Download App
Movie Poster

Sathi Leelavathi

Cast: Lavanya Tripathi Konidela, Dev Mohan, Naresh, VTV Ganesh, Madonna Sebastian, Saptagiri, Motta Rajendran, Jaffer Sadiq, Joshi

Director: Tatineni Satya

Music Director: Mickey J Meyer

Producer: Naga Mohan

Release Date: May 8, 2026

సతీ లీలావతి మూవీ రివ్యూ

Published మే 8, 2026 by Srinivas

దర్శకుడు తాతినేని సత్య ‘భీమిలి కబడ్డీ జట్టు’ తర్వాత అంతగా ఆకట్టుకునే సినిమాలేవీ తెరకెక్కించలేదు. అలాగే లావణ్య త్రిపాఠి వివాహానంతరం చేసిన తొలి చిత్రం.. ‘సతీ లీలావతి’. కాబట్టి ఇద్దరికీ ఈ చిత్రం కీలకమే. పైగా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ ప్రమోషన్స్ చేయడంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరిగాయి. మరి వాటిని ఈ చిత్రం అందుకుందా? సినిమా ఎలా ఉంది? చూద్దాం.

Sathi Leelavathi Movie Review

కథేంటంటే..

చిన్నతనం నుంచే తల్లిదండ్రుల (వీకే నరేష్, పవిత్ర లోకేష్) గొడవలను చూస్తూ పెరుగుతుంది లీలావతి (లావణ్య త్రిపాఠి). దీంతో ఆమె మొహంలో చిరునవ్వు అనేదే మాయమవుతుంది. అలాంటి లీల జీవితంలోకి సేతుపతి (దేవ్ మోహన్) ఎంటర్ అవుతాడు. అతనొక సైక్రియాటిస్ట్ కావడంతో లీలను కౌన్సిలింగ్ చేసి ఆమె ఆత్మవిశ్వాసంతో పాటు నవ్వునూ తీసుకొస్తాడు. దీంతో అతని ప్రేమలో లీల పడటంతో పాటు స్టార్ డైరెక్టర్‌గా ఎదుగుతుంది. అలాగే తన తండ్రికి చెప్పి సేతుకి ఇష్టం లేకుండానే అతడిని వివాహమాడుతుంది. ఆ తరువాత ఆమె చూపించే కన్సర్న్‌తో దేవ్ కూడా కనెక్ట్ అయిపోతాడు. తొలి ఏడాది ఇద్దరూ ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఆ తరువాత లీల పని ఒత్తిడిలో పడిపోయి దేవ్‌ని పట్టించుకోవడం మానేస్తుంది. దీంతో అతను లీల నుంచి విడిపోవాలనుకుంటాడు. ఆ తరువాత కథ ఏ మలుపు తీసుకుంది? దేవ్ జీవితంలోకి వచ్చిన నికోలా సెబాస్టియన్ (మడోనా సెబాస్టియన్) ఎవరు? వంటి అంశాలను వెండితెరపై చూడాల్సిందే.

Sathi Leelavathi Movie Review and Rating

సినిమా ఎలా ఉందంటే..

భార్యాభర్తలు పాలునీళ్లలా కలిసిపోవాలని పెద్దలు చెబుతారు. ఒకరికి కోపం వస్తే మరొకరు తగ్గాలి. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ పోతే గొడవలు తప్ప ఆ కుటుంబంలో మరేం ఉండవు. అలా తల్లిదండ్రుల నిత్య పోరును చూస్తూ పెరిగిన పిల్లల మనస్తత్వాలు ఎలా ఉంటాయి? వారు వారి వివాహానంతరం పార్ట్‌నర్‌తో సంతోషంగా జీవించగలరా? వంటి అంశంతో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు తీసుకున్న పాయింట్ మంచిదే. కానీ దానిని రూపొందించిన విధానమే సగటు ప్రేక్షకుడికి ఏమాత్రం ఎక్కదు. ఫస్ట్ హాఫ్ అంతా.. లీలావతి కుటుంబ నేపథ్యం.. ఆమె పెరిగిన తీరు.. ఆమె లైఫ్‌లోకి దేవ్ మోహన్ రావడం.. వారి పెళ్లి అంశాలతో రూపొందించారు. సెకండాఫ్ అంతా వీరిద్దరి డివోర్స్ అంశం చుట్టూ తిరుగుతుంది. ‘భీమిలి కబడ్డీ జట్టు’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడి నుంచి ఇలాంటి చిత్రాన్ని ఊహించలేం. వీటీ గణేష్, సప్తగిరి, నరేష్ వంటి నటులను తీసుకున్నా కూడా ఏమాత్రం కామెడీని జనరేట్ చేయలేకపోయారు దర్శకుడు. తీసుకున్న పాయింట్‌ను తెరకెక్కించడంలో సత్య పూర్తిగా విఫలమయ్యారు. కనీసం కామెడీ కూడా ఏమాత్రం వర్కవుట్ అవకపోవడం చూస్తున్న ప్రేక్షకుడికి విసుగనిపించక మానదు. ఏదో సినిమాను రెండు గంటల పాటు నడిపించాలన్నట్టుగా నడిపించారు తప్ప చూసేందుకు ఏమాత్రం ఆసక్తి అనిపించదు.

Sathi Leelavathi Movie Review

ఎవరెలా నటించారంటే..

ఒకరకంగా చెప్పాలంటే.. లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. లావణ్య త్రిపాఠి తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో చేసిన చిత్రమైనా డ్యాన్స్, ఫైటింగ్ సన్నివేశాల్లో వెనుకడుగు వేయలేదు. దేవ్ మోహన్ సైతం చక్కగా నటించారు. వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? తన పాత్రలో ఒదిగిపోయారు. మడోన్నా సెబాస్టియన్ చాలా అందంగా కనిపించింది. తన నటనతో ఆకట్టుకుంది. వీటీవీ గణేష్, మడోన్నా సెబాస్టియన్, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్ తదితరులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

తాతినేని సత్య సినిమాను ఏమాత్రం రక్తికట్టించలేకపోయారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం సైతం అంతంత మాత్రమే. ఎడిటర్ కత్తెరకు మరి కాస్త పదును పెట్టి ఉంటే బాగుండేదేమో. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో చెప్పుకోదగిన బలమంటూ ఏదీ లేదు. సాగదీత, కథనంలో కొరవడిన ఆసక్తి వంటి ఎన్నో లోట్లు మెండుగానే ఉన్నాయి.

తీర్పు: ‘సతీ లీలావతి’ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు

మరిన్ని వార్తలు

No categories found.