వీరభద్రుని రహస్యం వెబ్ సిరీస్ రివ్యూ
Published జూలై 5, 2026 by Srinivas
ఒకప్పుడు అంటే 1990ల్లో ప్రేక్షకులను ‘మర్మదేశం’ అనే సీరియల్ ఉర్రూతలూగించింది. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో అప్పటి వరకూ టెలివిజన్ చరిత్రలో అలాంటి సీరియల్ రాకపోవడంతో ప్రేక్షకులు సైతం ఆ సీరియల్ సమయానికి టీవీలకు అతుక్కుపోయేవారు. ప్రతి వారం ఉత్కంఠరేపుతూ చివరి వరకూ సస్పెన్స్ ఏమాత్రం రివీల్ కాకుండా కొనసాగింది. ఇంతకాలానికి ‘మర్మదేశం’ సీక్వెల్ వచ్చింది. ‘వీరభద్రుని రహస్యం’గా ఈ వెబ్‌సిరీస్ వచ్చింది. మరి ఇది ప్రేక్షకులను అలరిస్తుందా? చూద్దాం.

కథేంటంటే..
1972లో కథ మొదలవుతుంది. గుర్రం బొమ్మను చూపిస్తూ దర్శకుడు నాగ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించారు. వీరభద్రపురం అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామానికి వీరభద్రుడు దైవం. పిల్లలు కార్తికేయ, శీను ఆడుకుంటుండగా ఒకరు తప్పిపోతారు. కార్తికేయ భయంతో వీరభద్రుని ఆలయం దిశగా వెళతాడు. కట్ చేస్తే.. యోగానందం (రఘు కుంచె) కూతురు కల్పన, తన స్నేహితురాలు తమ గ్రామాన్ని చూడాలనడంతో వెన్నెల (అన్నీ)తో కలిసి వీరభద్రపురానికి వస్తుంది. వాళ్లను రిసీవ్ చేసుకునేందుకు కల్పన అన్న కార్తికేయ బస్సు దగ్గరకు వెళతాడు. ముగ్గురూ కలిసి వీరభద్రుని ఆలయానికి వెళతారు. దైవభక్తి లేని వెన్నెల దూరంగా ఉంటూ అంతా షూట్ చేస్తూ ఉంటుంది. అలా ఫోటోలు తీస్తుండగా తనకు పెద్ద గంట కనిపిస్తుంది. గంటను టచ్ చేయడానికి యత్నించగా ఆలయ పూజారి వద్దని చెబుతాడు. అది ధర్మగంట అని.. దుష్ట సంహారం తరువాత వీరభద్రుడే మోగిస్తాడని చెబుతాడు. చీకటి పడగానే ప్రతి ఇంటికీ తాళం వేసుకుని ఎవరి ఇళ్లలో వారే ఉండిపోతారు. ఆ తరువాత ధర్మ గంట మోగుతుంది. ఎవరు చనిపోయారా అని అంతా ఆలయం వైపు పరిగెడతారు. సెకండ్ ఎపిసోడ్‌లో ఒంటరి వాడైన కార్తికేయను వీరభద్రుడు ఎత్తుకుని వస్తుంటాడు. ఒకచోట దింపి ఇంటికి వెళ్లమంటే తనకు భయమని ఆ చిన్నారి చెబుతాడు. అప్పుడు వీరభద్రుడు తన కత్తి ఇచ్చి ఇంటికి వస్తాడు. కార్తికేయను అతని తండ్రి యోగానందం రాత్రి వేళ బయటకు వెళతావా? అని కొడతాడు. తన చేతిలో ఉన్న కత్తిని వీరభద్రుడు ఇచ్చాడని చెప్పడంతో ఆ కత్తిని పూజ గదిలో పెట్టి పూజ చేస్తారు. ఇక యోగానందం దగ్గర పని చేసే వీరబాబు కొడుకు రాంబాబునే వీరభద్రుడు హతమార్చాడని తెలుస్తుంది. ఆ గ్రామంలో వీరభద్రుడు హతమార్చిన వ్యక్తి శవాన్ని దహనం చేయరు. ఆ శవాన్నిగద్దల గుట్టపై పడేస్తారు. అలా పడేయాల్సింది తన తండ్రేనని కల్పన.. అన్నీకి చెబుతుంది. తొలి రెండు ఎపిసోడ్‌లలోనే కథ 1970, 90లలో చూపిస్తున్నారని మనకు అర్థమవుతుంది. అసలు వీరభద్రుడు ఎందుకు ఇలా హతమార్చుతున్నాడు? రాంబాబుని చంపేసింది వీరభద్రుడేనా? ఎందుకు శవాన్ని దహనం చేయరు? ఇవన్నీ చూసిన వెన్నెల ఏం చేస్తుంది? వంటి అంశాలను తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
కథ చాలా సైలెంట్‌గా సాగిపోతూ ఉంటుంది. వింటేజ్ సిరీస్‌లను చూడాలనుకునేవారికి ఇదొక బెస్ట్ ఛాయిస్ అని చెప్పాలి. ఐదు వెబ్‌సిరీస్‌లు ముందుగా విడుదలయ్యాయి. ప్రతి వారం ఐదు ఎపిసోడ్‌ల చొప్పున రిలీజ్ కానున్నాయి. పురాతన రహస్యాలు, పురాణ గాథల నేపథ్యంలో సాగే ఈ కథ నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా దర్శకుడు తీర్చిదిద్దడం జరిగింది. కథ 1970, 90లలో నడుస్తున్నా మనకు ఎలాంటి ఇబ్బంది అనిపించదు. వీరభద్రుని రహస్యమేంటో తెలుసుకునేందుకు యత్నిస్తున్న వెన్నెల ఎవరనేది కూడా సస్పెన్స్‌గానే ఉంచాడు దర్శకుడు. తండ్రి కోసం వెదుకుతూ ఉంటుంది. ఆ తండ్రి రామస్వామి ఎవరు? ఎందుకు వారిని విడిచి వెళ్లిపోయాడనేది సస్పెన్స్. కంప్లీట్‌గా వీరభధ్రపురం గ్రామంలోని వారివన్నీ అభూత కల్పనలే అన్నట్టుగా కూడా చూపించలేదు. భగవంతుడు ఉన్నాడనడానికి ఏదో ఒక నిదర్శనం చూపిస్తూనే.. అన్ని చావులకి కారణం వీరభద్రుడు కాదని మనకు తెలియజేస్తూ కథ సాగుతుంది. మొత్తంగా 60 ఎపిసోడ్‌లతో ఈ కథ సాగనుంది. ప్రస్తుతానికి విడుదలైంది ఐదు ఎపిసోడ్‌లే కాబట్టి ఇంకా పూర్తి స్థాయి కథలోకి వెళ్లలేదు. మరో ఐదు ఎపిసోడ్స్ చూస్తే కానీ అసలిది ఎలా ఉండబోతోందనేది పూర్తి స్థాయిలో అవగాహన రాదు.

ఎవరెలా చేశారంటే..
ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్‌లో ప్రస్తుతానికైతే ప్రధాన పాత్రలు రెండే. ఒకటి రఘు కుంచె అయితే మరొకరు అన్నీ. రఘు కుంచె అయితే తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రస్తుతానికైతే చాలా కూల్‌గానే ఉన్నారు. మున్ముందు ఎలా ఉంటారో చూడాలి. ఇక అన్నీ విషయానికి వస్తే వెన్నెల పాత్రలో ఒదిగిపోయింది. నాస్తికురాలు. స్నేహితురాలి ఊరి చూడాలంటూ వస్తుంది కానీ అసలు కారణం తన తండ్రిని కలవాలని. ప్రస్తుతానికైతే చాలా మోడరన్‌గా.. ఒక మోటివ్‌తో నడుస్తుంది. ఇక అనురాధ. చాలా భయంకరంగా ఉంటుంది. యోగానందం (రఘు కుంచె) తల్లిగా ఆమె నటించారు. చాలా గంభీరంగా.. చూడగానే భయం పుట్టించేలా ఉన్నారు. ఇక మిగిలిన వారంతా తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు నాగ.. 1990ల చివరలో టెలివిజన్ ధారావాహిక ‘మర్మదేశం’కు దర్శకత్వం వహించిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ఈ వెబ్‌సిరీస్‌ను కూడా చక్కగా తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా 1970, 1990 రెండు కథలను ఏకకాలంలో నడిపిస్తూ ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చూశారు. మ్యూజిక్ విషయానికి వస్తే పెద్ద పెద్ద సౌండ్స్ లేనిపోని హంగామా ఏమీ లేదు. కథకు అనుగుణంగానే బీజీఎం ఉంటుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. దారుణమైన హింస వంటివి అయితే ప్రస్తుతానికి లేవు కాబట్టి కుటుంబం మొత్తం కూర్చొని చూడవచ్చు.
ఫైనల్‌గా.. వీరభద్రుని రహస్యం ప్రస్తుతానికైతే ఆసక్తికరంగానే ఉంది.
Rating: 



(3/5)
