Download App
Movie Poster

KJQ

Cast: Dheekshith Shetty, Shashi Odela, Yukti Thareja, Rekha Nirosha, Muralidhar Goud, Mounika Sri

Director: KK

Music Director: Poornachandra Tejaswi

Producer: Sudhakar Cherukuri

Banner: SLV Cinemas

Release Date: August 7, 2026

KJQ మూవీ రివ్యూ

Published ఆగస్ట్ 7, 2026 by Srinivas

దర్శకుడు స్వర్గీయ కిరణ్ కుమార్ మీనుగ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్, క్రైమ్ డ్రామా KJQ (King Jackie Queen). అక్కినేని నాగార్జున నటించిన కేడీ సినిమాతో కిరణ్ కుమార్ దర్శకుడిగా మారారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆ తరువాత ఆయన చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇక ఆయన చివరి చిత్రమిదే. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన అస్వస్థత గురై మరణించడంతో ఈ సినిమా కూడా విడుదలవుతుందా? లేదా? అనే సందిగ్దం ఏర్పడింది. మొత్తానికి కేకే చివరి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ఈ చిత్రంతో దర్శకుడు ఓదెల శ్రీకాంత్ సోదరుడు శశి ఓదెల హీరోగా పరిచయమవగా.. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించారు. మరి ఈ సినిమా ఫైనల్‌గా ప్రేక్షకులను అలరించిందా? ఈ చిత్రం ఎలా ఉంది? తెలుసుకుందాం.

KJQ Telugu Movie Review

కథేంటంటే..

1990ల నాటి కథ ఇది. కథలో కింగ్.. పార్థ (దీక్షిత్ శెట్టి), జాకీ (శ‌శి ఓదెల‌) ఇద్ద‌రూ మంచి స్నేహితులు. కింగ్ వచ్చేసి చిన్నప్పుడే తిరస్కరణకు గురవుతాడు. దీంతో వీధుల్లోనే పెరుగుతాడు. కాలం, పరిస్థితులు, అవసరాలు అన్నీ కలగలిసి పార్థని ఒక గ్యాంగ్‌స్టర్‌గా మార్చేస్తాయి. గల్లీ స్థాయి నుంచి చాలా పవర్‌ఫుల్ డాన్‌గా మారిన పార్థ, తన అండర్‌ వరల్డ్ వ్యాపారాన్ని నడిపించేందుకు తన నమ్మకస్తుడైన స్నేహితుడు జాకీ సహాయం తీసుకుంటాడు. మరోవైపు జాకీ వచ్చేసి తొలుత తన తల్లిని.. ఆ తరువాత తను ప్రియురాలిని కోల్పోతాడు. ఇక క్వీన్.. సినీ తార భార్గవి (యుక్తి తరేజా) విషయానికి వస్తే తన జీవితం మేడిపండు చందం. పైకి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ లోపలంతా మోసాలు, బాధాకరమైన అనుభవాలు. ఇలాంటి ముగ్గురు వ్యక్తుల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? కింగ్, జాకీ జీవితాల్లోకి క్వీన్ ఎలా వచ్చింది? మంచి స్నేహితులు కాస్తా.. బద్ద శత్రువులుగా ఎలా మారారు? క్వీన్ ఎంట్రీతో పార్థ, జాకీల జీవితాలు ఎలా మారిపోయాయి? ఆ ముగ్గురూ ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

KJQ Telugu Movie Review

సినిమా ఎలా ఉందంటే..

సినిమా మూడు ప్రధానాంశాల మధ్య, ముగ్గురు వ్యక్తుల మధ్య నడుస్తుంది. ఆ ప్రధానాంశాలేంటంటే.. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. కత్తి పట్టిన వాడు కత్తికే బలవుతాడు.. వ్యక్తి జీవితం ఎలా ప్రారంభమైందన్నది ముఖ్యం కాదు.. ఎలా ముగిసిందన్నదే కీలకం. ఇక ముగ్గురు వ్యక్తులు.. తొలుత ఈ ముగ్గురికీ ఒకరితో మరొకరికి సంబంధం ఉండదు. కానీ ముగ్గురూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో కలుస్తారు. గల్లీలో ప్రయాణం ప్రారంభించిన కింగ్.. జీవితంలో బాగా ఎదిగి డబ్బు, అధికారం, భార్య ఇలా అన్నీ సంపాదిస్తాడు. కానీ చివరికి అతనిలో మరో వ్యామోహం పుడుతుంది. జాకీకి జీవితంలో ప్రేమే అత్యంత విలువైనది. కానీ దానిని నిలబెట్టుకోలేకపోవడం అతని బలహీనత. క్వీన్ తన జీవితంలో పురుషులు అంటే తన శరీరాన్ని కోరుకునేవారు.. కానీ ఆమెకు కావల్సింది అలాంటి వారు కాదు.. తన వ్యక్తిత్వాన్ని ప్రేమించే వ్యక్తి. ఈ ముగ్గురు పాత్రలకి సంబంధించిన భావోద్వేగ ప్రయాణంతో సినిమాను నడిపించాల్సి ఉంది. అయితే భావోద్వేగం చాలా వరకూ మిస్ అయ్యింది. అయితే కింగ్, జాకీ పాత్రలకు బలమైన సన్నివేశాలు లేకపోవడం ప్రధాన లోపం. క్వీన్‌కే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్టుగా అనిపించింది. కథలో కొత్తదనం ఏమీ లేదు. పైగా ఒక క్రైమ్ డ్రామాను నడిపించడంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉత్కంఠ కలిగించినా అవి గతంలో చూసినట్టుగానే అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో సినిమా చూస్తున్నట్టుగా కాకుండా ఏదో సీరియల్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఫ్లాష్‌బ్యాక్ విషయానికి వస్తే చాలా రొటీన్‌గా అనిపించడంతో ఏమాత్రం ఆసక్తి అనిపించదు. ఇద్దరు మంచి స్నేహితులు.. శత్రువులుగా మారాలంటే ఓ బలమైన కారణం ఉండాలి. కానీ అది కూడా మనకు కనిపించదు.

KJQ Telugu Movie Review

ఎవరెలా నటించారంటే..

కింగ్ పాత్రలో దీక్షిత్ శెట్టి కనిపించి మెప్పించాడు. అలాగే తన పాత్రలోని నెగిటివ్ షేడ్స్‌ను సైతం చక్కగా ప్రదర్శించాడు. ఇక శశి ఓదెల విషయానికి వస్తే.. తొలి సినిమా కావడంతోనో ఏమో కానీ ఆయన నటన మెప్పించే స్థాయిలో అయితే లేదు. ఇక యుక్తి తరేజా ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. సినీ స్టార్‌గా అందంగా కనిపించడమే కాకుండా గ్లామర్ వెనుక బాధను సైతం చక్కగా చూపించింది. దీక్షిత్ భార్యగా రేఖా నిరోషా అద్భుతంగా నటించింది. కానీ ఆమె పాత్ర నిడివి తక్కువ. మురళీధర్ గౌడ్, మౌనిక శ్రీ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

కథలో కొత్తదనం లేకున్నా కూడా ప్రెజెంట్ చేసే విధానమే సినిమా స్థాయిని మార్చేస్తుంది. ఆ విషయంలో కేకే తడబడ్డారు. స్క్రీన్‌ప్లే మన ఊహలకు అతీతంగా ఏమీ ఉండదు. క్లైమాక్స్ స్ట్రాంగ్‌గా ఉన్నా సినిమా మరోలా ఉండేది. అది కూడా బలహీనంగా ఉండటంతో సినిమా తేలిపోయింది. సంగీతం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఎడిటింగ్ పేలవంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. KJQ ప్రేక్షకులను మెప్పించడం కష్టమే..

Rating: (2.25/5)

మరిన్ని వార్తలు

No categories found.