Mass Jathara Review: మాస్ జాతర మూవీ రివ్యూ
Published నవంబర్ 1, 2025 by Srinivas
‘మాస్ జాతర’ సమీక్ష – రవితేజ టెంప్లేట్‌కు కొత్త వేషధారణ, కానీ పాత రుచే!
మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మాస్ జాతర’, భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సితార నాగవంశీ మరియు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మించారు. శ్రీలీల మరోసారి రవితేజతో జంట కట్టగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

కథ:
అల్లూరి జిల్లాలోని అడవివరం ప్రాంతం మొత్తం శివుడు (నవీన్ చంద్ర) కంట్రోల్‌లో ఉంటుంది. రైతులతో బలవంతంగా గంజాయి పండింపజేస్తూ, అధికారులను డబ్బుతో కొనేసి రాజ్యమేలుతున్నాడు. ఇలాంటి వాతావరణంలో రైల్వే పోలీస్ లక్ష్మణ్ భేరి (రవితేజ) ట్రాన్స్‌ఫర్ అవుతాడు. నిజాయతీకి ప్రతీకగా ఉన్న అతడు, శివుడి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ పోరులో అతనికి ఎదురైన అవరోధాలు, ప్రేమకథలోని ట్విస్టులు, తాతయ్య (రాజేంద్ర ప్రసాద్)తో ఉన్న బంధం – ఇవన్నీ కథలోని మాస్, ఎమోషన్, యాక్షన్ మిశ్రమం.
విశ్లేషణ:
భాను భోగవరపు తన మొదటి చిత్రంగా రవితేజ టెంప్లేట్‌ను బలంగా ఉపయోగించుకున్నారు. కానీ ఆ ఎనర్జీని మించిన కొత్తదనం మాత్రం లేదు. ప్రతీ కమర్షియల్ సినిమా ఫార్ములా — హీరో ఎంట్రీ, పంచ్ డైలాగ్స్, విలన్ క్రూరత్వం, సాంగ్స్, ఫైనల్ ఫైట్ — అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ కొత్తదనం, ఎమోషనల్ కనెక్ట్ మాత్రం ఎక్కడో మిస్ అయ్యింది.
రవితేజ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలం. ఫైట్స్, డ్యాన్సులు, మాస్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే కథా సరళి రొటీన్‌గా అనిపిస్తుంది. రెండో భాగంలో కథ కాస్త లాగ్ అయిన భావన కలుగుతుంది.

దర్శకుడు యాక్షన్ సన్నివేశాలను మాస్‌గా డిజైన్ చేసినా, వాటి ఎగ్జిక్యూషన్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం లౌడ్‌గా అనిపించినా, ఫైట్స్‌లో మాస్ ఎఫెక్ట్ ఇచ్చింది. పాటలకు హిట్ ట్యాగ్ ఉన్నా, వాటి ప్లేస్‌మెంట్ అసమంజసంగా ఉంది.
నటీనటుల ప్రదర్శన:
రవితేజ మరోసారి తన స్టైల్, ఎనర్జీతో సినిమాను భుజస్కంధాలపై మోశారు. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు, నటనలో మాత్రం బలహీనంగా ఉన్నారు. నవీన్ చంద్ర విలనిజంలో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ పాత్ర చివర్లో ట్విస్ట్ ఇచ్చినా, వినోదం మాత్రం సరిగా పండలేదు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ లాంటి నటులు సగటు స్థాయిలో ఉన్నారు.

టెక్నికల్‌గా: సినిమాటోగ్రఫీ రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను బావుగా చూపించింది. ఎడిటింగ్ కాస్త గజిబిజిగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా కనిపించాయి, నిర్మాతలు ఖర్చు తగ్గించలేదు.
పాజిటివ్‌స్: రవితేజ ఎనర్జీ, యాక్షన్ సీన్స్, నవీన్ చంద్ర విలనిజం
నెగటివ్‌స్: రొటీన్ కథ, నిస్సత్తువైన ఎమోషన్, సరిగా వర్కవుట్ కాని కామెడీ
తీర్పు:
‘మాస్ జాతర’ ఒక పక్కా రవితేజ టెంప్లేట్ సినిమా. యాక్షన్, ఫైట్స్, మాస్ డైలాగులు కోరుకునే అభిమానులకు ఇది సగటు స్థాయి ఎంటర్‌టైనర్. కానీ కొత్తదనం, భావోద్వేగం, కథా పటిమ ఆశించే ప్రేక్షకులకు మాత్రం ఇది సగటు మాస్ మిక్స్.
Rating: 



(2.5/5)
