గోదారి గట్టుపైన మూవీ రివ్యూ
Published మే 8, 2026 by Srinivas
‘మేం ఫేమస్’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచమైన సుమంత్ ప్రభాస్… నేడు ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కూల్ సమ్మర్ బ్రీజ్ మూవీ’ అంటూ ఈ చిత్ర ప్రమోషన్స్‌ను పెద్ద ఎత్తున చేశారు. మరి సినిమా నిజంగా కూల్ సమ్మర్ బ్రీజ్ మూవీయేనా? ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? చూద్దాం.

కథేంటంటే..
భీమవరం దగ్గర్లో ఓ పల్లెటూర్లో ఉండే ఆటో డ్రైవర్ రాజు (సుమంత్ ప్రభాస్)ది చిన్న కుటుంబం. అమ్మానాన్నలు (శ్రీవాణి, దేవి ప్రసాద్), తన చెల్లి (శ్రీ లాస్య) అతని ప్రపంచం. రాజుని అతని తల్లిదండ్రులు చాలా విలువలతో పెంచుతారు. తన కుటుంబం, స్నేహితులతో ఆనందంగా సాగిపోతున్న రాజు జీవితంలోకి మాయ (నిధి ప్రదీప్) వస్తుంది. మాయకు తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) ప్రపంచం. చదువులోనూ మంచి ర్యాంకర్. అలాంటి మాయను చూసిన రాజు.. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ తరువాత కొద్ది రోజులకు మాయ కూడా అతడిని ప్రేమిస్తుంది. కానీ శ్యాంబాబుకు తన కూతురిని మంచి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరిక. దీంతో రాజుతో మాయ ప్రేమ ఆయనకు నచ్చదు. మరి శ్యాంబాబు ఏం చేశాడు? చివరకు వీరిద్దరి పెళ్లి జరిగిందా? అనేది వెండితెరపై వీక్షించాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
ప్రేమకథలనేవి ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయాయి. కథలో కొత్తదనం లేకున్నా కథనం తీర్చిదిద్దే విధానంలోనే దర్శకుడి ప్రతిభను కనచరచాల్సి ఉంటుంది. ఒక ఆటో రేస్‌తో సినిమాను దర్శకుడు సుభాష్ చంద్ర ప్రారంభించాడు. అదే సమయంలో గోదావరి జిల్లాల అందాలను కూడా చూపించారు. వాస్తవానికి సినిమా చాలా కూల్‌గానే ప్రారంభమవుతుంది. రాజు, అతని స్నేహితులు, వారంతా కలిసి చేసే అల్లరి, మాయ, శ్యాంబాబు వంటి నటీనటుల పరిచయంతో పాటు వారి ప్రేమను ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. ఇదొక ఇంటర్ రెలిజియన్ ప్రేమకథ. ఒక రొటీన్ లైన్. రాజు మీద ఒక నింద పడటం.. ఆటో డ్రైవర్స్ కూడా మనుషులే. వారిలోనూ మానవత్వం ఉంటుందనే యాంగిల్‌తో సెకండాఫ్ సాగుతుంది. వాస్తవానికి కథనం అందించడంలోనే దర్శకుడు కాస్త తడబడినట్టుగా కనిపిస్తోంది. గోదావరి జిల్లాల అందాలను చూపించడంపై పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదు. రొటీన్ ప్రేమకథను అంతే రొటీన్‌గా అందించారు. సినిమాలో మలుపులు అంటూ ఏమీ ఉండవు. సాఫీగా సాగిపోతుంది. సినిమాలో కామెడీ వర్కవుట్ అయినంతగా కథ ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. ఎమోషన్ కూడా అంతగా పండలేదు.

ఎవరెలా నటించారంటే..
సుమత్ ప్రభాస్ సినిమాకు మెయిన్ బలం. రాజు పాత్రలో అతను జీవించాడు. గోదావరి యాసలో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తనకు ఆ యాస తెలియకున్నా కూడా ఎక్కడా ఆ విషయం మనకు తెలియనివ్వలేదు. ఇక నిధి ప్రసాద్ విషయానికి వస్తే తన పాత్రకు చక్కగా సరిపోయింది. చాలా సన్నివేశాల్లో ఆమె తన నటనతో ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా కూడా ఎక్కడా తడబడలేదు. ఒక స్ట్రిక్ట్ ఇంటి పెద్దగా జగపతిబాబు తన పాత్రలో ఒదిగిపోయారు. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్, శ్రీవాణి వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన లైలకు ఏమాత్రం ప్రాధాన్యం లేదు. కనీసం డైలాగ్స్ కూడా లేని, నటనకు స్కోప్ లేని పాత్రను ఒక సీనియర్ హీరోయిన్ తన రీఎంట్రీలో ఎంచుకోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది సుదర్శన్ గురించి. హీరో స్నేహితుడి పాత్రలో కామెడీని పంచే బాధ్యతను పూర్తిగా తీసేసుకున్నాడు. సుదర్శన్ లేకుంటే కామెడీ అంతగా వర్కవుట్ అయ్యేది కాదేమో అనిపిస్తుంది. రాజకుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ వంటి వాళ్లు తమ పాత్ర పరిధి మేరకు చక్కగానే నటించారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు సుభాష్ ఎంచుకున్నది రొటీన్ ప్రేమకథనే. కానీ దానిని ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఈ చిత్రానికి సంబంధించి చెప్పుకోవల్సి వస్తే.. సినిమాటోగ్రాఫర్ గురించి చెప్పాలి. గోదావరి అందాలను కళ్లకు కట్టాడు. ఇక నేపథ్య సంగీతం సినిమాకు బాగానే సెట్ అయ్యింది. పాటలు అలరిస్తాయి. ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
బలాలు..
- హీరోహీరోయిన్ల నటన
- సుదర్శన్ కామెడీ
బలహీనతలు..
- సాగదీత
- కొత్తదనం లేని ప్రేమకథ
తీర్పు: ఫైనల్‌గా.. ‘గోదారి గట్టుపైన’ చల్లదనం లేని ఒక రొటీన్ ప్రేమకథ.
Rating: 



(2.5/5)
