Download App

‘ఇథనాల్’ తో ఇం’ధనం’… వాస్తవాలతో కేంద్ర ప్రభుత్వం…

జూలై 6, 2026 By Suresh Thota
భారత ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఇథనాల్ బ్లెండింగ్ (E20)" కార్యక్రమంపై ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. "ఇథనాల్" కలిపిన పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు మొరాయిస్తాయని, వారంటీలు రద్దవుతాయని, చివరికి ఇంధన...
'ఇథనాల్' తో ఇం'ధనం'… వాస్తవాలతో కేంద్ర ప్రభుత్వం…

భారత ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఇథనాల్ బ్లెండింగ్ (E20)” కార్యక్రమంపై ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. “ఇథనాల్” కలిపిన పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు మొరాయిస్తాయని, వారంటీలు రద్దవుతాయని, చివరికి ఇంధన ట్యాంకులకు చీమలు పడతాయనే వరకు రకరకాల వదంతులు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి. ఈ నేపథ్యంలో “కేంద్ర చమురు, సహజ వాయువుల మంత్రిత్వ” శాఖ, “ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో” (PIB) ద్వారా “మిత్ వర్సెస్ ఫ్యాక్ట్” (అబద్ధం నుండి నిజం) పేరిట విడుదల చేసిన అధికారిక వివరణ తో, ప్రజలకు స్పష్టత ఇచ్చినట్లైంది.

సోషల్ మీడియా పుకార్ల వేగానికి అడ్డుకట్ట వేస్తూ, ప్రభుత్వం సాంకేతిక ఆధారాలతో సహా వాస్తవాలను ప్రజల ముందుంచింది. “ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా” (ARAI) లాంటి ప్రతిష్టాత్మక సంస్థల ఆధ్వర్యంలో వేల కిలోమీటర్ల మేర పరీక్షలు నిర్వహించిన తర్వాతే, E20 ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చామని స్పష్టం చేయడం ద్వారా, వాహనదారుల్లో నమ్మకాన్ని పెంచే పరిణామమే అయితే, ఈ ఇథనాల్ విప్లవం వెనుక ఉన్న లాభనష్టాలను కేవలం ఒక ప్రకటనతో సరిపెట్టకుండా, దేశ ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాల కోణంలో లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

​దేశీయ ఆర్థిక వ్యవస్థకు బలం

ఇథనాల్ వినియోగం అనేది కేవలం ఇంధన మార్పు మాత్రమే కాదు, దేశ సార్వభౌమాధికారానికి, ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన వ్యూహాత్మక అడుగు. రమారమి ​రూ. 1.9 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. మన దేశ అవసరాలకు అవసరమైన క్రూడాయిల్‌ను 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటున్నాము. ఇథనాల్ కలపడం ద్వారా దేశ ఖజానాకు భారీగా ఆదా అవుతోంది. అంతే గాక, మన దేశ గ్రామీణ భారతం ఆర్థికంగా, పరిపుష్టం చెందుతుంది. ఎలాగంటే “ఇథనాల్‌”ను చెరకు, మొక్కజొన్న, మిగిలిపోయిన ధాన్యం నుండి తయారు చేస్తారు. ఇప్పటివరకు దాదాపు రూ.1.6 లక్షల కోట్లు నేరుగా రైతులకు చెల్లింపుల రూపంలో అందడం తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది.

​పర్యావరణ హితం….

సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే ఇథనాల్ స్వచ్ఛమైనది. ఇప్పుడు “ఎల్ నినో” ప్రభావం తో పర్యావరణ సమతుల్యత లో తేడా వచ్చి యూరోప్ లో పరిస్థితులు మనకు తెలిసినవే, దాని ప్రభావం ఇప్పుడు కాస్త తగ్గుతుంది ఈ ఇథనాల్ తో, దాదాపు 930 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గడం అనేది మామూలు విషయం కాదు. గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఇది ఒక పెద్ద ఉపశమనం. ​ప్రభుత్వం చెబుతున్న ప్రయోజనాలు అక్షరాలా నిజమే అయినప్పటికీ, ఈ ప్రయాణంలో కొన్ని సవాళ్లను అంత తేలికగా తీసిపారేయలేము.

​పాత వాహనాల భవిష్యత్తు….

2023 కంటే ముందు తయారైన పాత వాహనాలు పూర్తి స్థాయిలో E20 ఇంధనానికి అనుకూలమైనవి కావు. పాత వాహనాల్లోని రబ్బర్, ప్లాస్టిక్ విడిభాగాలు “ఇథనాల్” రసాయన స్వభావం వల్ల త్వరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కొత్త వాహనాలకు ఇబ్బంది లేకపోయినా, రోడ్లపై ఉన్న కోట్లాది పాత వాహనాల పరిస్థితి ఏమిటనే దానికి స్పష్టమైన సాంకేతిక పరిష్కారం కావాలి. పాత వాహనాల విషయంలో ఒక ధర నిర్ణయించి ప్రభుత్వం వెనుకకు తీసుకునే అవకాశాలను పరిశీలించాలి. లేదా ఆయా వాహన సంస్థలు తమ వాహనాలను వెనుకకు తీసుకునే లా కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తే కూడా మెరుగైన ప్రయోజనాలు ఉండొచ్చు.

మనదేశం మాత్రమే కాకుండా ప్రపంచంలో చాలా దేశాలు….. ఇథనాల్ ను పెట్రోల్ లో కలుపుతున్నాయి. ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అంశం కాదు. కాని “ఇథనాల్” ఉత్పత్తి కోసం మొక్కజొన్న, నాణ్యమైన ధాన్యాలను మళ్లించడం వల్ల భవిష్యత్తులో పౌల్ట్రీ, పశుగ్రాసం ధరలు పెరిగే అవకాశం ఉందనేది ఆర్థిక నిపుణుల ఆందోళన. ఆహార భద్రతకు విఘాతం కలగకుండా ప్రత్యామ్నాయ వ్యర్థాల (Agricultural Waste) నుండి ఇథనాల్ తయారీని (2G Ethanol) మరింత ప్రోత్సహించాల్సి ఉంది.

​ముగింపు…. ఏదైనా ఒక పెద్ద మార్పు సమాజంలోకి వచ్చేటప్పుడు అనుమానాలు, అపోహలు సహజం. కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన వివరణ తాత్కాలిక గందరగోళాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. అయితే, ప్రభుత్వం కేవలం అపోహలను తొలగించడం తోనే ఆగిపోకూడదు. పాత వాహనదారులకు తగిన ప్రత్యామ్నాయాలు చూపించడం, మైలేజీలో వచ్చే స్వల్ప వ్యత్యాసాన్ని అధిగమించేలా ఇంధన ధరల నియంత్రణ చేయడం, ఆహార భద్రత దెబ్బతినకుండా చూసుకోవడం వంటి దీర్ఘకాలిక సవాళ్లపై దృష్టి సారించాలి. అప్పుడే “ఇథనాల్ తో ఇంధన స్వయంసమృద్ధి” లక్ష్యం నూటికి నూరు శాతం విజయవంతమవుతుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading