ది ప్యారడైజ్ మూవీ రివ్యూ
Published సెప్టెంబర్ 24, 2026 by Srinivas
సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 18 ఏళ్ల కెరీర్‌లో ఇదే తనకు అత్యంత భారీ చిత్రమని, అలాగే మోస్ట్ టైరింగ్ చిత్రమని చెప్పి హీరో నాని అంచనాలను పెంచేశాడు. ముందుగా ఈ చిత్రంలో నాని లుక్కే జనాలకు చాలా వెరైటీగా అనిపించింది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి మేజిక్ చేసేందుకు నాని సిద్ధమయ్యాడు. మరి మేజిక్ చేశారా? తెలుసుకుందాం.

కథేంటంటే..
1984 కాలంలో జరిగిన కథ ఇది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్ పరిసర ప్రాంతల్లో నివసించే సంచార జాతీయులైన సవారీలకు గుర్తింపే ఉండదు. వాళ్లు అసలు జనాభా లెక్కల్లో కూడా ఉండరు. అలా బాగా అణచివేతకు గురైన సవారీల జాతికి చెందిన యువకుడే జడల్ జమానా(నాని). కనీసం వీరికి తినడానికి తిండి కూడా ఉండదు. ఇక వీరంతా శికంజ మాలిక్ (మోహన్‌బాబు) చెప్పింది చేస్తూ ఆయన కాళ్ల కింద బతుకీడుస్తూ ఉంటారు. మాలిక్, అతని కొడుకు సవారీలను చాలా నీచంగా చూస్తుంటాడు. మొదట్లో అందరిలాగే జడల్ కూడా బతుకుతూ ఉంటాడు. ఒక సందర్భంలో తన తల్లిని తూలనాడటం జడల్ సహించలేక పోతాడు. ఈ క్రమంలోనే మాలిక్‌కు జడల్ ఎదురు తిరుగుతాడు. అది కాస్తా జాతి గుర్తింపు కోసం పోరాటంగా మారుతుంది. మరి ఆ పోరాటాన్ని జడల్ ఎలా నడిపించాడు? సినిమాలో బిర్యాని (సంపూర్ణేష్ బాబు) పాత్రేంటి? అసలు సుబ్బు (కయాదు లోహర్) ఎవరు? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
ప్రమోషన్స్ పీక్స్‌లో ఉంటే మ్యాటర్ వీక్‌గా ఉన్నట్టని అంటారు. ప్రమోషన్స్ బీభత్సంగా నిర్వహించారు. అవి చూసి సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళితే మాత్రం కష్టమే. ప్రమోషన్స్, పాటలు అన్నీ కలిసి అంచనాలకు రెక్కలు కట్టేశాయి. సినిమా చూస్తే ఆ స్థాయిలో లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తుంది. అణచివేతకు గురైన ఒక సమూహానికి, ఒక నియంతృత్వ శక్తికి మధ్య జరిగే పోరాటాన్ని కథాంశంగా తీసుకుని శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాని ఎంట్రీ సీన్ చాలా బాగా డిజైన్ చేశారు. జైలులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో నానిని చూపించారు. సినిమాలో తల్లీకొడుకుల ఎమోషన్ ఆకట్టుకుంటుంది. గుర్తింపు కోసం తల్లీకొడుకులు కలిసి చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ‘సలార్, కేజీఎఫ్’ చిత్రాలను గుర్తుకు తెస్తాయి. ముఖ్యంగా సినిమాలో కేసీఆర్ సీన్ నెక్ట్స్ లెవల్. డైలాగ్స్, స్వాగ్ చాలా బాగుంది. యాక్షన్, ఎమోషన్ మిక్స్‌డ్ సన్నివేశంతో ఇంటర్వెల్ ఇచ్చిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక మిగిలిదంతా నార్మల్‌గానే ఉంటుంది. వావ్ మూమెంట్స్ అంతగా ఏమీ లేవు. సినిమా నిడివి కూడా అంత ఉండాల్సింది కాదేమో అనిపిస్తుంది. భారీ అంచనాలతో ప్రేక్షకులు వెళితే మాత్రం నిరుత్సాహపడతారు.

ఎవరెలా నటించారంటే..
వివక్షకు వ్యతిరేకంగా, పౌరసత్వం కోసం, వ్యవస్థాగత అన్యాయాన్ని ఎదుర్కొంటూ సాగే పోరాటంలో అణగారిన తెగకు నాయకత్వం వహించే వ్యక్తిగా నాని అదరగొట్టాడు. ప్రతి సన్నివేశంలోనూ అద్భుతంగా నటించాడు. కయాదు లోహర్ కూడా తన పాత్రలో చక్కగా నటించింది. ఫస్ట్ ఆఫ్‌లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ సెకండాఫ్‌లో మాత్రం పర్వాలేదనిపించింది. ఇక మాలిక్‌గా మోహన్ బాబు తన పాత్రలో జీవించారు. ఇక నాని తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి అద్భుతంగా నటించారు. బిర్యానీగా సంపూర్ణేష్ బాబు, రాఘవ్ జుయల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా సినిమా తీశారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలపై పట్టు బిగించారు. విలన్‌గా మోహన్‌బాబును ఎంచుకోవడం ది బెస్ట్ మూవ్. ఇక అనిరుధ్ రవిచంద్ర బీజీఎం అదరగొట్టారు. ఇక పాటల గురించి చెప్పేదేముంది.. ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ మెట్టు ఎక్కించాయి. ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ వహించాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాలతో వెళితే కష్టమే. మేజిక్ అయితే వర్కవుట్ కాలేదు.
Rating: 



(2.5/5)
