
“చీలిక కోసం ఎదురుచూసే కళ్లకు.. ఈ కలయిక కన్నీరే మిగులుస్తుంది”… అవును నిజమే చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ బేటితో, వైరి వర్గాల్లో అయోమయం నెలకొంది.
రాజకీయాల్లో ఏ అడుగు కూడా యాదృచ్ఛికం కాదు. సందర్భం పలకరింపు అయినా.. చర్చ మాత్రం, రాజకీయాలు, రాష్ట్ర భవిష్యత్ చుట్టూనే తిరుగుతుంది. ఇటీవల జనసేనాని ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్లి కలవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీ కేవలం పవన్ కళ్యాణ్ కు శస్త్ర చికిత్స తర్వాత జరిగిన మర్యాదపూర్వక పలకరింపు లాగే కనపడుతుంది… కాని దీని వెనుక బలమైన రాజకీయ సందేశం కూడా ఉంది అని కొంతమంది రాజకీయ విశ్లేషకుల అంచనా…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన నివాసానికి వెళ్లడం ప్రాథమికంగా ఒక గొప్ప సంప్రదాయం. మిత్రపక్ష నాయకుడి ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని చాటి చెబుతోంది. అయితే, ఈ భేటీ ద్వారా ఇరు పార్టీల శ్రేణులకు ఒక స్పష్టమైన సంకేతం వెళ్లిందా… అంటే అవుననే అంటున్నాయి కొన్ని రాజకీయ నివేదికలు. కూటమిలో నాయకుల ఆలోచన, నాయకత్వం పటిష్టంగా ఉంది.. కూటమి అజేయంగా ఉంది అని సంకేతం ఇచ్చినట్లుగా భావించాలి. అంటున్నారు… ఇరువర్గాల ద్వితీయ శ్రేణి నాయకులు.
గత కొద్ది రోజులుగా పిఠాపురంలో స్థానిక నేతల మధ్య (వర్మ మరియు జనసేన వర్గాల మధ్య) తలెత్తిన ఫ్లెక్సీ వివాదాలు, మాటల యుద్ధం కూటమిలో చిన్నపాటి అలజడి సృష్టించాయి. క్షేత్రస్థాయిలో ఇలాంటి గొడవలు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారే ప్రమాదం ఉంది. సరిగ్గా ఈ సమయంలోనే వీరిద్దరూ భేటీ అవ్వడం గమనార్హం.

స్థానిక నేతలు ఎన్ని గొడవలు పడ్డా, అధినేతలు మాత్రం ఒకే తాటిపై ఉన్నారని ఈ భేటీ నిరూపించింది. శల్య సారధ్యం వహించేవారు కాని, కూటమి ధర్మాన్ని అతిక్రమించే వారు గాని ఎవరైనా, వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ కలయిక ద్వారా పరోక్షంగా హెచ్చరించినట్లయింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు సహజం. కాని చంద్రబాబు-పవన్ ల మధ్య సాన్నిహిత్యం చూశాక, క్షేత్రస్థాయిలో గొడవలకు దిగితే తమ నాయకత్వానికే ముప్పు వస్తుందని, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు గుర్తించే అవకాశం ఉంది. ఈ భేటీ కార్యకర్తల్లో ఉన్న అయోమయాన్ని తొలగించి, వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతలు ఇంతటి సమన్వయంతో ముందుకు సాగడం రాష్ట్ర అభివృద్ధికి శుభసూచకం. ఒకరు విశేష అనుభవం ఉన్న వ్యూహకర్త అయితే, మరొకరు యువత లో మాస్ క్రేజీ ఉన్న నాయకుడు.. వీరిద్దరి కలయికే ఈ కూటమి కి, ప్రభుత్వానికి శ్రీరామరక్ష.
రాజకీయాల్లో విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూసే విపక్షాలకు ఈ భేటీ ఒక గట్టి కౌంటర్. పలకరింపు సాకుతో జరిగిన ఈ రాజకీయ సమన్వయం, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించబోతోంది. నేతల మధ్య ఉన్న ఈ సానుకూల మిత్రత్వమే రాష్ట్ర అభివృద్ధికి సోపానం.
ముగింపు :
“నాయకత్వం అంటే కలిసి నడవడం కాదు.. నలుగురిని కలిపి నడిపించడం.” అనుభవం తో కూడిన ఆలోచనకు, యువతరం యొక్క ఆశయం ఒకటై నిలిస్తే.. విజయం చిరునామా వెతుక్కుంటూ వస్తుంది. అందుకు నిదర్శనమే ఈ ఇద్దరి కలయిక.
