నా వైఫ్ మిస్సింగ్ మూవీ రివ్యూ
Published అక్టోబర్ 25, 2026 by Srinivas
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆ తరువాత వరుణ్ సందేశ్, శ్వేత బసు వేర్వేరుగా కొన్ని చిత్రాలు చేశారు కానీ ఆ తరువాత వెండితెరకు దూరమయ్యారు. ఇటీవలి కాలంలో వరుణ్ సందేశ్ తిరిగి స్క్రీన్‌పై కనిపిస్తున్నాడు. కానీ శ్వేత బాగా లావుగా అయిపోయి పూర్తిగా వెండితెరకు దూరమైంది. ప్రస్తుతం శ్వేత గతంలో కన్నా చాలా స్లిమ్ అయిపోయింది. ఇన్నాళ్లకు ఆహా ఓటీటీ వేదికగా వీరిద్దరూ నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటంటే..
ఓ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేసే బాలు(వరుణ్ సందేశ్).. తన భార్య స్వప్న(శ్వేతా బసు ప్రసాద్) మిస్సింగ్ అంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. అసలేం జరిగిందో పోలీసులకు వివరిస్తాడు. స్వప్నను బాలు పెళ్లిచూపులు చూసేందుకు వెళితే తనకు ఈ వివాహం ఇష్టం లేదని చెబుతుంది. దానికి తను వర్జిన్ కాదని చెబుతుంది. అయినా బాలు ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత స్వప్న అతనికి దూరంగా ఉంటుంది. అబాన్(మోహిత్ పెద్దాడ) అనే వ్యక్తిని ప్రేమించానని.. అతనితో వెళ్ళిపోతానని చెబుతుంది. అందుకు కూడా బాలు ఒప్పుకొని స్వప్న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఒక ప్లాన్ వేస్తారు. స్వప్నను బాలు గుడికి తీసుకెళతాడు. అక్కడి నుంచి స్వప్న మాయమవుతుంది. అబాన్, స్వప్న కలిసి వెళ్లిపోయారనుకుని ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం బాలు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. బాలునే అనుమానించి పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత అబాన్ వచ్చి బెయిల్‌పై బాలును విడిపిస్తాడు. ఆ తరువాత స్వప్న అబాన్‌తో లేదని తెలుస్తుంది. అసలు స్వప్న ఏమైంది? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసినా బాలు ఎందుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు? స్వప్న ఏం చేసినా బాలు ఎందుకు సైలెంట్‌గా భరించాడు? ఇవన్నీ తెలియాలంటే ‘నా వైఫ్ మిస్సింగ్’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కొత్తబంగారు లోకం సినిమా వచ్చి 18 ఏళ్లు అవుతోంది. ఇద్దరిలో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమైనా ఉందంటే.. శ్వేత చాలా స్లిమ్ అవడమే. ఇక సినిమా విషయానికి వస్తే.. శ్వేతా బసు మిస్ అవడం.. ఆమె ఏమైంది? ఎలా కనిపెట్టారనేదే అసలు కథ. ఇదొక రొటీన్ స్టోరీ. కొత్తదనం ఏమీ లేదు. అయితే దీనిని ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. ప్రస్తుతం, గతంల మధ్య కథ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా స్వప్న మిస్ అవడం.. బాలు, స్వప్నల పెళ్లి వంటి అంశాలతో రూపొందింది. అసలు స్వప్న అబాన్ దగ్గర లేదనే నిజం బాలుకి తెలియడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. సెకండాఫ్ అంతా స్వప్నను వెదకడం చుట్టూ.. అసలు ఆమె ఏమైందనే అంశం చుట్టూ తిరుగుతుంది. సినిమా అంతా చాలా సాగదీతగా ఉండటం చాలా పెద్ద మైనస్. ప్రస్తుత తరుణంలో మహిళలు పెళ్లైనా కూడా తమ పాత ప్రేమల చుట్టూనే తిరగడం.. దాని వల్ల తలెత్తే పరిణామాలతో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. అయితే క్లైమాక్స్ మాత్రం చాలా ట్విస్టింగ్‌గా ఉంటుంది. ఒక్కసారిగా కథ మరో మలుపు తీసుకుంటుంది. అయితే మనకు క్లైమాక్స్ కొంత చూసిన తర్వాత స్వప్న ఏమైందనేది అర్థమవుతుంది. స్క్రీన్‌ప్లే అంత గ్రిప్పింగ్‌గా ఏమీ లేదు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
వరుణ్ సందేశ్ చాలా బాగా నటించాడు. స్వప్నను ఇష్టపడే సన్నివేశాలు.. ఆ తరువాత ఆమె మిస్ అయ్యిందని తెలుసుకున్నాక అతనిలో మార్పును స్పష్టంగా చూపించాడు. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాల్లో కూడా మెప్పించాడు. ఇక శ్వేత విషయానికి వస్తే.. ఆమె కూడా చాలా బాగా నటించింది. బాలు పట్ల చూపించే విముఖత, అబాన్‌పై ప్రేమ వంటి సన్నివేశాల్లో చాలా బాగా నటించింది. పోలీస్ పాత్రలో నటుడు ప్రవీణ్, జబర్దస్త్ సత్యశ్రీ బాగానే నటించింది. మోహిత్ పెద్దాడ బాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించాడు. మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ పరంగా…
సినిమాకు అతి పెద్ద మైనస్ ఎడిటింగ్. సినిమా చాలా సాగదీతగా ఉంటుంది. అలాగే స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేకపోవడం కూడా ఒక మైనస్. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సాయి కార్తీక్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు ఆకట్టుకోలేకపోయాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా..
సినిమా వన్ టైమ్ వాచ్
Rating: 



(2.25/5)
