Download App
Movie Poster

Ramayana: Rise of a Legend

Cast: Ranbir Kapoor, Sai Pallavi, Yash, Sunny Deol, Ravi Dubey, Rakul Preet Singh, Vivek Oberoi, Arun Govil, Lara

Director: Nitesh Tiwari

Music Director: Hans Zimmer, A.R. Rahman

Producer: Namit Malhotra

Release Date: November 5, 2026

రామాయణ: పార్ట్ 1 మూవీ రివ్యూ

Published నవంబర్ 5, 2026 by Srinivas

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం ‘రామాయణం: పార్ట్ 1’. రామాయణం, భారతం వంటివి మన ఇతిహాసాలు. అందరికీ తెలిసిన చరిత్రే అయినా కూడా ఎవరెన్ని సార్లు తెరకెక్కించినా.. ఎవరెన్నిసార్లు తీసినా ఇంకా చూడాలనే అనిపిస్తూ ఉంటుంది. కానీ అదే కథను ప్రేక్షకులు మరోసారి అనుభూతి చెందేలా చేయడమే అసలైన సవాల్. మరి నితీష్ తివారి ఆ విషయంలో సక్సెస్ అయ్యారా? మనసును కదిలించే భావోద్వేగాలను పంచారా? తెలుసుకుందాం.

రామాయణ: పార్ట్ 1 Review

కథేంటంటే…

ముల్లోకాల్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న రావణాసుర (యశ్) సంహారం కోసం శ్రీ మహావిష్ణువు మానవ అవతారమైన శ్రీరాముడు (రణబీర్ కపూర్) దశరథ మహారాజు, కౌసల్యాదేవి దంపతులకు జన్మిస్తాడు. గురువుల వద్ద విద్యాభ్యాసం చేస్తాడు. యుద్ధ విద్యల్లో ఆరితేరి, వివిధ అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో శ్రీరాముడు నైపుణ్యం సంపాదిస్తాడు. అయితే తన ముగ్గురు సోదరులు, సమకాలీన రాజులందరిలోనూ రాముడిని ఆయన విలువిద్యా నైపుణ్యం మాత్రమే కాకుండా.. బంధాల పట్ల ఆయనకున్న నమ్మకం, ప్రేమ, ఇతరుల పట్ల గౌరవం, అన్నింటికంటే ముఖ్యంగా ధర్మం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే నిబద్ధతే ఆయన గొప్పతనం ప్రత్యేకంగా నిలబెడతాయి. శ్రీరాముడు జనక మహారాజు కుమార్తె సీత (సాయి పల్లవి)ను స్వయంవరంలో గెలుచుకుని వివాహం చేసుకుంటాడు. రాముడికి తమ్ముడు లక్ష్మణుడు (రవి దూబె) అన్నకు ప్రతి అడుగులోనూతోడుగా నిలుస్తాడు. రాముడికి పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో ఆయన సవతి తల్లి కైకేయి, దశరథుడు గతంలో తనకిచ్చిన రెండు వరాలను కోరుతుంది. అందులో భాగంగా రాముడిని 14 ఏళ్ల పాటు అరణ్యవాసానికి పంపాలని పట్టుబట్టడం.. తండ్రి మాటను నిలబెట్టడం తన ధర్మంగా భావించిన రాముడు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అరణ్యవాసానికి వెళ్లిపోతాడు. జాటాయు మరణానంతరం ‘రావణుడ్ని సంహరించబోతున్నాను’ అంటూ రాముడు ప్రతిజ్ఞ చేయడంతో ఈ తొలి భాగం ముగిసింది.

Ramayana: కొత్త పోస్టర్‌లో రణ్‌బీర్, సాయిపల్లవి, యశ్ లుక్ అదుర్స్!

ఎలా ఉందంటే..

‘రామాయణం’ కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికీ తెలిసిన కథే. అయితే దానిని దర్శకుడు ఎలా ప్రెజెంట్ చేశారన్నదే ముఖ్యం. తొలి ఫ్రేమ్ నుంచే అద్భుతమైన విజువల్స్‌తో నితీష్ తివారీ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమా కోసం రూ.2000 కోట్లు ఎందుకు ఖర్చైందో కూడా చూసేవారికి స్పష్టంగా తెలుస్తుంది. కేవలం కొన్ని భారీ యుద్ధ సన్నివేశాలు, ప్రకృతి దృశ్యాలకే పరిమితం కాకుండా.. ఈ సినిమాలోని ప్రతి అంశంలోనూ భారీతనం కనిపిస్తుంది. ప్రకృతి అందాలు, రాజ్యాల నిర్మాణాలు, అద్భుతమైన కట్టడాలు, ఆయుధాలు, వింత జీవులు, దివ్యలోకాలు.. ఇలా ఒకటేమిటి? ప్రతి అంశంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకూ చూడని ప్రపంచాన్ని కళ్ల ముందుంచారు. ఇప్పటి వరకూ మనం ప్రమోషన్స్‌లో చూసింది వేరు.. తెరపై ఆవిష్కృతమైంది వేరు. వెండితెరపై మరో ప్రపంచాన్ని ఊహించిన విజువల్ వండర్స్‌తో చూపించారు. ముఖ్యంగా దశరథుడు, రాముడి మధ్య వచ్చే వియోగ సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేశాయి. రాముడు అయోధ్యను విడిచి అరణ్యవాసానికి బయలుదేరే సమయంలో తండ్రి పడే వేదన, కొడుకును ఆపలేని నిస్సహాయత, చివరకు దశరథుడి మరణం వంటి సన్నివేశాలు హృదయాన్ని బరువెక్కిస్తాయి. యుద్ధ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో పెద్ద మైసన్ వచ్చేసి ఏఐ. ముఖ్యంగా ఖరదూషణుడు, కుంభకర్ణుడు వంటి పాత్రల రూపకల్పన చాలా అసహజంగానూ.. కార్టూన్‌ పాత్రలను తలపించింది. రావణుడికి ఇచ్చిన ఎలివేషన్ రాముడికి ఇవ్వలేదేమో అనిపించింది. రాముడి పాత్రను సింపుల్‌గా ప్రవేశపెట్టి.. స్లోగా ప్రేక్షకులకు ఎక్కించేశారు. అలాగే బాలకాండ, అరణ్యకాండను కాస్త స్లోగా నడిపించారు. భారీ చిత్రాల్లో ఏ కొద్దిపాటి లోపం కనిపించినా కూడా అది చూసే ప్రేక్షకులకు డిస్టర్బింగ్‌గానే ఉంటుంది. అలాగే కాస్ట్యూమ్స్ కూడా చాలా లేటెస్ట్‌గా అనిపించాయి. నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటే బాగుండేది. ఇవి మినహా మిగిలిన సన్నివేశాలన్నీ అద్భుతంగా అనిపించాయి.

రామాయణం: రావణుడిగా యష్ విశ్వరూపం.. దసరాకు స్పెషల్ ట్రీట్!

ఎవరెలా నటించారంటే…

‘రామాయణ’లో రాముడిగా రణ్‌బీర్ కపూర్ జీవించారనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలోనూ ఆయన తన నటనతో ఆకట్టుకున్నారు. సీతగా సాయి పల్లవి అద్భుతమైన నటనను కనబరించింది. ధీరవనితగా సాయి పల్లవి ఆకట్టుకుంది. రావణుడిగా యశ్ జీవించేశాడు. క్రూరత్వం, ఆగ్రహం, బలం కలగలిసిన రావణుడిగా యశ్ తాండవమాడేశాడు. లక్ష్మణుడిగా రవి దూబె అద్భుతంగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, షీబా చద్దా కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.

టెక్నికల్ పరంగా..

ఏఐ విజువల్స్ మినహా సినిమా అంతా చాలా భారీగానూ.. మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. నితీష్ తివారీ డైరెక్షన్ చాలా బాగుంది. పంకజ్ కుమార్, మహేష్ లిమాయే కెమెరా పనితనం అద్భుతం. హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ కలిసి అందించిన సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సన్నివేశాన్ని చాలా రిచ్‌గా చూపించారు. స్క్రీన్‌ప్లే చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘రామాయణ’ ఒక విజువల్ వండర్.. వెండితెరపై చూడాల్సిన అద్భుతం

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.