హరుడు మూవీ రివ్యూ
Published మే 15, 2026 by Srinivas
‘శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమకోసం, శివరామరాజు’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించిన వెంకట్ ఆ తరువాత పెద్దగా కనిపించలేదు. ఇన్నాళ్లకు ‘హరుడు’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వెంకట్ వచ్చారు. రాక్షస సంహారం గావించిన వాడే హరుడని.. ఈ చిత్రానికి అదే టైటిల్‌ను మేకర్స్ పెట్టారు. మరి ఈ చిత్రంలో వెంకట్ రాక్షస సంహారం గావించారా? సినిమా కథేంటి తెలుసుకుందాం.

కథేంటంటే..
ఎమ్మెల్యే వరదరాజులు (శ్రీహరి పైలా) ప్రజలకు తలలో నాలుకలా ఉంటాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనే ముందుండి దాన్ని పరిష్కరిస్తూ ఉంటాడు. మరోవైపు డీసీపీ శంకర్ (వెంకట్) ప్రజల రక్షణే థ్యేయంగా.. నీతి నిజాయితీలు కలిగిన ఆఫీసర్. గతంలో ముంబైలో పనిచేసినప్పుడు అక్కడ ఓ రాజన్ గ్యాంగ్‌ను హతమార్చి వారి అరాచకాలను అరికడతాడు. ఆ సమయంలోనే తన భార్య ప్రియను పోగొట్టుకుంటాడు. ఆ తరువాత హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఇంజినీరింగ్ చదివిన ఐదుగురు యువతీయువకులు కార్ నుంచి ఇంజిన్ తీసి అమ్మేసి రూ.20 లక్షలు పోగేసి ఫుడ్ ట్రక్ పెట్టాలని భావిస్తారు. రూ.18 లక్షలు సమకూర్చుకుంటారు. చివరి దొంగతనంగా ఒక కారు నుంచి ఇంజిన్ కొట్టేసేందుకు వెళతారు. అక్కడ వేరే గ్యాంగ్ రావడం.. ఇద్దరి మధ్య ఫైటింగ్ జరగడం.. వాళ్లందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? డీసీపీ శంకర్ భార్యను హతమార్చిందెవరు? వరద రాజులుకి ముంబైతో ఉన్న సంబంధం ఏమిటి? సౌమ్య (హెబ్బా పటేల్) పాత్రేంటి? వంటి అంశాలను తెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
ఏ సినిమాకు అయినా ఎంతోకొంత సినిమాటిక్ లిబర్టీ అనేది మేకర్స్ తీసుకుంటారు. కానీ ఈ సినిమా మొత్తం తీసేసుకున్నారేమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం.. శంకర్ ముంబైకి వెళ్లి అక్కడి ముఠాలను అంతమొందించడం వంటి అంశాలతో రూపొందించారు. సెకండాఫ్ విషయానికి వస్తే సౌమ్య పాత్ర ఎంటర్ అవడం ఆమె చుట్టూ తిరిగే కథ ఆధారంగా సినిమా ఉంటుంది. కనీసం సినిమాపై దర్శకుడు రాజ్ తాళ్లూరి ఏమాత్రం దృష్టి పెట్టలేదేమో అనిపిస్తూ ఉంటుంది. చాలా అంశాల్లో సామాన్యులకు సైతం నవ్వు తెప్పిస్తాయి. డీసీపీ స్వయంగా మిడ్ నైట్ పెట్రోలింగ్‌కు వెళ్లడం.. మిడ్ నైట్ మంత్రి వస్తున్నాడని.. రోడ్ క్లియర్ చేయించడం.. ఒక సామాన్యుడు నేరుగా డీసీపీకి కాల్ చేసి తను రమ్మన్న చోటికి రమ్మంటే డీసీపీ వెళ్లిపోవడం.. తెలంగాణ ప్రభుత్వం డీసీపీని ముంబైకి ట్రాన్స్‌ఫర్ చేశారనడం వంటి విషయాలు చూసేవారికి చిరాకు తెప్పిస్తాయి. సినిమా ఫస్ట్ హాఫ్ వరకూ చూడటం కూడా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. సెకండాఫ్ అయితే మరీ దారుణం. వెంకట్ నిర్మాణ బాధ్యతలు చేపట్టినప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి? కానీ ఏమాత్రం జాగ్రత్త వహించలేదు. ఎక్కడా సన్నివేశాల మధ్య లింక్ కూడా కనిపించదు.

ఎవరెలా నటించారంటే..
పోలీస్ ఆఫీసర్‌గా వెంకట్ చక్కగానే నటించారు. విలన్ పాత్రలో నటించిన శ్రీహరి తొలి సినిమా అయినా కూడా బాగా నటించారు. హెబ్బా పటేల్ పాత్ర పరిమితమనే చెప్పాలి. అయినా కూడా బాగానే నటించింది. స్పెషల్ సాంగ్‌లో సలోని మెరిసింది. ఈ పాట ఒక్కటే కాస్త ఆకట్టుకునేలా ఉంది. ఇక మిగిలిన పాత్రదారులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు రాజ్ తాళ్లూరి దర్శకత్వం సినిమాకు అతి పెద్ద మైనస్. నిర్మాణ విలువలు బాగానే ఉన్నా అందుకు తగ్గ కథ అయితే లేదు. ఎడిటింగ్ పేలవంగా ఉంది. సంగీతం విషయానికి వస్తే స్పెషల్ సాంగ్ కొంత మేర ఆకట్టుకుంటుంది.
తీర్పు:
‘హరుడు’ రాక్షస సంహారమేమో కానీ ప్రేక్షక సంహారం గట్టిగానే చేశాడు.
Rating: 



(1.75/5)
