
ఈ రోజు మే 22, 2026 వ తేదీన సుప్రీం కోర్టు రిజర్వేషన్లకు సంబంధించి, ముఖ్యంగా “క్రీమీలేయర్ (Creamy Layer)” పరిమితులపై కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల ద్వారా విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాల పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు కొనసాగించాలా…? అని ధర్మాసనం ప్రశ్నించింది.
ఉదా:-“తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు అయితే, వారి పిల్లలకు ఇంకా రిజర్వేషన్లు ఎందుకు ఉండాలి…..? విద్య, ఆర్థిక సాధికారత వచ్చినప్పుడు సమాజంలో వారి హోదా (Social Mobility) కూడా మారుతుంది. ఆ తర్వాత కూడా పిల్లలు రిజర్వేషన్లు కోరుకుంటే.. మనం దీని నుండి ఎప్పటికీ బయటపడలేము” అని జస్టిస్ “బి.వి. నాగరత్న” వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు మంచి చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాల్లో ఉంటూ మంచి ఆదాయం పొందుతున్నప్పుడు.. వారి తర్వాతి తరం రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు రావాలని కోర్టు అభిప్రాయపడింది.
కేసు నేపథ్యం:
కర్ణాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) ఉద్యోగానికి ఎంపికైన ఒక అభ్యర్థి, తనను వెనుకబడిన తరగతుల (Category II-A) క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారంటూ రిజర్వేషన్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థి తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం, వారి వార్షిక ఆదాయం రూ. 19.48 లక్షలుగా ఉండటంతో క్రీమీలేయర్ కిందకు వస్తారని అధికారులు తేల్చారు. దీన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించగా, సుప్రీం కోర్టులో అప్పీల్ చేశారు. ఈ విచారణ సందర్భంగానే ధర్మాసనం పైవిధంగా స్పందించింది.
అందుకే సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశ్యం కేవలం ఉద్యోగాలు లేదా విద్యా అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు, శతాబ్దాలుగా సామాజిక అణచివేతకు గురైన వర్గాలకు గౌరవాన్ని, సమాజంలో సమాన హోదాను (Social Mobility) కల్పించడం. ఒక కుటుంబం విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుని, “ఐఏఎస్” వంటి దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ హోదాలను పొందినప్పుడు.. ఆ కుటుంబం సమాజంలో ఎదుర్కొనే సామాజిక వివక్ష దాదాపు తొలగిపోతుంది. అటువంటి స్థితిలో, వారి తర్వాతి తరం కూడా అదే రిజర్వేషన్ ప్రయోజనాలను ఆశించడం వల్ల ఆయా వర్గాల్లోని అసలైన పేదలకు లభించాల్సిన అవకాశాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒకే వర్గంలోని సంపన్న, ఉన్నత శ్రేణి (Creamy Layer) నిరంతరం ఆ ఫలాలను అనుభవిస్తూ ఉంటే, రిజర్వేషన్ల అసలు ఆశయమే పక్కదారి పడుతుంది.
ఆర్థిక మరియు అధికార సాధికారత లభించినప్పుడు ఒక వ్యక్తి యొక్క లేదా కుటుంబం యొక్క సామాజిక హోదా గుణాత్మకంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్నత విద్యావంతులైన, సివిల్ సర్వెంట్లుగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలకు లభించే వనరులు, పాఠశాల విద్య, సామాజిక పరిచయాలు….. అదే వర్గానికి చెందిన ఒక గ్రామీణ కూలీ లేదా కార్మికుడి పిల్లలకు లభించే వనరులతో ఏమాత్రం సరితూగవు. ఈ ఇద్దరినీ ఒకే త్రాటిపై ఉంచి పోటీ పడమనడం పరోక్షంగా అసమానతలను మరింత పెంచడమే అవుతుంది. అందువల్ల, వనరులు మరియు గుర్తింపు ఉన్న వర్గాలు స్వచ్ఛందంగానో, లేదా చట్టపరమైన నిబంధనల ద్వారానో, రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పుకున్నప్పుడే, ఈ వ్యవస్థలో నిజమైన సమానత్వం సాధ్యమవుతుంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే క్రీమీలేయర్ నిబంధనలను మరింత పటిష్టంగా మరియు పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతమున్న నిబంధనలు కేవలం ఓబీసీ వర్గాలకే పరిమితం కాకుండా, అన్ని రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే వర్గాల్లోని అత్యున్నత సంపన్న, అధికార వర్గాలకు కూడా వర్తింపజేసేలా చట్టపరమైన పునఃసమీక్ష జరగాలి. లబ్ధిదారుల పరిమితులను ఎప్పటికప్పుడు మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తూ ఉండాలి. అప్పుడే, రిజర్వేషన్లు అనేవి ఒక వర్గంలోని కొద్దిమందికే పరిమితం కాకుండా, నిరంతరాయంగా కింది స్థాయికి వారికి అందుతూ ఉండాలి.
సమాజంలో అట్టడుగున, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి రిజర్వేషన్ల ఫలాలు అందినప్పుడే సామాజిక న్యాయం పరిపూర్ణమవుతుంది. సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు రిజర్వేషన్లను బలహీనపరచడానికి కాకుండా, వాటిని మరింత అర్హులైన వారికి అందేలా ఒక దిశానిర్దేశంలా భావించాలి. “ఐఏఎస్” అధికారులు లేదా ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధుల పిల్లలు రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పుకుంటే, ఆ ఖాళీలను అదే సమాజంలోని ఒక పేద రైతు బిడ్డో లేదా రోజువారీ కూలీ బిడ్డో భర్తీ చేయగలుగుతారు. ఈ తరహా మార్పు ద్వారానే వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ సమాన వికాసానికి మార్గం సుగమమవుతుంది.
రిజర్వేషన్లు సమాజంలోని అసమానతలను తొలగించి అందరినీ ఒకే స్థాయికి చేర్చే వారధులు మాత్రమే. సాధికారత సాధించిన కుటుంబాలు తమ సామాజిక బాధ్యతగా వెనుకబడిన తమ తోటి సహోదరులకు దారివ్వాలి. అప్పుడే అణగారిన వర్గాలలోని ప్రతి పేద బిడ్డకూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం లభిస్తుంది. సుప్రీం కోర్టు లేవనెత్తిన ఈ ఆలోచనను కేవలం ఒక వ్యాఖ్యగా వదిలేయకుండా, పాలకులతో పాటు సమాజం కూడా లోతుగా ఆలోచించి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునేట్టుగా తగు సూచనలు చేయాలి.
గమనిక: ఇది కాకుండా, రెండు రోజుల క్రితమే మే 20 వ తేదీన , ప్రభుత్వ లీగల్ ప్యానెల్స్ మరియు లా ఆఫీసర్ల నియామకాల్లో మహిళా న్యాయవాదులకు కనీసం 30% రిజర్వేషన్లు కల్పించాలనే పిల్ (PIL) పై కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
