ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ
Published జూలై 2, 2026 by Srinivas
గ్యారీ బీహెచ్ 20కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా చేసిన అనుభవం. ఘాజీ, గూఢాచారి, ఎవరు, హిట్ ది ఫస్ట్ కేస్ తదితర వంటి చిత్రాలకు పని చేశారు. అటువంటి గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమే ‘ఇసకపట్నం’. ఐశ్వర్య రాజేష్, సముద్రఖని వంటి హేమాహేమాలు ఈ వెబ్‌సిరీస్‌లో నటించారు. అలాగే ట్రైలర్ వంటి అప్‌డేట్స్ సైతం వెబ్‌సిరీస్‌పై అంచనాలను పెంచేశాయి. మొత్తంగా 7 ఎపిసోడ్‌ల ఈ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
ఇసకపట్నం అనేది ఒక పిరియాడిక్ డ్రామా. పోర్ట్ ఏరియాలో 1980, 1990 టైం పీరియడ్‌లో జరిగే కథ. ఇసకపట్నం పోర్ట్ ఏరియాలో నాయుడు (సముద్రఖని) బతుకుదెరువు కోసం సాధారణ కూలీగా భార్య కూతురితో వెళతాడు. నాయుడి వ్యక్తిత్వం విషయానికి వస్తే క్రూరమైనవాడు. ఆ ప్రాంతంలో సిన్నరావు( రాజీవ్ కనకాల) అనే లోకల్ లీడర్ మత్సకారులతో సఖ్యంగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఊహించని పరిస్థితుల్లో సిన్నరావుని నాయుడు హత్య చేస్తాడు. ఆ తరువాత పోర్ట్ ఏరియానంతా తన ఆధీనంలోకి తెచ్చుకుని డాన్‌గా మారతాడు. పోర్ట్ ఏరియాలు వ్యాపారాలు, స్మగ్లింగ్, రౌడీయిజంతో డబ్బు, పవర్ సంపాదించిన నాయుడికి రైట్ హ్యాండ్‌గా బెనర్జీ ఉంటారు. నాయుడి కూతురే భారతి (ఐశ్వర్య రాజేష్). తండ్రి చేసే అక్రమాలు, రౌడీయిజం ఆమెకు అసలు నచ్చదు. పైగా తండ్రిపై కోపానికి మరో కారణం కూడా ఉంటుంది. అలాగని తండ్రి అక్రమాలకు అడ్డు కూడా పడదు. ఓ ఎన్జీవోకు విరాళాలిస్తూ పేదలకు సాయం చేస్తూ ఉంటుంది. నాయుడు వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా పోతన అనే అనుచరుడు ఆయనకు దూరమై.. ఆయనను ఎలాగైనా దెబ్బకొట్టాలని అదే ఏరియాలో ధనవంతుడైన ప్రతాప్ వర్మ(రవి వర్మ)తో చేతులు కలుపుతాడు. ఇంతలో అక్కడ ఊహించని ఘటనలు జరగడం.. చిన్నారులు మరణించడం.. ఊహించని పరిస్థితుల్లో భారతి వివాహం ప్రతాప్ వర్మతో జరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ప్రియుడు ఉన్నా కూడా ఇష్టం లేని వివాహం భారతి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? చిన్నారుల మరణానికి కారణమెవరు? ప్రతాప్ వర్మ ఎందుకు చనిపోయాడు? తండ్రిపై భారతికి ఉన్న కోపమేంటి? వంటి అంశాలు తెలియాలంటే వెబ్‌సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఇసకపట్నం పోర్ట్ ఏరియాలో జరిగే రౌడీయిజం, మాఫియా, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సిరీస్‌ను దర్శకుడు తెరకెక్కించాడు. లోకల్ మత్య్సకారులు వర్సెస్ బర్మా నుంచి వచ్చిన మత్స్యకారుల మధ్య ఆధిపత్య పోరుతో కథ ప్రారంభమై… ఆ తర్వాత సముద్రఖని చుట్టూ తిరుగుతుంది. రెండు మూడు ఎపిసోడ్స్ కథ చాలా స్లోగా సాగుతుంది. అయినా కూడా పాత్రలను మలిచిన తీరు చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే పోర్ట్ ఏరియాలో రెండు గ్రూపుల మధ్య జరిగే ఆధిపత్య పోరుగా ప్రారంభమైన కథను ఆ తరువాత నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. దాదాపుగా పాత్రలన్నింటికీ మంచి ప్రాధాన్యమే ఇచ్చాడు దర్శకుడు. అయితే సముద్రఖని ఒక సాధారణ కూలీగా వచ్చి ఒక్కసారిగా డాన్‌గా ఎదగడమనేది సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఇక ఐశ్వర్య రాజేశ్ పాత్రలో ఫైర్ లేకపోవడం కాస్త నిరాశను కలిగిస్తుంది. చివరిలో భారతి ఎంతటి క్రిమినల్ మైండ్ గేమ్ ఆడిందనేది తెలుస్తుంది. వాస్తవానికి ఆమె పాత్రలో అసలు కోణాన్ని కాస్త ముందుగా బయట పెట్టి ఉండే బాగుండేది కానీ చివరి వరకూ చెప్పకపోవడం వలన ఆమె పెర్ఫార్మెన్స్‌ను మిస్ అయ్యామన్న ఫీల్ కలుగుతుంది. ఐశ్వర్య వేసే ఎత్తుగడలు చాలా బాగుంటాయి. పోలీస్ ఆఫీసర్ అధికారి పాత్రలో సునీల్ అయితే కనిపించారు కానీ ఆయన పాత్రకు దర్శకుడు పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. ఇక ఆటోడ్రైవర్‌గా నరేష్ అగస్త్య కనిపిస్తాడు. అతను కథలో లీనమైన తీరు మెప్పిస్తుంది. భారతి ప్రియుడిగా సుధాకర్ కొమాకుల కూడా మంచి ప్రాధాన్యమే దక్కింది. కథ చూస్తున్నంత సేపు ఎవరు ఎవరి వైపున్నారనే విషయంలో సందిగ్ధత ఏర్పడుతుంది. క్లైమాక్స్ ట్విస్ట్‌లు, చివరిలో ఐశ్వర్యకు ఇచ్చిన ఎలివేషన్ బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే..
సముద్రఖని గురించి చెప్పేదేముంది? తన పాత్రలో జీవించేస్తారు. ఇక్కడా అదే జరిగింది. సాధారణ కూలి నుంచి డాన్‌కు వేరియన్ అద్భుతంగా చూపించారు. విలన్‌గా క్రూరత్వం, ఆధిపత్యం నిలుపుకునేందుకు వేసే ఎత్తుగడలు సైతం ఆసక్తికరమే. ఇక ఐశ్వర్య రాజేష్ విషయానికి వస్తే సాధారణ ఎన్జీవో కార్యకర్తగానూ.. ఆ తరువాత పాత్రలోని ట్విస్ట్‌లకు తగినట్టుగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ అద్భుతంగా నటించింది. తరువాత చెప్పుకోవాల్సింది.. నరేష్ అగస్త్య గురించి. ఆయన నటనకు కూడా చాలా బాగుంది. ఎమోషన్స్‌ని అద్భుతంగా పలికించారు. సుధాకర్ కొమాకుల, సునీల్, రాజీవ్ కనకాల, రవివర్మ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు గ్యారీ బీహెచ్ కథను స్లోగా ప్రారంభించినప్పటికీ పాత్రలను చక్కగా మలిచారు. ముఖ్యంగా పోర్ట్ ఏరియాలో జరిగే మాఫియా కథలో తండ్రి కూతుళ్ళ ఆధిపత్యం అంశాన్ని జోడించిన తీరు బాగుంది. అయితే ఐశ్వర్య రాజేష్ పాత్రకు స్కోప్ ఉన్నా కూడా పవర్‌ఫుల్‌గా చూపించలేకపోవడం ఒక మైనస్. మొదటి రెండు ఎపిసోడ్స్‌లో ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ వహించి ఉండాల్సింది. కథను ఆది నుంచే పరుగులు పెట్టించి ఉంటే వెబ్ సిరీస్ మరో రకంగా ఉండేది. సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సిరీస్‌కు తగినట్టుగా ఉన్నాయి. .
Rating: 



(2.75/5)
