
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా మూలపాడులో చేపట్టిన వన సంరక్షణ కార్యక్రమం నిజంగా హర్షించదగినది…. ఆహ్వానించతగ్గది.
ప్రకృతిని ప్రేమించడం వేరు… ఆ ప్రకృతిని కాపాడుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగి కార్యాచరణకు శ్రీకారం చుట్టడం వేరు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి “పవన్ కళ్యాణ్” సరిగ్గా ఇదే నిరూపించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ఎన్టీఆర్ జిల్లా, కొండపల్లి సమీపంలోని “మూలపాడు” బటర్ ఫ్లై పార్క్‌లో ఆయన ఈ కార్యక్రమాన్ని…. ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా….. అది పర్యావరణ పరిరక్షణపై ఆయనకున్న ప్రేమ, తపనకు, భావితరాల పట్ల ఆయనకున్న బాధ్యతను తెలియజేస్తుంది.
రాష్ట్రవ్యాప్తంగా పది రోజుల్లో (జూన్ 5 నుండి 15 వరకు) 2.5 కోట్ల సీడ్ బాల్స్ (విత్తన బంతులు) తయారు చేయాలనే బృహత్తర లక్ష్యాన్ని నిర్దేశించడమే కాకుండా… తానే స్వయంగా మట్టి తీసుకుని విత్తన బంతులు తయారు చేసి లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారు.
పదవులు అలంకారం కాదు, అదొక బాధ్యత అని నమ్మే నాయకుడు “పవన్ కళ్యాణ్” మూలపాడు వేదికగా జరిగిన పర్యావరణ వేడుకల్లో ఆయన కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాలేదు. స్వయం సహాయక సంఘాల మహిళలు, పాఠశాల విద్యార్థులు, స్థానిక గ్రామస్తులతో కలిసి నేలపై కూర్చుని స్వయంగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అంకుడు, తెల్లపొణికి, వేప, కుంకుడు, రావి, మర్రి, వెదురు, ఉసిరి, చింత, మోదుగ వంటి అచ్చమైన స్వదేశీ (Indigenous) జాతుల విత్తనాలతో ఈ బంతులను రూపొందించడం విశేషం. మన నేల స్వభావాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడటంలో స్వదేశీ మొక్కల పాత్ర ఎంతైనా ఉందనే శాస్త్రీయ దృక్పథం ఈ ఎంపికలో స్పష్టంగా కనిపిస్తోంది.
కొండలు, గుట్టలు వంటి ప్రదేశాలు మరియు మనుషులు సులభంగా వెళ్లలేని దుర్గమమైన ప్రాంతాల లో సైతం పచ్చదనాన్ని నింపేందుకు “డ్రోన్” సాంకేతికత ను ఉపయోగించడం ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” దూరదృష్టికి నిదర్శనం. డ్రోన్ల ద్వారా కొండ శిఖరాలపై విత్తన బంతులను జారవిడిచే ప్రక్రియను ఆయనే స్వయంగా పరిశీలించి, అటవీకరణలో టెక్నాలజీ ప్రాధాన్యతను చాటిచెప్పారు.
ఈ హరిత యజ్ఞం ఒకే చోట ఆగిపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 ప్రాంతాలలో ఈ సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని విస్తరించారు. “మూలపాడు” నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాల్గొంటున్న ప్రజలతో ముచ్చటించిన “పవన్ కళ్యాణ్” … “ఇది కేవలం ప్రభుత్వ ప్రోగ్రామ్ కాదు… ఇది ప్రజా ఉద్యమం” అని చాటిచెప్పారు. వన సంరక్షణ కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

పర్యావరణానికి యోగా జోడింపు….
పర్యావరణం అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా. “మూలపాడు” బటర్ ఫ్లై పార్క్ నమూనాను పరిశీలించే క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన యోగా హాల్ నిర్మాణ శైలి పవన్ కళ్యాణ్ గారిని విశేషంగా ఆకట్టుకుంది. తక్షణమే స్పందించిన ఆయన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఎకో టూరిజం పార్కులో ఒక యోగా హాల్‌ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి ఒడిలో యోగా సాధన చేయడం ద్వారా ప్రజల్లో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందనే ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
హస్తకళల కళాకారుల గుండెల్లో ధైర్యం…
పర్యావరణ శాఖ మంత్రి అంటే కేవలం అడవులను మాత్రమే చూడటం కాదు, ఆ అడవులపై ఆధారపడి జీవించే చేతివృత్తుల వారి బాగోగులు చూడటం కూడా అందులోని బాధ్యత గా తీసుకోవాలని అప్పుడే అది నిజమైన నాయకుడి లక్షణం అని అందరికి తెలియచెప్పారు. “కొండపల్లి” కొయ్యబొమ్మల తయారీకి వాడే “తెల్లపొణికి” దుంగలను, ఉదయగిరి కళాకారులు తయారు చేసిన వంట సామాగ్రిని, చెక్క వాచ్, ల్యాప్‌టాప్ వంటి అద్భుత సృజనాత్మక వస్తువులను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. కళాకారుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వాళ్ళకి అందించిన భరోసా మాటలలో చెప్పలేనిది.
వుడ్ బ్యాంక్ (Wood Bank) ఏర్పాటు ఆవశ్యకత…. బొమ్మల తయారీకి అవసరమైన చెక్క లభించడం లేదని చిత్తూరు కళాకారులు ఆవేదన వ్యక్తం చేయగా, త్వరలోనే “వుడ్ బ్యాంక్” ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా మీకు వుడ్ కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బూర్గుల రామకృష్ణారావు ప్రతిమను కొయ్యబొమ్మల శైలిలో తయారు చేయించాలని అధికారులను కోరారు. ఈ హస్తకళలకు గ్లోబల్ మార్కెటింగ్ కల్పించేందుకు, ప్రచారం కల్పించేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని నొక్కి చెప్పారు. ప్రతి రెండు నెలలకోసారి ఏదో ఒక ప్రాంతంలో చేతివృత్తుల కళాకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం.
ముగింపు: ఈ పర్యావరణ దినోత్సవ వేడుక ఒక సరికొత్త సందేశాన్ని ఇచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవడం అంటే కేవలం మొక్కలు నాటడమే కాదు… సాంకేతికతను వాడుకుంటూ, స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ప్రకృతిపై ఆధారపడిన సాంప్రదాయ కళలను బ్రతికించుకోవడం కూడా అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరూపించారు.
ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఉన్నతాధికారులు కాంతిలాల్ దండే, పీవీ చలపతిరావు, మల్లికార్జునరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వంటి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ… ఆయన వేసిన ఈ “2.5 కోట్ల విత్తన బంతుల” అడుగు, రేపటి ఏపీని “హరితాంధ్రప్రదేశ్” గా మార్చడంలో మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రకృతి పట్ల ఆయన పడుతున్న తపన.. ప్రతి ఒక్కరిలోనూ పర్యావరణ చైతన్యాన్ని రగిలించేలా ఉంది.
