ENE Repeat మూవీ రివ్యూ
Published నవంబర్ 19, 2026 by Srinivas
Ee Nagaraniki Emaindi 2 Review Telugu: ఎన్టీఆర్ సహా ఎంతో మందికి నచ్చిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్ తీశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఈ సినిమా ఎలా ఉంది?

Vishwak Sen Tharun Bhascker movie ENE 2 Movie Telugu Review: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మెచ్చిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. యువత నుంచి కల్ట్ స్టేటస్ అందుకుంది. ఆ సినిమా విడుదలైన ఎనిమిదేళ్ళకు సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా అంబ్రోస్ మళ్ళీ తమ తమ క్యారెక్టర్లు చేశారు. సుశాంత్ బదులు శ్రీనాథ్ మాగంటి వచ్చారు. ఆయనకు జంటగా శివాత్మిక రాజశేఖర్ నటించారు.
కథ (ENE 2 Movie Story In Telugu): ‘ఈ నగరానికి ఏమైంది’ కథ ముగిసిన చోటు నుంచి సీక్వెల్ కథ మొదలైంది. వివేక్ (విశ్వక్ సేన్), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉప్పి అలియాస్ ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను) కలిసి చేసిన సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పుల భారం మీద పడుతుంది. అది తీర్చడానికి నిర్మాత రాబిన్ (ఫణి) ప్రారంభించిన వెడ్డింగ్ మేనేజ్మెంట్ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు వివేక్. నటుడిగా కౌశిక్ పేరు తెచ్చుకుంటాడు. ఉప్పి ఎడిటింగ్, కార్తీక్ సినిమాటోగ్రఫీ చేస్తారు.
ఉప్పి ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్. అతని పెదనాన్న మురళీధర్ (ప్రియదర్శిని రామ్) డాక్టర్. ఆయనకు సినిమాలు అంటే ఇష్టం ఉండదు. కానీ కుమార్తె కీర్తన (శివాత్మిక రాజశేఖర్)కు సినిమాటోగ్రఫీ అంటే ఇష్టం. ఇంట్లో చెప్పకుండా కార్తీక్ దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వెళుతుంది. ఎంబీబీఎస్ క్లాసులు బంక్ కొడుతుంది. కీర్తనను కార్తీక్ ప్రేమిస్తాడు. ఆ విషయం చెప్పేలోపు… ఆమెకు అంకిత్ (శ్రీరామచంద్ర)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. బ్యాచిలర్ పార్టీలో గొడవ అవుతుంది. పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది. కీర్తన తండ్రికి విషయమంతా తెలుస్తుంది. ఆయన కోప్పడతారు. పెళ్ళి ఖర్చులు మొత్తం వివేక్ అండ్ గ్యాంగ్ కట్టకపోతే క్రిమినల్ కేసు వేస్తానని వార్నింగ్ ఇస్తాడు.లేదంటే సినిమాల జోలికి వెళ్ళమని అగ్రిమెంట్ మీద సంతకం చేయాలంటాడు. అప్పుడు వివేక్ ఏం చేశాడు? తర్వాత ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (ENE Repeat Analysis): ‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజైనప్పుడు తెలుగులో బడ్డీ కామెడీ జానర్ అంతగా పాపులర్ కాలేదు. స్నేహితులను తరుణ్ భాస్కర్ చూపించినంత సజహంగా అప్పటి వరకు ఎవరూ చూపించలేదు. థియేటర్లకు వెళ్లిన యువతకు తెరపై స్నేహితుల్లో తమను తాము చూసుకున్నారు. కథ గురించి ఆలోచించలేదు. క్యారెక్టర్లతో కనెక్ట్ అయ్యారు. సినిమాను మంచి హిట్ చేశారు. ‘ఈ నగరానికి ఏమైంది’ తర్వాత బడ్డీ కామెడీలు చాలా వచ్చాయి. ఆ సినిమాకు సీక్వెల్ అనేసరికి ఆడియన్స్ అంచనాలు పెట్టుకున్నారు. మరి సీక్వెల్ ఎలా ఉంది? అంటే…
ప్రేక్షకులకు వివేక్, కార్తీక్, కౌశిక్, ఉప్పి ఏం చేస్తారో తెలుసు. ఎవరి క్యారెక్టర్ ఏమిటి? ఎవరెలా బిహేవ్ చేస్తారు? అనేది ఐడియా ఉంది. అందువల్ల క్యారెక్టర్ల కంటే కథపై ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. తరుణ్ భాస్కర్ మాత్రం ఆ అంచనాలు పక్కనపెట్టి… ‘ఈ నగరానికి ఏమైంది’లో స్నేహితులను ఎలా ప్రజెంట్ చేశారో, మళ్ళీ సేమ్ రూటులో వెళ్ళారు. కథ కంటే క్యారెక్టర్లు, వాళ్ళ మధ్య సంభాషణలను ఎక్కువ నమ్ముకున్నట్టు ఉన్నారు. కథ కోసం ఉప్పి కుటుంబాన్ని పరిచయం చేశారు. అయితే… సినిమాలను మురళీధర్ ఎందుకంత అసహ్యించుకుంటున్నారు? సినిమాటోగ్రఫీ అంతే కీర్తనకు ఎందుకంత ఇష్టం? అనేది సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. దాంతో మొదటి అరగంట అటు ఇటుగా అనిపిస్తుంది. బ్యాచిలర్ పార్టీ నుంచి మళ్ళీ వివేక్ అండ్ గ్యాంగ్ అసలు మేజిక్ మొదలైంది. వాళ్ళ నుంచి ఆడియన్స్ ఆశించే ఫన్ ఇవ్వడం మొదలు పెట్టారు తరుణ్ భాస్కర్. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ పక్కకు వెళ్లినట్టు, ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడం లేదన్నట్టు అనిపించినా మధ్య మధ్యలో కామెడీకి లోటు లేకుండా చూసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని ట్రెండ్స్ మీద సెటైర్లు వేసిన తరుణ్ భాస్కర్… క్లైమాక్స్ విషయంలో తండ్రిలో మార్పు వచ్చినట్టు రొటీన్ ట్రెండ్ ఫాలో అయ్యారు. అది కన్వీన్సింగ్ అనిపించలేదు.
టెక్నీకల్లీ తరుణ్ భాస్కర్ సినిమాలు హై స్టాండర్డ్స్‌లో ఉంటాయి. నో డౌట్…’ఈఎన్ఈ రిపీట్’ కూడా టెక్నీకల్లీ బావుంది. డైలాగులతో కాకుండా కొన్నిసార్లు కెమెరా యాంగిల్స్, షాట్ డివిజన్‌తో కథ చెప్పడం తరుణ్ భాస్కర్ స్టైల్. సినిమా ఫ్లాప్ తర్వాత వివేక్ కింద పడ్డాడని చెప్పే సింబాలిక్ షాట్ అందుకు ఓ ఉదాహరణ. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, లైటింగ్ పరంగా సీక్వెల్ కూడా బావుంది. వివేక్ సాగర్ సంగీతంలో బడ్డీ కామెడీకి కావాల్సిన ఆర్ఆర్ బావుంది. నిర్మాత సృజన్ ఎర్రబోలు గట్టిగా ఖర్చు చేశారని తెలుస్తోంది.

విశ్వక్ సేన్ లుక్స్, స్టైలింగ్ బావున్నాయి. ‘ఈ నగరానికి ఏమైంది’లో వివేక్ మళ్ళీ తెరపైకి అలా వచ్చేశాడు. ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ కూడా మైంటైన్ చేశారు. అయితే విశ్వక్ సేన్ & మిగతా ఆర్టిస్టులను డామినేట్ చేశారు అభినవ్ గోమఠం. చెంపదెబ్బలకు, మిగతా సన్నివేశాల్లో ఎక్స్‌ప్రెషన్స్ హిలేరియస్. అభినవ్ గోమఠం కామెడీ ఆడియన్స్ అందరికీ బిగ్గెస్ట్ రిలీఫ్. వెంకటేష్ కాకుమాను కూడా బాగా చేశారు. సుశాంత్ బదులు వచ్చిన శ్రీనాథ్ మాగంటి… గ్యాంగులో కొత్తవాడిలా కాకుండా బాగా కలిసిపోయాడు. శివాత్మిక రాజశేఖర్ తన పరిధిలో చక్కగా చేశారు. కీర్తన పాత్రలో ఆమె నటన సహజంగా ఉంది. ప్రియదర్శిని రామ్, కరుణ కుమార్ కథలో కీలకమైన క్యారెక్టర్లు చేశారు. అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా, సుజీత్ వంటి దర్శకులు అతిథి పాత్రల్లో మెరిశారు. వాళ్ళను ఆ సీన్లకు తగ్గట్టు వాడుకున్నారు. రాజీవ్ కనకాలకు లభించిన క్యారెక్టర్ల మీద వేసిన సెటైర్లు బాగా పేలాయి. బీచ్ సీనులో ఫణి నటన నవ్విస్తుంది. ఓ రకంగా డూప్ వాడకంపై తరుణ్ భాస్కర్ వేసిన సెటైర్ అది.
ENE 2 Verdict: బడ్డీ కామెడీ రాయడంలో, స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్‌లో తరుణ్ భాస్కర్ మరోసారి తన మార్క్ చూపించారు. కథ, క్లైమాక్స్ విషయంలో కాస్త డిజప్పాయింట్ చేశారు. అయితే… కామెడీ పరంగా లోటు లేకుండా చూసుకున్నారు. ‘ఈఎన్ఈ’ గ్యాంగ్ చేసే అల్లరి, వాళ్ళ గొడవల నుంచి జనరేట్ అయ్యే కామెడీని ఎంజాయ్ చేయడం కోసం యూత్ తమ గ్యాంగుతో కలిసి వెళ్ళొచ్చు. హాయిగా నవ్వుకోవచ్చు.
Rating: 



(3/5)
