హ్యాపీ జర్నీ మూవీ రివ్యూ
Published సెప్టెంబర్ 18, 2026 by Srinivas
మహిళల భావోద్వేగాలు, వారి ఆకాంక్షలను ప్రతిబింబించే కథలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వచ్చినా కూడా వాటిని కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయకపోతే కష్టమే. ప్రస్తుతం మహిళల భావోద్వేగాలు, వారి ఆకాంక్షలను కథగా తీసుకుని దానికి కాస్త వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రమే ‘హ్యాపీ జర్నీ’. టీజర్, ట్రైలర్ అన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

కథేంటంటే..
వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన సావిత్రి (అన్నపూర్ణమ్మ), చాముండేశ్వరి (ఆమని), నయన (జినిషా అలిశెట్టి), శ్రీలత (ఝాన్సీ), తన్వి (పాయల్ రాధాకృష్ణ), దివ్య (సునైనా బాదం), విహాన (రూప శ్రీనివాస్).. ఒక లక్కీ డ్రా ద్వారా యూరప్ ట్రిప్ గెలుచుకుంటారు. దీంతో వారంతా ఆనందంగా ట్రిప్‌కు బయలుదేరుతారు. వీరికి గైడ్లుగా గ్రేట్ ఆంధ్ర ట్రావెల్స్ నిర్వాహకులు గోవింద్ (వంశీధర్ గౌడ్), అప్పారావు (రవి శివతేజ) వారితో పాటు వెళతారు. సరదాగా విహార యాత్ర ప్రారంభమవుతుంది. చిన్ని చిన్న గొడవలతో.. ఇగో సమస్యలతో మొదలైన వారి ప్రయాణం.. ఆ తరువాత ఒక ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. వారి వ్యక్తిగత సమస్యలన్నీ బయటకు వస్తాయి. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అదొక ఎమోషనల్ జర్నీలా మారిపోతుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? ప్రయాణంలో వాళ్ల జీవితాల గురించి ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి? ఈ జర్నీతో వారి కుటుంబాల్లో వచ్చిన మార్పులేంటనేది వెండితెరపై వీక్షించాల్సిందే.

ఎలా ఉందంటే..
మహిళలు.. వారి ఇళ్లలోని సమస్యల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. అందుకే ఇలాంటి సినిమాను తెరకెక్కించాలంటే ముఖ్యంగా బలమైన కాన్సెప్ట్ ఉండాలి. అలాగే స్క్రీన్‌ప్లే బావుండాలి. అలా లేకుంటే మిగిలిన అంశాలన్నీ లైట్ అవుతాయి. ఈ సినిమాలో జరిగిందదే. దర్శకుడు తను అనుకున్న పాయింట్‌ను యితే చక్కగా ప్రెజెంట్ చేశాడు. సినిమాలో ఫన్ ఎలిమెంట్.. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది కానీ ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అలాగే మంచి దమ్మున్న కాన్సెప్ట్ కానీ స్క్రీన్‌ప్లే దెబ్బేసింది. మహిళల వ్యక్తిగత సమస్యల గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కాబట్టి ఎమోషన్ గట్టిగా ఉండాలి. కానీ అది లోపించింది. అలాగే ఫన్ ఉంది.. ఎమోషన్ ఉంది.. వాటి మధ్య బ్యాలెన్సే లేదు. పాత్రల మధ్య చక్కగానే అపార్థాలు సృష్టించారు కానీ చిటికెలో పరిష్కరించినట్టుగా అనిపిస్తుంది. అది ప్రేక్షకులకు కనెక్ట్ అవదు. కొన్ని సన్నివేశాలు రిపీట్ అవడం చిరాకు తెప్పిస్తుంది. కొంత మేర కామెడీ వర్కవుట్ అయ్యింది. కొన్ని అంశాల కోసం మాత్రమే ఈ సినిమా చూడవచ్చు.

ఎవరెలా నటించారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం అన్నపూర్ణమ్మ. మోడ్రన్ లుక్‌లో అదరగొట్టారు. ఆమని, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, సునయన, రూప శ్రీనివాస్‌లు చక్కని నటనతో ఆకట్టుకున్నారు. గైడ్స్ గా చేసిన వంశీ, రవి శివతేజ కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యింది. ముఖ్యంగా వీరిద్దరి పంచ్ డైలాగులు బాగా వర్కవుట్ అయ్యాయి.
టెక్నికల్ పరంగా..
ఈ సినిమాకు కెమెరా వర్క్ ప్రధాన బలం. యూరప్ అందాలను అద్భుతంగా చూపించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ పర్వాలేదనిపించింది. బీజీఎం బాగుంది. ఎడిటింగ్ సైతం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గినట్టుగా ఉన్నాయి. స్క్రీన్‌ప్లే సినిమాకు మైనస్.
ఫైనల్‌గా.. హ్యాపీ జర్నీ.. కామెడీ, యూరప్ అందాల కోసం చూడొచ్చు.
Rating: 



(2.5/5)
