తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తన నిర్ణయాన్ని ప్రకటించిన కవిత – ఇది “ఆత్మాభిమానాన్ని కాపాడుకునే నిర్ణయం” అని స్పష్టం చేశారు.
కవిత మాట్లాడుతూ, “తనపై అవాస్తవాలు, తప్పుడు ప్రచారం జరుగుతోందని, దుష్టచతుష్టయం కలసి తన మాటల్ని వక్రీకరించి వాడుకుంటోందని” ఆరోపించారు. రెండు వర్గాలు కలసి జరగనిది జరిగినట్లు ప్రచారం చేశాయని, కేసీఆర్ వద్దకు వెళ్లాలనుకున్నప్పుడు కూడా గన్‌మెన్లు అడ్డుకున్నట్లు రాయించారని విమర్శించారు.
సంతోష్ రావు చర్యలతో కేటీఆర్ ప్రతిష్ట దెబ్బతింటోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక, “హరీష్ రావు – సంతోష్ ముఠాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో కుమ్మక్కయ్యాయి. నేను నిజాలు చెప్పినందుకే బయటకు పంపించేశారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్వకుంట్ల కవిత రాజకీయంగా బీఆర్ఎస్‌లో కీలకమైన వ్యక్తి. తెలంగాణ జాగృతి ద్వారా ఆమె యువత, మహిళా వర్గాల్లో ప్రత్యేకమైన మద్దతు సాధించారు.
కవిత భవిష్యత్‌లో ఏ పార్టీ వైపు అడుగులు వేస్తుందన్న చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆమె విమర్శల్లో బీజేపీ, కాంగ్రెస్ పేర్లు వినిపించినందువల్ల, స్వతంత్ర రాజకీయ ప్రయాణం మొదలు పెట్టే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, కవిత రాజీనామా బీఆర్ఎస్ రాజకీయ సమీకరణాలను గణనీయంగా ప్రభావితం చేయడం ఖాయం.