమా తీసినందుకు ‘చంద్రయాన్’ దర్శక నిర్మాతలను అభినందించాలి. షార్ట్ ఫిల్మ్ కు సరిపడా కథ, సన్నివేశాలతో ఫీచర్ ఫిల్మ్ తీశారు. స్కిప్ కొట్టడం మంచిది.
Rating: 



(1/5)
