Download App
Movie Poster

Aakasamlo Oka Tara

Cast: Dulquer Salmaan, Satvika Veeravalli, Shruti Haasan, Ruhani Sharma

Director: Pavan Sadineni

Music Director: G V Prakash Kumar

Producer: Sandeep Gunnam, Ramya Gunnam

Banner: Geetha Arts, Swapna Cinema, Lightbox Media

Release Date: November 20, 2026

ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ

Published నవంబర్ 20, 2026 by Srinivas

Dulquer Salmaan Aakasamlo Oka Tara Telugu Movie Review: ‘మహానటి, లక్కీ భాస్కర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్. ఆయన నటించిన తాజా సినిమా ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమయ్యారు. శృతి హాసన్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Aakasamlo Oka Tara Telugu Movie Review

కథ (Aakasamlo Oka Tara Story In Telugu):

కల్పన (సాత్విక వీరవల్లి)ది గోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు. ఆస్ట్రోనాట్ కావాలనేది ఆమె కల. పదో తరగతి పరీక్షలు రాసిన వెంటనే కృష్ణ (దుల్కర్ సల్మాన్)కు ఇచ్చి పెళ్ళి చేస్తాడు తండ్రి. మొదటి రాత్రి అమ్మాయి వయసు, ఆమె కల భర్తకు తెలుస్తాయి. అతనొక సాధారణ మెకానిక్ & డ్రైవర్. పదో తరగతిలో తన భార్య జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించిందని తెలుసుకుని ఆమె కలను నిజం చేయాలని కష్టపడతాడు. కాలేజీలో చేర్పిస్తాడు.

ఇంగ్లీష్ రాని ఓ పల్లెటూరి అమ్మాయి అంతరిక్షం వరకు ఎలా వెళ్ళింది? ఆ ప్రయాణంలో ఎటువంటి అడ్డంకులు వచ్చాయి? భర్త నుంచి ఆమెకు ఎటువంటి మద్దతు లభించింది? కల్పన ప్రయాణంలో రోహిణి (శృతి హాసన్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Aakasamlo Oka Tara Analysis):

ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందని చెబుతారు. కానీ, ఒక మహిళ కలను నిజం చేసేందుకు ఓ మగాడు అండగా నిలబడితే అద్భుతాలు జరుగుతాయని చెప్పే చిత్రమిది. మహిళలకు స్ఫూర్తినిచ్చే అందమైన కథ ఇది. మహిళలను ప్రోత్సహించాలని మగాళ్లకు సందేశం ఇచ్చే చిత్రమిది.

బిచ్చగాడి నుంచి బిలీనియర్లుగా మారిన కథలను తెలుగు ప్రేక్షకులు తెరపై చూశారు. అటువంటి పంథాలో తెరకెక్కిన చిత్రమే అయినప్పటికీ, ఇదొక డిఫరెంట్ ఫిల్మ్. ఎందుకంటే… కనీసం రోడ్డు కూడా లేని పల్లె నుంచి ఆకాశం వరకూ వెళ్ళిన ఓ అమ్మాయి కథ ఇది. కలాం గారు కలలు కనమని చెప్పారు. ఆ కలలను నిజం చేసుకోవడానికి కృషి చేయాలని, అమ్మాయిలను చదివించాలని (బేటీ బచావో బేటీ పడావో స్లోగన్ సైతం ఓ సన్నివేశంలో షాప్ డోర్ మీద చూపించారు) చెప్పే చిత్రమిది. కలలు కనే యువతకు హోప్ ఇచ్చే సినిమా.

Aakasamlo Oka Tara Telugu Movie Review

దర్శకుడు పవన్ సాధినేని సింపుల్ కథ రాశారు. కానీ ఆ కథలో చాలా విషయాలను చూపించారు. మన దేశంలో, ఆ మాటకు వస్తే మన సమాజంలో చుట్టుపక్కల మనకు కనిపించే చాలా అంశాలను హృదయానికి హత్తుకునేలా స్పృశించారు. ఉదాహరణకు… భార్య చదువు కోసం ఆమెతో కలిసి పట్నం వస్తాడు భర్త. అతడిని వెతుక్కుంటూ అక్క (శ్వాసిక) వస్తుంది. తమ్ముణ్ణి పెళ్ళాం కొంగున కట్టుకుని ఆడిస్తుందని భయపడుతుంది. ఊళ్లో నలుగురూ నానా రకాలుగా మాట్లాడతారని ఆలోచిస్తుంది. అక్కడ అక్కకు తమ్ముడు చెప్పే సమాధానం అమ్మాయిల చదువు విషయంలో మనం ఎలా ఆలోచించాలో చెబుతుంది. అదొక్కటే కాదు… అటువంటి హార్ట్ టచింగ్ మోమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి.

పవన్ సాధినేని కథ, దర్శకత్వంలో సింపుల్ సన్నివేశాలను సహజంగా చెప్పిన తీరు బాగుంది. అయితే… స్క్రీన్ ప్లేలో ట్విస్టులకు చోటు ఇవ్వలేదు. ప్రేక్షకులకు నేరుగా కథను చెప్పారు, అందువల్ల ఫ్లాట్ గా అనిపిస్తుంది. అయితే డైలాగులు సన్నివేశాలకు అందాన్ని తీసుకొచ్చాయి. ఎమోషనల్ కనెక్టివిటీని క్రియేట్ చేశాయి. నీ కల ఆకాశం అయినప్పుడు ఈ భూమిని నేను ఏం చేసుకోను అని శృతి చెప్పే మాట గానీ, నేనే తన కాళ్లై కలను నడిపించాలని దుల్కర్ చెప్పే మాట గానీ, ఆకాశం ఎంత ఎత్తైనా మనిషి భుజాల మీద నుండి అందుకున్నానని పతాక సన్నివేశంలో భర్తకు కల్పన (సాత్విక) క్రెడిట్ ఇవ్వడం గానీ… మాటలతో సన్నివేశాలకు బలాన్ని తీసుకొచ్చారు.

లక్ష్యాలు సాధించాలనే యువతకు పాజిటివ్ హోప్ ఇవ్వాలని అనుకున్నారేమో… అంతరిక్ష ప్రయాణంలో కల్పనకు ఎదురైన అడ్డంకులను చాలా సునాయాసంగా అధిగమించిన్నట్టు చూపించారు. కన్వీనియెంట్ రైటింగ్ ఫాలో అయ్యారు. అయితే… ఆ లోపాలను అధిగమించి కథతో పాటు ప్రయాణం చేసేలా చేసింది మాత్రం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతమే. పాటలన్నీ కథలో భాగంగా వచ్చినట్టు అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. శ్రీమణి సాహిత్యం సైతం బాగుంది. సుజీత్ సారంగ్ సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. ప్రొడక్షన్ డిజైన్ కూడా! నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. అయితే వీఎఫ్ఎక్స్ సరిగా చేయలేదు. స్పేస్ పోర్షన్స్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు.

సీతా రామం, లక్కీ భాస్కర్, ఇంకా ఇతర సినిమాలు గుర్తు రాకుండా కేవలం కృష్ణ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా దుల్కర్ సల్మాన్ సహజంగా నటించారు. ఆ పాత్రకు న్యాయం చేశారు. సాత్విక వీరవల్లి స్టార్ మెటీరియల్. ఆమె నటన చూస్తే మొదటి సినిమా అనిపించదు. కల్పన పాత్రకు ప్రాణం పోశారు. కొన్ని సన్నివేశాల్లో కేవలం కళ్ళతో నటించారు. క్లోజప్ షాట్స్ చూస్తే… మేజిక్ చేశారు. నటిగా శృతి హాసన్ కి ఆ రోల్ ఎంత హెల్ప్ అవుతుందనేది పక్కన పెడితే… ఆమె నటించడం వల్ల సినిమాకు హెల్ప్ అయ్యింది. రోహిణిగా శృతి నటన ఆకట్టుకుంది. గౌతమ్ మీనన్, మురళీ శర్మ, రుహానీ శర్మ, శ్వాసిక, ప్రవీణ్, చైతన్య జొన్నలగడ్డ కీలక పాత్రల్లో కనిపించారు.

Aakasamlo Oka Tara Telugu Movie Review

Aakasamlo Oka Tara Verdict:

ప్రేక్షకుల ఊహలకు రెక్కలు తొడిగే సినిమాలలో ఆకాశంలో ఒక తార ఒకటి. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి నటన బావుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం కూడా! హార్ట్ టచింగ్ ఫిల్మ్ ఇది. మంచి మాటలు, చక్కటి సంగీతం, హృదయానికి హత్తుకునే నటన… అన్నిటికీ మించి కలలు సాధించడానికి ఇచ్చే స్పూర్తి – ఆకాశంలో ఒక తారను మెమరబుల్ మూవీగా మార్చాయి. అందమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి.

PS: కొంతమందికి విచిత్రంగా అనిపించినా… ‘ఆకాశమే నీ హద్దురా’కు ‘ఆకాశంలో ఒక తార’ రివర్స్ అని చెప్పొచ్చు. అందులో భర్త కలకు భార్య అండగా నిలబడుతుంది. ఇక్కడ భార్య కలను సాకారం చేయడం కోసం భర్త అండగా నిలుస్తాడు. అయితే… రెండూ వేర్వేరు కథలు. రెండు సినిమాల్లో ప్రధాన పాత్రలవి వేర్వేరు ప్రయాణాలు. భార్యాభర్తల అనుబంధంలో, ప్రయాణంలో ఒకరికొకరు అండగా నిలబడాలనే సందేశాన్ని రెండు సినిమాలూ పరోక్షంగా ఇచ్చాయి.

Rating: (3.25/5)

మరిన్ని వార్తలు

No categories found.