Download App

Gurthukostunnayi

OTT Platform: ETV Win

Cast: Viraj Ashwin, Yashasri Rao, Rohini Hattangadi, Siva Narayana Naripeddi, Priyadarshini Ram, Goparaju Ramana, Viva Raghava, Pawan Siddu

Director: Vinod Gali

Genre: Comedy, Drama

Seasons: 1

Episodes: 7

Language: Telugu

Release Date: July 1, 2026

గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ

Published జూలై 2, 2026 by Srinivas

‘గుర్తుకొస్తున్నాయి’ ట్రైలర్‌ విడుదలయ్యాక అంచనాలు అమాంతం పెరిగాయి. ఇదొక ఫీల్-గుడ్, నోస్టాల్జిక్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా అని మేకర్స్ చెప్పడం.. ఆ మాటలను బలపరుస్తున్నట్టుగా ట్రైలర్ ఉండటంతో ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. యూత్‌తో పాటు పెద్దవారికి కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయనిపించడం కూడా ఈ వెబ్‌సిరీస్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడానికి ఒక కారణం. మరి ఈ వెబ్‌సిరీస్ అంచనాలకు తగినట్టుగానే ఉందా? తెలుసుకుందాం.

Gurthukostunnayi Review

కథేంటంటే..

సంతోష్ (విరాజ్ అశ్విన్).. స్కూల్‌లో తన క్లాస్‌మేట్ వైశాలి (యశశ్రీ రావు) ఇద్దరూ ప్రేమించుకుంటారు. వైశాలి తండ్రి, తన స్కూల్ హెడ్ మాస్టర్ రఘునాథ్ (ప్రియదర్శిని రామ్). సంతోష్ గురించి తెలిసిన రఘునాథ్ వీరిద్దరి పెళ్లికి అంగీకరించడు. దీంతో ఆయనను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతారు. మొత్తానికి పెళ్లి సెట్ అయిన విషయాన్ని స్నేహితులు గణేష్ (వైవా రాఘవ), శ్రీకాంత్ (సిద్ధూ పవన్), ఆనంద్ (గోదావరి గోపి)కి సంతోష్ చెప్పడంతో వాళ్లు గోవాలో బ్యాచిలర్స్ పార్టీ అడుగుతారు. జాతకం ప్రకారం మూడు రోజుల పాటు హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళకూడదని తన తండ్రి చెప్పారని సంతోష్‌కు వైశాలి చెప్పినా సంతోష్ వినడు. కారులో ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళుతుండగా దారిలో యాక్సిడెంట్ అవుతుంది. స్టీరింగ్‌కు తల గట్టిగా తగలడంతో సంతోష్ గతం మర్చిపోతాడు. ఆ విషయం దాచి సంతోష్‌కు పెళ్లి చేయాలని తండ్రి (శివన్నారాయణ), స్నేహితులు డిసైడ్ అవుతారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? రఘునాథ్‌కు అసలు విషయం తెలిసిందా? సంతోష్ గతం మరిచిపోయిన తర్వాత ఏం చేశాడు? వంటి విషయాలన్నీ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..

‘గుర్తుకొస్తున్నాయి’ అనేది ఈ వెబ్‌సిరీస్‌కు పర్ఫెక్ట్ టైటిల్. సినిమా పరంగా హీరో గతం మరచిపోతాడు కాబట్టి ఆ టైటిల్ పెట్టి ఉండొచ్చు కానీ.. సిరీస్ చూస్తున్నప్పుడు 2003 నుంచి 2007 మధ్య కాలంలో స్కూల్ కంప్లీట్ చేసుకున్న వారందరి మదిలో ఆ తలపులన్నీ తిరిగి మైండ్‌లో రివైండ్ అవుతాయి. ఒక్క టైటిల్ మాత్రమే కాకుండా సన్నివేశాలు కూడా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సింపుల్ కథ. కానీ దాన్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం అద్భుతం. 30 -40 ఏళ్ల మధ్య వయసు ఉన్న ప్రతి ఒక్కరికీ చిన్నప్పుడు స్కూల్‌లో చేసిన అల్లరితో పాటు అప్పటి లవ్ వంటి ఎన్నో జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి. ఇక దానికి తోడు కామెడీ కూడా బాగా వర్కవుట్ అయ్యింది. హీరో గతం మర్చిపోయిన తర్వాత ఆ విషయాన్ని దాచడానికి తండ్రితో పాటు స్నేహితులు పడే పాట్లు.. హీరోకి ఎవరు తండ్రి, ఎవరేంటనే విషయాలు సైతం గుర్తు లేకపోవడం వంటి సన్నివేశాలతో కామెడీని బాగా జెనరేట్ చేశాడు దర్శకుడు. ఇక ఎపిసోడ్ చివరిలో ఎమోషన్ కూడా కట్టి పడేస్తుంది. ఈ సిరీస్‌కు సంగీతం కూడా ప్లస్ అయ్యింది.

ఎవరెలా నటించారంటే..

బేబీ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న విరాజ్ అశ్విన్‌కు ఈ సిరీస్ కూడా కెరీర్‌కు బాగా ప్లస్ అవనుంది. అసలు ఈ సిరీస్ చూస్తున్నంత సేపు విరాజ్ స్థానంలో మరొకరిని ఊహిచలేం. అంతలా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. గతం మరిచిపోయిన తర్వాత విరాజ్ నటించిన సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. యశశ్రీ రావు పర్వాలేదనిపించింది. ఇక స్నేహితులుగా నటించిన వారిలో వైవా రాఘవ బాగా ఆకట్టుకున్నారు. మిగిలిన ఇద్దరు గోదావరి గోపి, సిద్దూ పవన్ కూడ తమ పాత్రల్లో బాగానే ఇమిడిపోయారు. ప్రియదర్శిని రామ్ తన పాత్రలో జీవించేశారు. ఇక శుభలేఖ సుధాకర్, రోహాణి హట్టంగడి, శివన్నారాయణ, గోపరాజు రమణ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు వినోద్ గాలి సిరీస్‌ను అన్ని రకాల భావాలతో తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. కామెడీ, ఎమోషన్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. థర్టీస్‌లో ఉన్న వారికి తమ స్కూల్ డేస్‌ను గుర్తు చేశారు. అజయ్ అరసాడా సంగీతం సిరీస్‌ను మరో మెట్టు ఎక్కించింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు.

గుర్తుకొస్తున్నాయి…  2003 – 2007 పుట్టిన వారందరికీ వారి స్కూల్ డేస్‌ను గుర్తు చేసే సిరీస్

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.