విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ
Published ఆగస్ట్ 14, 2026 by Srinivas
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ ప్రమోషన్స్‌లో మేకర్స్ చెప్పారు. అలాగే బిగ్ ఓటీటీ డీల్ జరిగిందని.. రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు సాధించిందంటూ టాక్ నడిచింది. పైగా సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అంచనాలను పెంచేశాయి. పైగా ‘లక్కీ భాస్కర్’ విజయం తర్వాత దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా కావడంతో సాధారణంగానే సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
సంజయ్ విశ్వనాథ్ (సూర్య)కు తల్లిదండ్రులే సర్వస్వం. తండ్రి (రాజీవ్ మీనన్).. తల్లి నిర్మలా దేవి (రాధిక)ని కాదని వేరే మహిళ అంజలి (రవీనా టాండన్)ని సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు. రెండో పెళ్లికి ముందు తండ్రితో సంజయ్ మాట్లాడతాడు. నిర్మలపై ప్రేమ తగ్గిపోయిందని.. వేరే మహిళపైకి కన్వర్ట్ అయ్యిందని చెబుతాడు. ఆ మాటలు సంజయ్ మనసులో బాగా నాటుకు పోతాయి. ఇక పెళ్లే వద్దని డిసైడ్ అవుతాడు. కానీ సరోగసీ ద్వారా ఓ బిడ్డను కంటాడు. సంజయ్ కుమారుడు అభయ్‌కి హెల్త్ ఇష్యూ రావడంతో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెబుతారు. సంజయ్ బోన్ మ్యారో సెట్ కాదు. దీంతో అభయ్ తల్లి బోన్ మ్యారో కోసం ప్యారిస్ వెళతాడు. అక్కడ అభయ్ తల్లి మదన కామేశ్వరి అలియాస్ మ్యాడి (మమితా బైజు) అని తెలుసుకుంటాడు. ఆమెను ఒప్పించి ఇండియాకు తీసుకొస్తాడు. నిర్మలకు మ్యాడీ అంటే పడదు. ఆ తరువాత మెడిసిన్ చదివేందుకు డబ్బు అవసరమవడంతో సరోగసీకి మ్యాడీ అంగీకరించిందని నిర్మలకు తెలియడంతో ప్రేమగా దగ్గరకు తీస్తుంది. అల్లరిగా, యాక్టివ్‌గా.. సరదాగా ఉండే మ్యాడీ అందరికీ బాగా దగ్గరవుతుంది. ఇక సంజయ్ మాత్రం మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఉంటాడు. దీంతో సంజయ్‌పై మ్యాడీకి ప్రేమ కలుగుతుంది. కానీ సంజయ్ పెళ్లికి అంగీకరించడు. మరి సంజయ్‌ని చివరకు మ్యాడీ పెళ్లికి ఒప్పించగలిగిందా? తండ్రి సెకండ్ ఫ్యామిలీని సంజయ్ దగ్గరకు తీశాడా? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకూ ఎక్కడా బోర్ అనేది అనిపించదు. దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను అన్ని విధాలుగా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దారు. క్లీన్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేక్షకులకు కావల్సినంత భావోద్వేగం అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి. ముఖ్యంగా నిర్మల, మ్యాడీ మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా.. చాలా హిలేరియస్‌గా ఉంటాయి. సంజయ్ కుమారుడికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించే క్రమంలో మ్యాడీ ఆయనకు పరిచయమవడంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. చాలా డీసెంట్‌గా ఉండే సంజయ్‌కు చాలా అల్లరిగా.. సరదాగా ఉండే మ్యాడీ పరిచయం ఆయనను ఎలా మార్చేసిందనేద కథ. ప్రేమకు వయసు లేదని అంటారు. స్థాయి భేదమే కాదు.. వయసు వ్యత్యాసం కూడా లేదని ఈ చిత్రంలో చూపించారు. ఏ వయసున్న వ్యక్తిపై అయినా ప్రేమ పుట్టవచ్చు. ఇదే అంశాన్ని చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా సరోగసీ ద్వారా బిడ్డను కనడం.. ఆ తరువాత బాబుకు ఆరోగ్య సమస్య ఏర్పడటం.. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్, మ్యాడీ ఎంట్రీ వంటి అంశాలతో రూపొందించారు. మ్యాడీని సంజయ్ పారిస్ పంపించాలనుకోవడంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఇక సెకండ్ హాఫ్‌ను కంప్లీట్‌గా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందించారు. మొత్తంగా సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.

ఎవరెలా నటించారంటే..
సూర్య ఎప్పటిలాగే తన పాత్రలో లీనమయ్యారు. అద్భుతమైన నటనను కనబరిచారు. చాలా డీసెంట్‌గా కనిపించి మెప్పించారు. మమితా బైజు విషయానికి వస్తే సూర్యకు ఏమాత్రం తగ్గకుండా నటించింది. ఆమె నటన చాలా సహజంగా అనిపించింది. ఇక రాధికా శరత్‌కుమార్ కూడా తన పాత్రలో జీవించేశారు. ఆమె పాత్ర చాలా సరదాగా.. ఎమోషనల్‌గా ఉంటుంది. ఇక నాజర్ తెరపై కనిపించింది కొద్ది క్షణాలే అయినా హాయిగా నవ్వించారు. రవీనా టాండన్ అద్భుతంగా నటించారు. మిగిలిన నటీనటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..
డైలాగ్స్, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు బిగ్ అసెట్. ఒక మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాను తెరకెక్కించిన తీరు అద్బుతం. మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ముఖ్యంగా పాటలు యావరేజ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ సైతం బాగానే ఉంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
ఫైనల్‌గా.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రేక్షకులను ఎమోషన్‌తో కొట్టారు.
Rating: 



(3.25/5)
