Download App

“నా గుండెల్లో తెలంగాణ ఉంది.. అడ్డుకోవడానికి ఇది మీ అయ్య జాగీరా…..?” పవన్ కళ్యాణ్ నిప్పులు

జూన్ 2, 2026 By Suresh Thota
హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి "పవన్ కళ్యాణ్" నిర్వహించిన అత్యవసర ప్రెస్ మీట్ లో ఆయన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగపూరితమైన శైలి లో సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం గా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా...
 “నా గుండెల్లో తెలంగాణ ఉంది.. అడ్డుకోవడానికి ఇది మీ అయ్య జాగీరా…..?” పవన్ కళ్యాణ్ నిప్పులు

హైదరాబాద్ వేదికగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” నిర్వహించిన అత్యవసర ప్రెస్ మీట్ లో ఆయన ప్రసంగం ఆద్యంతం భావోద్వేగపూరితమైన శైలి లో సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం గా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జనసేన “తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ” నిర్వహించ తలబెట్టింది. గత కొన్నిరోజులుగా కొందరు పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనికి గాను, ఇక్కడ శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నందున, దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇందుకు పవన్ కళ్యాణ్ తన ఇంటివద్దే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….

“రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక సభ పెట్టుకునే హక్కు కూడా లేదా….? అంతర్గతంగా 2,000 మందితో హాల్‌లో సమావేశం నిర్వహించుకుంటే శాంతిభద్రతల సమస్యలు వచ్చేస్తాయా….? అసలు మీ ఉద్దేశం ఏమిటి…? మమ్మల్ని అడ్డుకోవడానికి, బెదిరించడానికి తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా…..?” అంటూ జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.

జూన్ 2న హైదరాబాద్ వేదికగా జరగాల్సిన “తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ” కు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం, హైకోర్టులోనూ అత్యవసర విచారణకు వీలు పడకపోవడంతో జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో ఆయన అత్యవసరంగా మీడియా ముందుకు వచ్చారు. ఆవేశం, ఆవేదన, గంభీరత కలగలిసిన స్వరంతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ​తాము నిర్వహించ తలపెట్టింది లక్షలాది మందితో కూడిన బహిరంగ సభ కాదని, కేవలం 2,000 మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జరిగే ఇండోర్ మీటింగ్ మాత్రమేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను నిర్దేశించుకోవడానికి, పార్టీ కోసం కష్టపడుతున్న సాధకులను గౌరవించుకోవడానికి ఈ వేదికను ఎంచుకున్నామని చెప్పారు. దీనికి ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ సమస్యలు అంటూ వంకలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే, అధికార బలంతో తమ అంతర్గత సమావేశాన్ని కూడా అడ్డుకున్నారని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

"నా గుండెల్లో తెలంగాణ ఉంది.. అడ్డుకోవడానికి ఇది మీ అయ్య జాగీరా…..?" పవన్ కళ్యాణ్ నిప్పులు

​”కొందరు నాయకులు నన్ను తెలంగాణ ద్రోహిగా చిత్రీకరించాలని చూస్తున్నారు. కానీ నేనొక్కటే చెబుతున్నాను… నా గుండెల్లో తెలంగాణ ఉంది!” అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ గడ్డపై తనకు హక్కు ఉందో లేదో ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, తాను ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్‌ను, ఇక్కడి సంస్కృతిని కించపరచలేదని గుర్తుచేశారు. కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విభేదాలను, సెంటిమెంట్లను కావాలనే మళ్లీ రాజేస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి అని ఆయన హెచ్చరించారు.

ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వివాదాన్ని సాకుగా చూపి పోలీసులు ఈ సభను అడ్డుకోవడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. తనతో అమిత్ షా భేటీపై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఏపీలో నమోదైన కేసుల నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతాయనడం కేవలం ఒక సాకు మాత్రమేనన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటికే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని, ఆయనపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోదని తాను ముందే స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఒక మేధావి చేసిన వ్యాఖ్యల వివాదం ముగిసిపోయినా, దాన్నే పట్టుకుని రాజకీయాలు చేయడం అధికార పక్షాల సంకుచిత తత్వాన్ని చూపిస్తోందని మండిపడ్డారు. ​తమపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శల వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని “పవన్ కళ్యాణ్” ఆరోపించారు.

తెలంగాణ అనేది భారత దేశంలో అంతర్భాగం…. ఇంకెంత కాలం ఈ ప్రాంతీయవాదం. విడిపోయిన తరువాత కూడా ఏమిటి ఈ రాద్ధాంతం. దేశ సమైక్యత, సమగ్రత కోసం పాటుపడాలి. ఈ సంకుచిత మనస్తత్వం తో కూడిన ప్రాంతీయవాదపు ఆలోచనలు పక్కన పెట్టాలి అని హితబోధ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు తాను హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపట్టడం ప్రజాస్వామ్యానికే విరుద్ధమన్నారు. బిజెపి రాజకీయ వ్యూహాల్లో భాగంగానే తాను ఇక్కడ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాననడం పచ్చి అబద్ధమని కొట్టిపారేశారు. కొందరు మంత్రులు కావాలనే పాత వీడియోలను, సగం కట్ చేసిన క్లిప్పింగులను సోషల్ మీడియాలో వదులుతూ, జనసేనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పార్టీ తన వంతు పాత్రను పోషించి తీరుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ గడ్డపై కార్యకర్తలను అన్యాయం చేయబోమని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ అణచివేత ధోరణే తమను మరింత బలోపేతం చేస్తుందని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడానికి త్వరలోనే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందుకు వెళ్తామని ప్రకటించారు. అధికార పక్షాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే… ప్రజల గొంతును, సిద్ధాంతాన్ని ఏ శక్తీ నొక్కలేదని హెచ్చరించారు.

ఈ ప్రెస్ మీట్ వేదికగానే జనసేన పార్టీ సరికొత్త వేదిక అయిన సేనా గళం (Sena Galam) ఏర్పాటును పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి, పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడానికి ఈ వేదిక ఉపయోగ పడుతుందని చెప్పారు. సభను అడ్డుకున్నంత మాత్రాన జనసైనికుల ఉత్సాహాన్ని, వారి ఆశయాలను అణచివేయలేరని, ఈ “సేనా గళం” ద్వారా తెలంగాణ నలుమూలలా తమ సత్తా చాటుతామని పునరుద్ఘాటించారు. యువత, ముఖ్యంగా Gen-Z ఆశయాలు మరియు సమస్యలను ముందుకు తీసుకురావడంపై దృష్టి పెడుతుంది. కులం, మతం, ప్రాంతాల పేరుతో రాజకీయ విభజనలను ప్రోత్సహించే ధోరణులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పారు.

అనుమతి నిరాకరణతో సభ రద్దయినప్పటికీ, జూబ్లీహిల్స్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి జనసైనికులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం ఉత్కంఠభరితంగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ముగించుకుని బయటకు వచ్చే సమయానికి వేలాది మంది కార్యకర్తలు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలు గమనిస్తే, తెలంగాణలో జనసేన సభకు అనుమతి నిరాకరణ అనే అంశం… రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ జనసేన-బిజెపి మధ్య పెద్ద రాజకీయ యుద్ధానికి దారితీసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading