
రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. కొందరు అధికారంలో ఉన్నంతవరకే ప్రజలకు గుర్తుంటారు. కానీ, భౌతికంగా దూరమై మూడు దశాబ్దాలు దాటినా… ఇప్పటికీ ఒకే ఒక పేరు ప్రజా హృదయాల్లో సజీవంగా, ఒక ప్రభంజనంలా మారుమోగుతూనే ఉంది. ఆ పేరే “వంగవీటి మోహన రంగా”. “మళ్లీ పుడతామా ఏమిటి”…. ఎవరికీ తెలియదు. పుట్టినప్పుడే చరిత్రలో మనకంటూ ఒక పేజీ సృష్టించుకోవాలి. అలా తెలుగు జాతి కీర్తి కిరీటంలో నిలిచిన వ్యక్తి VM రంగా.
నేడు జూలై 4 వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా, ప్రజల మనిషిగా ఆయన సాగించిన ప్రస్థానం, నిరుపేదల గుండెల్లో ఆయన సంపాదించుకున్న చెరగని కీర్తి ప్రస్థానం పై….
కాటూరు నుండి విజయవాడ దాకా.. జన హృదయ నేతగా…
1947 జూలై 4న కృష్ణా జిల్లా కాటూరులో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన వంగవీటి మోహన రంగా, ఉన్నత చదువుల కోసం విజయవాడలో అడుగుపెట్టారు. ఆ నగరమే ఆయన జీవితాన్ని, ఆయన ద్వారా ఆ ప్రాంత రాజకీయాలను శాసించేలా మార్చింది. సమాజంలో వెనుకబడిన, అణగారిన వర్గాల గొంతుకగా మారిన రంగా… అతి తక్కువ కాలంలోనే విజయవాడ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారు.
పేదల పెన్నిధిగా “కాపు” కాసిన VM రంగా
రాజకీయ నాయకుడిగా రంగా శైలి చాలా ప్రత్యేకం. ఆయన దగ్గరకు వచ్చే పేదవాడికి కులం, మతం, ప్రాంతం అనే తేడాలు ఎప్పుడూ లేవు. విజయవాడలోని రంగా నివాసం ఎప్పుడూ ప్రజలతో కిటకిటలాడుతూ ఉండేది. పేద, బడుగు బలహీన వర్గాల భూములు కబ్జాకు గురైనా, రిక్షా కార్మికులకు అన్యాయం జరిగినా, శ్రామిక వర్గాలు దోపిడి కి గురైనా, VM రంగా అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. తన దగ్గరి వచ్చిన ఏ ఒక్కరూ ఆకలితో వెళ్లకూడదనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయనను కేవలం ఒక లీడర్‌గా కాకుండా, పేద, శ్రామిక, విద్యార్థి వర్గాలు వారు ఒక పెన్నిధిగా ఆరాధించారు.
కార్పొరేటర్ నుండి శాసనసభ్యుని వరకు…
ప్రజల్లో ఆయనకున్న ఆదరణే ఆయనను రాజకీయ శిఖరానికి చేర్చింది. 1981లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున 1985 లో, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించి, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ లో ప్రజా సమస్యలపై ఆయన వాణి బలంగా వినిపించారు.
“ఆమరణ నిరాహార దీక్ష”…
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, శాంతిభద్రతలను కాపాడాలని కోరుతూ VM రంగా చేపట్టిన ఆమరణ “నిరాహార దీక్ష” ఏపీ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద సంచలనం. ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, 1988 డిసెంబర్ నెలలో విజయవాడలో శాంతిభద్రతలు క్షీణించాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని వంగవీటి మోహన రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 1988 డిసెంబర్ 23న విజయవాడలోని బందరు రోడ్డులో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
ఆయన దీక్ష చేస్తుండగానే… కొన్ని అరాచకశక్తులు ఆయనకు వస్తున్న పేరును చూసి, తట్టుకోలేక 1988 డిసెంబర్ 25 వ తేదీ తెల్లవారుజామున (క్రిస్మస్ రోజున) ఊహించని విధంగా దాడి చేసింది. ఒక్కసారిగా బాంబులతో దీక్షా శిబిరంపై విరుచుకు పడ్డారు. నిరాహార దీక్షలో ఉండి నీరసించిపోయిన VM రంగా ని, ఆయన అనుచరులను ఆ ముఠా వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపింది. ఈ వార్త తెలియగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు, హింస చెలరేగాయి. రోజుల తరబడి కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. అలా ఆ మహానాయకుని శకం ముగిసింది.
భౌతికంగా దూరమైనా….
1988 డిసెంబర్ 25న జరిగిన దురదృష్టవశాత్తూ జరిగిన ఆ ఘోర సంఘటన VM రంగా ని భౌతికంగా దూరం చేసింది. కాని, ఆయన వదిలివెళ్లిన ఆశయాలు, ఆయన చూపిన సేవా మార్గం నేటికీ కోట్ల మంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు వెళ్లినా వంగవీటి రంగా విగ్రహాలు, ఆయన పేరిట జరిగే సేవా కార్యక్రమాలు కనిపిస్తూనే ఉంటాయి. పదవులు, పవర్‌తో సంబంధం లేకుండా కేవలం “ప్రేమ, అభిమానం” అనే పునాదుల మీద నిర్మించుకున్న సామ్రాజ్యం వంగవీటి మోహన రంగా ది. అందుకే ఆయన ఎప్పటికీ “ప్రజా హృదయ విజేత”. ఆయన జయంతి సందర్భంగా ఆ మహానేతకు ఈ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల వారు ఆయన జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
