లస్ట్ స్టోరీస్ 3 మూవీ రివ్యూ
Published సెప్టెంబర్ 21, 2026 by Srinivas
లస్ట్ స్టోరీస్ 3.. లస్ట్ స్టోరీస్ సిరీస్‌లో భాగంగా వచ్చిన హిందీ చిత్రం. 164 నిమిషాల నిడివితో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న హిందీ ఆంథాలజీ చిత్రం. వెండితెరపై చర్చించలేని విషయాలను ఓటీటీలో చర్చిస్తున్నారు . ఈ క్రమంలో వచ్చిందే ‘లస్ట్ స్టోరీస్’ సీక్వెల్స్. వాస్తవానికి కరోనా సమయంలో వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 2’ అంతలా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ‘లస్ట్ స్టోరీస్ 3’ని మేకర్స్ జాగ్రత్తగా తెరకెక్కించారు. విక్రమాదిత్య మోత్వాని, కిరణ్ రావు, శకున్ బాత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, నాలుగు విభిన్న భాగాలుగా తెరకెక్కింది. స్త్రీల కోరికలను ముఖ్యాంశంగా చేసుకుని దీనిని మేకర్స్ రూపొందించారు. మరి ‘లస్ట్ స్టోరీస్ 3’ ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటంటే..
దీనిని నాలుగు భాగాలుగా రూపొందించారు. తొలి భాగం విషయానికి వస్తే.. దీనిని విక్రమాదిత్య మోత్వాని తెరకెక్కించారు. పద్మ (రాధికా ఆప్టే), శోనాలి (కొంకణా సేన్ శర్మ) స్నేహితులు. నాలుగు పదుల వయసులో ఉన్న పద్మ, శోనాలి ఇద్దరూ సెక్స్ లైఫ్ విషయంలో అసంతృప్తితో ఉంటారు. ఈ క్రమంలోనే ఓ కొరియన్ వెబ్‌సిరీస్ చూస్తూ ఉంటారు. దానిని చూసిన శోనాలికి భర్తలను ఎక్స్చేంజ్ చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. పథకం ప్రకారం భర్తలతో కలిసి వీకెండ్ ట్రిప్‌కు వెళతారు. అక్కడ ఇద్దరూ తమ ప్లాన్‌ను అమలు చేశారా? ఆ తరువాత ఏం జరిగిందన్నదే తొలి భాగం కథాంశం.
రెండో భాగం గురించి చెప్పాంటే.. కిరణ్ రావు తెరకెక్కించారు. పిజ్జా డెలివరీ బాయ్ కరణ్(గుర్‌ఫతేహ్ పిర్జాదా), నెయిల్ ఆర్టిస్ట్ లీసా(సానా థంపి) తొలిచూపులోనే ఆకర్షణకు లోనవుతారు. లీనా తన ఫ్లాట్‌లో ఓ నటితో కలిసి ఉంటుంది. ఆమె షూటింగ్‌కు వెళ్లడంతో ఫ్లాట్‌లో లీసా, కరణ్ శారీరకంగా దగ్గరవుతారు. ఇలా తరచూ కలుస్తుంటారు. కరణ్‌తో పాటు అతని కవల సోదరుడైన అర్జున్ అచ్చు గుద్దినట్టుగా అతని లాగే ఉంటాడు. దీంతో కరణ్, లీసాల బంధంలోకి అర్జున్ ప్రవేశిస్తాడు. అర్జున్ కూడా లీసాకు దగ్గరవుతాడు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది. కరణ్, అర్జున్‌ల మధ్య లీసాకు తెలియని రహస్యమేంటి? వారిద్దరికీ తెలియకుండా లీసా దాచిన విషయమేంటి? వంటి అంశాలతో రూపొందింనదే సెకండ్ పార్ట్.
శకున్ బాత్రా దర్శకత్వం వహించిన మూడో భాగం విషయానికి వస్తే.. భార్యాభర్తలైన వరుణ్(అలీ ఫజల్), సైనీ(రాధికా మదన్) మధ్య సఖ్యత ఉండదు. ప్రతి విషయానికీ గొడవ పడుతుంటారు. కేవలం సెక్స్ విషయంలో మాత్రమే కలిసుంటారు. ఈ గొడవల నేపథ్యంలో ఇద్దరూ కలిసుండలేమని డిసైడ్ అవుతారు. విడాకుల కోసం కోర్టుకు వెళితే ఆరు నెలలు వేచిచూడాలని కోర్టు చెబుతుంది. ఈ ఆరు నెలల కాలంలోనూ ఎప్పుడు కలిసినా గొడవ పడుతుంటారు. అంతలోనే శారీరకంగా ఒక్కటవుతుంటారు. చివరకు వారి వైవాహిక బంధం ఎలాంటి మలుపు తీసుకుందనేది థర్డ్ పార్ట్.
నాలుగో భాగం గురించి చెప్పాలంటే.. దీనిని విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. 1980లో హైదరాబాద్‌లో జరిగిన కథ ఇది. దంపతులైన సైరా(అదితీరావ్ హైదరి), బద్రు(సిద్ధార్థ్) అన్యోన్యంగా జీవిస్తుంటారు. సైరాకు ఫాంటసీలు ఎక్కువ కావడంతో బద్రుతో ఆమె సెక్సువల్ లైఫ్ ఆనందంగా ఉండదు. ఈ క్రమంలోనే సైరా రహస్యంగా పురుషుడి నుంచి ఓ మహిళ ఏం కోరుకుంటుంది? ఆమె మనసును, తనువును రంజింపజేయాలంటే ఏం చేయాలనే అంశాలతో ఓ పుస్తకం రాస్తుంది. ఓ పబ్లిషర్ దాన్ని ముద్రించి మార్కెట్లోకి తేవడంతో బద్రు కూడా దాన్ని కొనుక్కుంటాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది నాలుగో భాగం.
ఎలా ఉందంటే..
ఆంథాలజీలు కొంచెం కష్టమైనవి. ఎందుకంటే ప్రేక్షకులు ఒక కథలో పూర్తిగా లీనమవకముందే మరో కథ ప్రారంభమవుతుంది. అయితే ‘లస్ట్ స్టోరీస్ 3’ ఆ ఫార్మాట్‌ను పూర్తిగా అర్థం చేసుకుని మరీ రూపొందించినట్టుగా అనిపిస్తుంది. దాని నాలుగు భాగాలూ ఒకేలా అనిపించవు. ఒక్కొక్కటి ఒక్కో కథాంశం. అంతిమంగా భాగాలన్నీ తిరిగేది మాత్రం సెక్స్ చుట్టూనే. ఈ నాలుగింటిలో విక్రమాదిత్య మోత్వాని కథ అత్యంత విలక్షణమైనది. ఈ నాలుగు కథలు ఒకదానితో మరొకటి పోటీ పడవు. కోరికను ఎంత విభిన్నంగా అర్థం చేసుకోవచ్చో చూపించారు. దాంపత్య బంధంలో ఒకరి పట్ల మరొకరికి కాలం గడిచినా తరిగిపోని ఆకర్షణ ఉండాలి. ఒకవేళ అది తగ్గితే అసంతృప్తి పేరుకుపోతుంది. ఇద్దరితో పోలిస్తే మహిళల్లో ఆ అసంతృప్తి భావన ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిష్కారం ఏంటనేది ఫస్ట్ పార్ట్ వివరిస్తుంది. అయితే ఈ అంశాన్ని సీరియస్‌గా కాకుండా కామెడి వేలో చూపించడం ఆసక్తికరం.
వాంఛ అనేది లైంగిక పరమైనది మాత్రమే కాదు. ఉన్నత జీవితం కోసం పడే ఆరాటం కూడా అని సెకండ్ పార్ట్‌లో చూపించారు. కోరిక అనేది ఎలాంటి అడ్డదారులు తొక్కిస్తుందన్నది ఈ సెకండ్ పార్ట్‌లో చూపించారు కానీ ఇది అంతగా ఆకట్టుకోలేకపోయింది. మూడో భాగం విషయానికి వస్తే భార్యభర్తల మధ్య కమ్యూనికేషన్ అనేది ఎంత ముఖ్యమో చూపించారు. అలాంటివేం లేకుండా కేవలం సెక్స్ పొందేందుకే బంధం అయితే ఎలా ఉంటుందన్న అంశాన్ని చూపించారు. నాలుగో భాగంతో అన్యోన్య దంపతులు.. పడకగదిలోనూ ఒకరి ఆలోచనలు మరొకరు తెలుసుకుని మెలగాలని చూపించారు. ముఖ్యంగా పడక గదిలో ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమనే అంశాన్ని చర్చించారు. ఇది ఆకట్టుకునేలా తీశారు. రెండో భాగం మినహా అంతా బాగుంది. కొంత మేర సాగదీత అనిపిస్తుంది కానీ ఓవరాల్‌గా మాత్రం ‘లస్ట్ స్టోరీస్ 3’ ఆకట్టుకుంటుంది.
ఎవరెలా నటించారంటే..
లస్ట్ స్టోరీస్ 3లో నటించిన ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, అలీ ఫజల్, రాధికా మదన్.. తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రియల్ కపులైన సిద్ధార్థ్, అదితీరావ్ హైదరి జంట.. రీల్ జంటగా కూడా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా అదితి ఆకట్టుకుంటుంది.
‘లస్ట్ స్టోరీస్ 3’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనిని కుటుంబంతో కలసి చూడలేం. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే తెలుగు ఆడియో కూడా అందుబాటులోఉంది.
ఫైనల్‌గా.. లస్ట్ స్టోరీస్ 3 ఎంటర్‌టైన్ చేస్తుంది.
Rating: 



(3/5)
