Download App
Movie Poster

Irumudi

Cast: Raviteja, Priya Bhavani Shankar, Sai Kumar, Baby Nakshathra

Director: Shiva Nirvana

Music Director: G. V. Prakash Kumar

Producer: Naveen Yerneni & Y. Ravi Shankar

Banner: Mythri Movie Makers

Release Date: August 21, 2026

ఇరుముడి మూవీ రివ్యూ

Published ఆగస్ట్ 21, 2026 by Srinivas

మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. దీనికి కారణం.. ‘మల్లెపూల పల్లకి’ పాట ఒకటైతే.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మరొకటి. అంతేకాదు.. దర్శకుడు శివ నిర్వాణ ట్రైలర్‌లోనే దాదాపుగా కథ మొత్తం రివీల్ చేశారు. అయితే ఒక ఇంట్రస్టింగ్ విషయాన్ని మాత్రం దాచేశారు. రవితేజ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత ఆయన శత్రువులకు ఆయనపై దాడి చేసేందుకు మంచి అవకాశమైతే దొరికింది. మరి మాలలో ఉన్న రవితేజ వారిని ఎలా ఎదుర్కున్నాడన్నదే ఆసక్తికరం. అది బాగా వర్కవుట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్. లేదంటే యావరేజ్ అంటూ టాక్ నడించింది. మరి సినిమా ఎలా ఉంది? అన్ని అంశాలు బాగా వర్కవుట్ అయ్యాయా? తెలుసుకుందాం.

Irumudi Movie Review

కథేంటంటే…

త్రినాథ్ రామ్ కాసు (రవితేజ).. భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), బిడ్డ మణికంఠే ప్రాణంగా పొల్లూరు అనే గ్రామంలో బతుకుతూ ఉంటాడు. కూతురంటే వల్లమాలిన ప్రేమ. ప్రతి ఆడపిల్లనూ తన కూతురులాగే భావించి జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆడపిల్లను ఎవరైనా ఏడిపించారని తెలిస్తే వారిని వదలడు. కూతురు మణిమ్మకు కూడా ఎక్కడ ఏం జరిగినా తనకు చెప్పాలని చిన్నప్పటి నుంచి చెబుతూ పెంచుతాడు. పొల్లూరుకు బస్సు సౌకర్యం ఉండదు. ఐదో తరగతి తర్వాత పిల్లలంతా వేరే ఊరికి చదువు కోసం వెళ్లాల్సి వస్తుంది. బస్సు సౌకర్యం లేకపోవడంతో సైకిలుపై వెళ్లి వస్తూ కొందరు పోకిరిగాళ్ల కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది తెలుసుకున్న గోపరాజు (సాయి కుమార్) స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి తమ గ్రామానికి బస్సు వచ్చేలా చూస్తాడు. ఇక స్కూలు ప్రిన్సిపాల్ చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తూ ఉంటుంది. చదువులో టాపర్స్ అనుకున్న టెన్త్ విద్యార్థినులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తూ ఉంటుంది. కానీ అక్కడికి స్పెషల్ క్లాసులకు అని వెళ్లిన విద్యార్థినులలో ఒకరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు చదువే మానేస్తారు. సాయికుమార్ కూతురు టెన్త్‌కు వస్తుంది. ఆమె కూడా చదువులో టాపర్. ఆమె కూడా టీచర్ ఇంటికి స్పెషల్ క్లాసులకు వెళుతుంది. చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంట్లో చెప్పుకోలేదు. త్రినాథ్‌కు చెబుదామని వెళితే అతని మద్యం మత్తులో ఉంటాడు. అసలు ఎందుకు టీచర్ ఇంటికి వెళ్లేందుకు విద్యార్థినులు భయపడుతున్నారు? కథలో ఎమ్మెల్యే పాత్ర ఏమిటి? తన ఇంటికి వెళ్లిన విద్యార్థినులను టీచర్ ఏం చేస్తోంది? చివరకు త్రినాథ్ ఏం చేశాడు? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Irumudi Movie Review

సినిమా ఎలా ఉందంటే..

కొన్ని సినిమాలకు ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యిందంటే లాజిక్స్‌తో పని ఉండదు. అలాంటి చిత్రమే ఇది. రొటీన్ స్టోరీ అయినా కూడా ఎమోషన్ వర్కవుట్ అయితే సినిమా దూసుకెళుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా రవితేజ తాగుడుకు అడిక్ట్ అయిపోవడం.. తండ్రి తాగకుంటే ఉండలేడని కూతురు అతనికి సాయం చేయడం.. కూతురు కోసం త్రినాథ్ అయ్యప్ప మాల వేసుకోవడం వంటి అంశాలతో సాగిపోతుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా సాగదీతగా అనిపిస్తుంది. చూస్తున్న వారికి ఎప్పుడు అయిపోతుందా? అనిపిస్తుంది. ఇక సినిమా మొత్తం సెకండాఫ్‌ అనే చెప్పాలి. దర్శకుడు చెప్పినట్టుగా ఇది భక్తి ప్రధాన చిత్రమేమీ కాదు. భక్తికి చిత్రానికి సంబంధం ఏమీలేదు. ఆడపిల్లను ఎలా పెంచాలి? అనే వేరియేషన్ ఇద్దరు తండ్రులతో దర్శకుడు చెప్పించే ప్రయత్నం చేశాడు. గోపరాజు తన కూతురిని చాలా భయంతో పెంచుతాడు. దీంతో ఆమె తనకు ఏం జరిగినా ఇంట్లో చెప్పుకోలేదు. పరువు ప్రతిష్టలే ప్రాణంగా భావించే తండ్రి అతను. కూతురికి ఏం జరిగినా నలుగురికి తెలిస్తే పరువు పోతుందని భయపడుతుంటాడు. త్రినాథ్ మాత్రం కూతురిని చాలా ధైర్యంగా పెంచుతాడు. ఏం జరిగినా తనకు చెప్పాలని చెబుతూ పెంచుతాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఎమోషన్ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. తండ్రీకూతుళ్ల ఎమోషన్ కంటతడి పెట్టిస్తుంది. రవితేజ చేసిన చాలా చిత్రాల కంటే ఇది బెటర్ అనే చెప్పాలి.

Irumudi Movie Review

ఎవరెలా నటించారంటే..

రవితేజ తన పాత్రలో జీవించేశారు. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇక బేబి నక్షత్ర గురించి చెప్పాలి. అద్భుతంగా నటించింది. ప్రతి సన్నివేశంలోనూ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ నటిగా కనిపించింది. ఆమె కాకుండా మరొకరైతే ఈ సినిమా అంతలా వర్కవుట్ అయ్యేది కాదేమో అనిపించింది. ఇక ప్రియ భవాని శంకర్.. పెద్దగా నటనకు స్కోప్ ఉన్న పాత్రేమీ కాదు కానీ ఆమె కూడా బాగానే నటించింది. సాయికుమార్ తన పాత్రలో జీవించేశారు. అజయ్ ఘోష్ పాత్ర నిడివి తక్కువే అయినా ఆయన కూడా చాలా బాగా నటించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

Irumudi Movie Review

టెక్నికల్ పరంగా..

సినిమా విజువల్స్ చాలా బాగున్నాయి. ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివ నిర్వాణ ఫస్ట్ హాఫ్‌పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా వేరే లెవల్‌లో ఉండేది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగుంది. ముఖ్యంగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పాటలు ఎప్పుడూ వినేవే అయినా కూడా థియేటర్‌లో చూస్తున్న వారికి మరింత బాగా నచ్చుతాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా.. ‘ఇరుముడి’తో రవితేజ సక్సెస్ కొట్టినట్టే..

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.