తెలంగాణ

కళాశాలలను బ్లాక్‌మెయిల్ చేయడం ఆపండి: కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్

Published by
Rahul N

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, కళాశాలలపై బ్లాక్‌మెయిల్ పాలన నడుపుతోందని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం అడిగితే విజిలెన్స్‌ దాడులు చేస్తోన్న ప్రభుత్వం, విద్యార్థుల కోసం మాట్లాడితే కాలేజీలను బెదిరించే పాలన చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.

“మీరు పదివేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని ఇచ్చిన మాట నెరవేర్చాలి. దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలలాగా సీజనల్ మాటలు కాకూడదు” అని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రస్తుతం నిధులు లేవని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు బీహార్ ఎన్నికలకు నిధులు పంపడం దారుణమని అన్నారు. “తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుతో జూదం ఆడొద్దు. కళాశాలలను బ్లాక్‌మెయిల్ చేయడం ఆపండి. తక్షణమే పూర్తి బకాయిలు విడుదల చేయండి, టోకెన్ చెల్లింపులతో మభ్యపెట్టొద్దు” అని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై తీసుకుంటున్న నిర్ణయాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వంటి అంశాలపై విద్యార్థులు, కళాశాలలు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

“ప్రజల భవిష్యత్తు పణంగా పెట్టిన ఈ కాంగ్రెస్ పాలనకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది,” అని బండి సంజయ్ హెచ్చరించారు.

బండి సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

Rahul N