జన నాయకుడు మూవీ రివ్యూ
Published జూలై 23, 2026 by Srinivas

‘జన నాయకుడు’.. తమిళనాడు ముఖ్యమంత్రి, కథానాయకుడు విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం కావడం ఒక ఎత్తైతే.. విడుదలకు ఎంతగానో పురుటి నొప్పులను ఎదుర్కొని విడుదలవడం మరో ఎత్తు. ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని.. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ సమస్యలను దాటుకుని ‘జన నాయకుడు’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? పైగా తెలుగులో హిట్టయిన ‘భగవంత్ కేసరి’కి.. ‘జన నాయగన్’కు చేసిన మార్పులేంటి? తెలుసుకుందాం.
కథంటేంటే..
ఖైదీగా జీవితాన్ని గడుపుతున్న దళపతి వెట్రి కొండాన్ (విజయ్).. ఓ వ్యాపారవేత్తని అంతం చేయడానికి జైలుపై పడిన ముఠాని ఎదిరిస్తాడు. ఈ క్రమంలోనే నిజాయతీ కలిగిన జైలు అధికారి (గౌతమ్ మేనన్) దృష్టి వెట్రిపై పడుతుంది. దళపతి మంచితనం చూసి.. అనారోగ్యంతో ఉన్న తన తల్లి(రేవతి)ని చివరి సారిగా చూసేందుకు అనుమతిస్తాడు. ఆ తరువాత ఆగస్టు 15న క్షమాభిక్ష కింద వెట్రిని బయటకు పంపేందుకు సహకరిస్తాడు. అంతలోనే ఆ అధికారి ఓ ప్రమాదంలో మరణించడంతో ఆయన కూతురు విజ్జి (మమిత బైజు)ని పెంచే బాధ్యతని వెట్రి తన భుజాన వేసుకుంటాడు. తల్లి దారుణ హత్యని కళ్లారా చూడటంతో విజ్జి.. ప్రతి చిన్న విషయానికీ భయంతో వణికిపోతుంటుంది. అయితే విజ్జి ఫియర్ ఫోబియా కారణంగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి సాధారణ జీవితాన్ని గడపాలనుకుంటుంది. ఆమెను ధైర్యవంతురాలిగా తీర్చిదిద్దేందుకు ఆమెని సైన్యంలో చేర్పించాలని వెట్రి నిర్ణయించుకుంటాడు. దీనికోసం విజ్జికి శిక్షణ ఇప్పిస్తుంటాడు. ఇంతలో జాన్ హిమ్లర్ (బాబీ దేవోల్) విజ్జిని అంతం చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే దానికి తన ముఠాని ఉసిగొల్పుతాడు. అసలు జాన్ హిమ్లర్ ఎవరు? ఆఫ్రికా దేశాలను వణికించిన జాన్ హిమ్లర్‌కి విజ్జిని హతమార్చాల్సిన అవసరమేంటి? అతన్ని వెట్రి కొండాన్ ఎలా ఎదుర్కొన్నాడు? విజ్జిని ధైర్యవంతురాలిగా మార్చాడా? వంటి విషయాలు తెలియాలంటే వెండితెరపై వీక్షించాల్సిందే.

ఎలా ఉందంటే..
తెలుగులో విజయంతమైన భగవంత్ కేసరి స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందింది. అయితే యథాతథంగా దీన్ని రీమేక్ చేయలేదు. కొన్ని ప్రధానాంశాలు, పాత్రలను మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే ‘భగవంత్ కేసరి’ చిత్రం చూసిన తెలుగు ప్రేక్షకులకు మాత్రం ప్రతి సన్నివేశంలోనూ ఆ చిత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే బేటీ బచావో… బేటీ పడావో నినాదం ఆధారంగా రూపొందిన మాతృకలోని అసలైన సన్నివేశాలు ఈ సినిమాలోకి పూర్తి స్థాయిలో ట్రాన్స్‌ఫర్ కాలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. తొలి సన్నివేశంతోనే సినిమా మెయిన్ టార్గెట్ ఏంటనేది ప్రేక్షకుడి అర్థమైపోతుంది. జైలులో యాక్షన్ సన్నివేశాలు, విజ్జి పాత్ర, ఆమెలోని భయం వంటి అంశాలు మినహ చాలా అంశాలను భగవంత్ కేసరి నుంచి తీసుకోలేదు. విజయ్ రాజకీయ ఎజెండాతో పాటు మితిమీరిన కమర్షియల్ ఎలిమెంట్స్ మధ్య అసలు కథ దారి తప్పినట్టుగా అనిపించింది. అసలు ‘జన నాయగన్’ లక్ష్యం విజయ్‌కు పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెట్టేది కావడం.. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికలకు ముందు రూపొందినది కాబట్టి.. విజయ్ రాజకీయాలకు తగినట్టుగా రూపొందించడం జరిగింది. ఈ సినిమా విజయ్ పొలిటికల్ ఎజెండాని పక్కాగా చిత్రంలో చూపించడమే కాకుండా.. ఆయనకు పొలిటికల్‌గా కలిసొచ్చే అంశాలను బాగా చిత్రంలో చొప్పించారు. ముందు అనుకున్నట్టుగా ఈ సినిమా తమిళనాడు ఎన్నికలకు ముందు విడుదలై ఉంటే విజయ్ పార్టీకి బీభత్సంగా కలిసి వచ్చి ఉండేది. అందుకేనేమో ఈ చిత్రాన్ని విడుదల కాకుండా అడ్డుకున్నారు. ముఖ్యంగా వారసత్వ రాజకీయాలు, మత రాజకీయాలే టార్గెట్‌గా ఈ చిత్రం రూపొందింది. ముఖ్యంగా సెకండాఫ్ దాదాపుగా అంతా ఈ సన్నివేశాలే ఉంటాయి. విజయ్ రాజకీయ శత్రువుల్ని దృష్టిలో ఉంచుకునే సెకండాఫ్ రూపొందినట్టుగా చూసేవారికి అర్థమవుతుంది. ముఖ్యంా విలన్ విషయంలో వెట్టి వేసే ఎత్తులు సినిమాకు హైలైట్‌గా అనిపిస్తాయి. ఈ క్రమంలోనే అసలు కథ కొంతమేర దారితప్పుతున్నట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్ పూర్తిగా పొలిటికల్ డ్రామా కావడంతో భావోద్వేగాలకు ఛాన్స్ లేకుండా పోయింది. ఇక గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేపథ్యంలో రూపొందిన సన్నివేశాలు సినిమాకు హైలైట్.

ఎవరెలా చేశారంటే..
విజయ్ తన పాత్రలో ఒదిగిపోయారు. రాజకీయ అంశాలు, మెసేజ్ వంటివి ఉన్నా కూడా మాస్ ఎలిమెంట్స్ బీభత్సంగా ఉండటంతో వారిని ఆకట్టుకునేలా డ్యాన్సులు, డైలాగ్స్, మేనరిజం వంటివి విజయ్ అదరగొట్టారు. ఇక విజ్జి పాత్రలో మమిత బైజు అద్భుతంగా నటించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మమిత చేసిన పోరాటాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చాలా కాలం తర్వాత పూజా హెగ్డే వెండితెరపై కనిపించి కనువిందు చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే కానీ, కనిపించినంత సేపు చాలా డీసెంట్‌గా కనిపించింది. బాబీ దేవోల్ పాత్ర చాలా స్ట్రాంగ్. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన అదరగొట్టేశరు. ప్రియమణి, ప్రకాశ్‌రాజ్, నాజర్ , గౌతమ్ మేనన్ పాత్రల పరిధికి తగ్గట్టుగా నటించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు హెచ్ వినోద్ విషయానికి వస్తే.. విజయ్‌కు పొలిటికల్ మైలేజ్‌ను తెచ్చి పెట్టే అంశాలు, మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌పై పెట్టిన శ్రద్ధ సినిమాపై పెట్టలేదేమో అనిపించింది. ముఖ్యంగా అసలు కథను దారి మళ్లించారు. విజువల్ పరంగా అయితే సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎడిటింగ్ చాలా పేలవం. సెకండాఫ్ చాలా సాగదీతగా అనిపిస్తుంది. మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కెమెరా వర్క్ కూడా బాగుంది.
చివరిగా: ‘జన నాయకుడు’… అభిమానులను మాత్రమే మెప్పిస్తాడు.
Rating: 



(2/5)
