గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ
Published అక్టోబర్ 17, 2026 by Srinivas
‘గరివిడి లక్ష్మి’.. ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. బుర్రకథ నేపథ్యంలో సినిమాలు ఒకప్పుడు ఏమైనా వచ్చాయేమో కానీ ఇటీవలి కాలంలో అయితే వచ్చిందే లేదు. ఈ నేపథ్యంలోనే ‘నల్ల జిలకర మొగ్గ’తో ఒక్కసారి ప్రేక్షక లోకాన్ని ఈ చిత్రం ఆకర్షించింది. ఆ తరువాత వచ్చిన అప్‌డేట్స్ అన్నీ సినిమా రేంజ్‌ను పెంచాయే కానీ ఏమాత్రం తగ్గించలేదు. మరి సినిమా ఆ స్థాయిలోనే ఉందా? తెలుసుకుందాం.

కథేంటంటే…
ఇది గరివిడి లక్ష్మి అనే ఒక కళాకారిణి బయోపిక్. 1970లో కథ ప్రారంభమవుతుంది. ఊరి పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న లక్ష్మి (ఆనంది) కథ ఇది. లక్ష్మికి చిన్నప్పటి నుంచే పాటలంటే విపరీతమైన ఆసక్తి. లక్ష్మి తల్లి దేవుడమ్మ (రాశి) భగవంతుని సేవకు తన జీవితాన్ని అర్పిస్తుంది. దీంతో భర్తకు వేరే వివాహం చేసి పంపించేస్తుంది. లక్ష్మికి తండ్రి అంటే ప్రాణం. తండ్రి వెళ్లిపోయాక ఒంటరిగా ఉంటూ చాలా వేదన చెందుతూ ఉంటుంది. వివాహం చేసి ఒక తోడును అందిస్తే ఇబ్బంది ఉండదని భావించిన దేవుడమ్మ తన కూతురికి వేరొక వ్యక్తితో వివాహం చేస్తుంది. అతనికి అప్పటికే వివాహమై ఉంటుంది. విషయం తెలుసుకున్న లక్ష్మి.. తల్లికి చెబుతుంది. దీంతో అల్లుడిని ఇటి నుంచి పంపించేస్తుంది. మళ్లీ లక్ష్మి ఆవేదనకు గురవుతుంది. లక్ష్మికి బుర్రకథ గురించి తెలుస్తుంది. దీంతో సుబ్బారావు (షకలక శంకర్) తన గురువు దగ్గరకు లక్ష్మిని తీసుకెళతాడు. అక్కడ లక్ష్మి అద్భుతమైన గ్రాస్పింగ్ పవర్, వాయిస్ చూసి గురువు (ఎల్‌బీ శ్రీరామ్) మెస్మరైజ్ అవుతాడు. ఆమెకు బుర్రకథ నేర్పిస్తడు. అయితే సుబ్బారావు తనను పెళ్లి చేసుకోమని కోరడంతో దానిని వదిలేస్తుంది. ఆ ప్రాంతానికి శ్రీకాకుళం సత్తిబాబు బుర్రకథ వేయడానికి వస్తాడు. అతనితో పాటు బుర్రకథ వేయాల్సిన మహిళ రాకపోవడంతో ఆల్టర్‌నేట్ చూస్తుండటంతో రాంబాబు (నరేష్) లక్ష్మి గురించి చెబుతాడు. లక్ష్మిని ఒప్పించి బుర్రకథకు తీసుకువస్తాడు. అది గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఆ తరువాత లక్ష్మి కథ ఎలాంటి మలుపు తీసుకుంది? లక్ష్మి ఏ స్థాయికి వెళ్లింది? ఆమె జీవితం సాఫీగానే సాగిందా? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే…
ఇది గరివిడి లక్ష్మి బయోపిక్. సినిమాను ఫస్ట్ హాఫ్ చాలా హైట్‌కి తీసుకెళ్లిన దర్శకుడు సెకండాఫ్‌లో మాత్రం తడబడినట్టుగా అనిపించింది. మెయిన్‌గా విపరీతమైన సాగదీత కారణంగా సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ఒక కళాకారిణి జీవితం ఒకానొక దశలో చాలా బాగా దూసుకెళుతుంది. ఆ తరువాత అక్కడి నుంచి పడిపోవడం ప్రారంభమవుతుంది. గరివిడి లక్ష్మి జీవితంలో పరిణామాలన్నింటినీ ఏర్చి కూర్చి సినిమాను తీశారు. గరివిడి లక్ష్మి తన ఉనికినే కోల్పోతుంది. ఆమె జీవితంలో ఎంతో విషాదముంది. దానిని దర్శకుడు కళ్లకు కట్టాడు. ఎమోషనల్ సన్నివేశాలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. సినిమాకు ప్రాణం పాటలే. అవి చాలా బాగుండటంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే యూత్‌ను ఈ సినిమా ఎంత మేర ఆకట్టుకుంటుందనేది ప్రశ్నార్థకం. సెకండాఫ్ సాగదీత లేకుంటే బాగుండేది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం గ్రేట్ అటెమ్ట్ అని చెప్పాలి.
ఎవరెలా నటించారంటే…
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది జీవించింది. ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంది. డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇక రాగ్‌మయూర్ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. మరో కీలక పాత్రలో నరేష్ నటించారు. ఆయన అద్భుతంగా నటించారు. రాశి కూడా చాలా బాగా నటించింది. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..
టెక్నికల్ పరంగా చెప్పాలంటే ముందుగా మ్యూజిక్ గురించి చెప్పాలి. సినిమాకు ప్రాణం మ్యూజికే. పాటలు చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా.. గరివిడి లక్ష్మి ఆకట్టుకుంటుంది.
Rating: 



(2.75/5)
