Download App
Movie Poster

GDN

Cast: R Madhavan, Sathyaraj, Jayaram, Priyamani, Dushara Vijayan, Vinay Rai, Thambi Ramaiah, Nandalal, TeeJay Arunasalam, Sheela, Karunakaran, Muralidaran, Aditi Balan, Mohan Raman, Kaniha, Ramesh Tilak, Carl Andrew Harte, Richard Bhakti Klein

Director: Krishnakumar Ramakumar

Music Director: Govind Vasantha

Producer: Varghese Moolan, Vijay Moolan, Sarita Madhavan & R Madhavan

Release Date: August 7, 2026

GDN (GD నాయుడు) మూవీ రివ్యూ

Published ఆగస్ట్ 8, 2026 by Srinivas

గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (GDN) గురించి ముఖ్యంగా భారతీయులకు పరిచయం అక్కర్లేదు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’, ‘వెల్త్ క్రియేటర్ ఆఫ్ కోయంబత్తూర్’ గా ఆయన ప్రసిద్ధి చెందారు. ఆయన స్ఫూర్తిదాయకమైన జీవిత కథ ఆధారంగా రూపొందినదే ‘జి.డి.నాయుడు’. ఇక నటుడు ఆర్ మాధవన్ గురించి చెప్పేదేముంది? ఇప్పటికే నంబి నారాయణన్ బయోపిక్ అయిన ‘రాకెట్రి’లో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నారు. తిరిగి మాధవన్.. జీడీఎన్ పాత్రలో నటించారు. బయోపిక్ అనగానే సర్వసాధారణంగానే అంచనాలు భారీగా ఉంటాయి. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

GDN Movie Review

కథేంటంటే..

వాస్తవానికి పురుషులకు యంత్రాలతో ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. 2024లో ‘మేయళగన్‌’ పేరిట తమిళంలో ఓ చిత్రం వచ్చింది. దానిలో హీరోకి తన సైకిల్‌తో ఉన్న అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించారు. అలాంటి భావోద్వేగాన్నే ‘జి.డి.ఎన్’ చిత్రంలోనూ చూపించారు. ముందుగా ఆయనకు పాఠ్యపుస్తకాల్లో స్థానం ఇవ్వాలా వద్దా అనే అంశంపై ఉపాధ్యాయుల కమిటీ చర్చతో సినిమా ప్రారంభమవుతుంది. తన చిన్న వయసులో జీడీ నాయుడు (మాధవన్) రెండేళ్ల పాటు ఓ ఆంగ్లేయుడిని ఫాలో అవుతాడు. అతనిపై ప్రేమతో కాదు.. అతను నడిపై బైక్‌పై ప్రేమ. ఆ బైక్‌ను తనకు అమ్మమని అడుగుతాడు. రూ.250కు దానిని కొనుగోలు చేసి, పూర్తిగా విడదీసి ప్రతి భాగం ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటాడు. ఇదే అతని ఇన్వెన్షన్ ప్రయాణానికి నాంది. యంత్రాలతో అనుబంధానికి పునాది. చదువు నేర్పని ఎన్నో విషయాలను తన ఆసక్తి తనకు నేర్పుతుందని నమ్మే వ్యక్తి. ఈ బయోపిక్‌లో ఆయన వ్యక్తిత్వంతో పాటు ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న కష్టాలు, సమాజానికి చేసిన సేవ వంటివి చూపించారు. ముఖ్యంగా భారతదేశంలో తొలి ఎలక్ట్రిక్ మోటార్ తయారు చేయడం, 200 బస్సులతో భారీ రవాణా సంస్థను నిర్మించడం, బెంజ్ కంపెనీతో ఒప్పందం, హిట్లర్‌ను కలవడం, విద్యుత్, ఆటోమొబైల్, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో సేవలందించడం వంటి ఎన్నో జీడీఎన్ సాధించిన విజయాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. మరి అన్ని ఇన్వెన్షన్స్ చేసిన వ్యక్తి కథ ఆ తరువాత ఎలాంటి మలుపు తీసుకుంది? అంతటి ప్రతిభావంతుడైన జీడీఎన్ ఎందుకు గుర్తింపునకు నోచుకోలేదు? ఆయనపై ఎందుకు మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అనే ముద్ర పడింది? వంటి అంశాలను చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే.

GDN Movie Review

సినిమా ఎలా ఉందంటే..

‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను చూసిన వారికి ఈ చిత్రం చూస్తుంటే అదే సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమా మాదిరిగానే అపార్థానికి గురైన ఓ ప్రతిభావంతుడి జీవితాన్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. అయితే రెండు చిత్రాల్లో ఒక లోపం ఉంది. అదే.. ప్రధాన సంఘటనలను వేగంగా ముగించేయడం. జీడీఎన్ జీవితంలోని ఘటనలను ఒకదాని తర్వాత మరొకటి చూపించడంతో ఏదో జీవిత చరిత్రను చదువుతున్న ఫీల్ కలుగుతుంది. ఇలా చేయడం వల్ల భావోద్వేగానికి స్కోప్ లేకుండా పోయింది. ముఖ్యంగా ఓ బయోపిక్ ఎంతలా భావోద్వేగ పరంగా కనెక్ట్ అయితే అంత సక్సెస్ సాధిస్తుంది. ఈ సినిమాలో అది లోపించడం చాలా పెద్ద మైనస్. రాబర్ట్ స్టేన్స్ ఒక బస్సును ఇచ్చిన వెంటనే తదుపరి సన్నివేశంలో నాయుడు 200 బస్సుల సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు చూపిస్తారు. ఆ ఎదుగుదల ఎలా జరిగిందో వివరించరు. అది వివరిస్తే సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం, ఎన్.ఎస్. కృష్ణన్, ఎం.ఆర్. రాధా, పెరియార్ వంటి ప్రముఖులతో జరిగిన సంఘటనలను ఏదో హడావుడిగా చూపించినట్టుగా అనిపించింది. దీంతో సహజత్వం లోపించినట్టుగా మనకు అనిపిస్తుంది. నాయుడు రెండో పెళ్లి చేసుకోవడానికి గల కారణం సైతం చాలా సింపుల్‌గా ఉంది. సినిమా నిడివి కూడా చాలా తక్కువ (147 నిమిషాలు) కావడంతో ముఖ్యమైన ఘట్టాలను ఫాస్ట్‌గా ముగించేశారు. ఇంటర్వెల్‌కు ముందు మాత్రం ఓ అద్భుతమైన సన్నివేశం వస్తుంది. అదేంటంటే.. ఆదాయపు పన్ను అధికారి కృష్ణన్ (జయరామ్), నాయుడు స్నేహితుడు పిళ్లై (సత్యరాజ్) మధ్య జరిగే పోటీ సన్నివేశం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే క్లైమాక్స్‌లో మాధవన్ “భారతదేశంలో కులవ్యవస్థను బ్రిటిష్ తీసుకొచ్చారు” అంటూ ఓ డైలాగ్ చెబుతారు. ఈ వ్యాఖ్య చారిత్రకంగా ఏమాత్రం సమంజసంగా అనిపించదు. మొత్తంగా ఈ సినిమా ఒక గొప్ప ఆవిష్కర్తను నయా జెనరేషన్‌కు పరిచయం చేయడంలో అయితే సక్సెస్ అయ్యింది. కొన్ని సంఘటనలపై ఫోకస్ చేసి ఉంటే సినిమా రేంజే మారిపోయి ఉండేది.

GDN Movie Review

ఎవరెలా నటించారంటే..

జి.డి.ఎన్ పాత్రలో మాధవన్ జీవించారు. ఫిజికల్ చేంజెస్ కూడా ఆకట్టుకుంటాయి. కొన్ని చోట్ల ఆయన హావభావాలు కాస్త అతిగా అనిపిస్తాయి కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఆయన నటనే సినిమాకు ప్రధాన బలం. ఇక సత్యరాజ్ సైతం అద్భుతంగా నటించారు. జయరామ్ కూడా చక్కటి నటనను కనబరిచారు. దుషారా విజయన్ సైతం చాలా యాక్టివ్‌గా కనిపించి మెప్పించింది.వినయ్ రాయ్, కరుణాకరన్, కార్ల్ ఆండ్రూ హార్ట్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

టెక్నికల్ పరంగా ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడి గురించి. ఈ సినిమా హిట్, ఫ్లాప్ అనేది దర్శకుడిపైనే ఆధారపడి ఉంటుంది. భావోద్వేగానికి బలమైన పీట వేయకుండా హడావుడిగా సినిమాను నడిపించేశారు. ఆసక్తికర అంశాల్లో ఏమాత్రం వివరణ ఇవ్వలేదు. ఎడిటింగ్ పేలవంగా ఉంది. మ్యూజిక్ బాగానే ఉంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగానే ఉన్నాయి.

ఫైనల్‌గా.. ‘జి.డి.ఎన్’ గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఓకే.. కానీ ఆయన స్థాయికి తగిన బయోపిక్ అయితే కాదు.

Rating: (2.25/5)

మరిన్ని వార్తలు

No categories found.