“ఆరావళి” తీర్పుతో భారతావనిలో పెనుమార్పు…?
జనవరి 5, 2026 Published by Srinivas

ఇప్పుడు ఆరావళి పర్వతాల మీద ప్రధానంగా సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకున్న ఈ కేసు కు సంబంధించిన చర్చ దేశ వ్యాప్తంగా నడుస్తోంది. ఈ కేసు లో అసలు వివాదం “ఆరావళి పర్వతాలు” కి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన నిర్వచనం పై నడుస్తోంది.
ఆరావళి పర్వత శ్రేణులు ఎన్నో జీవ నదులకు జన్మస్థానం. విలువైన ఖనిజ సంపద కలిగి ఉన్న ఈ పర్వతాలు హిమాలయాల కన్నా పురాతనమైనవి. రమారమి 670 కిలోమీటర్ల వరకు నాలుగు రాష్ట్రాలను అనుకుని ఈ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. రాజస్థాన్ లోని మౌంట్ అబూలో ఉన్న గురు శిఖర్ ఎత్తైన పర్వతం. ఇంకా రాగి, సీసం, జింక్, మార్బుల్ వంటి ఎన్ని విలువైన ఖనిజాలు కలిగి ఉన్నది. తాజ్ మహల్ కి వాడిని ‘మక్రనా’ మార్బుల్ ఈ పర్వతాల నుండి సేకరించినదే కావడం గమనార్హం.
అటువంటి పర్వతాల విషయంలో ఇప్పుడు… కేంద్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని నిబంధనలు తీసుకువచ్చింది, దాని ప్రకారం కొండలుగా భావించాలంటే ఆ శిఖరం స్థానిక భూభాగం కంటే కనీసం 100 మీటర్లు ఎత్తులో ఉండాలి. అంటే 328 అడుగులు ఎత్తు పై బడి ఉన్నవాటిని మాత్రమే పర్వతాలుగా గుర్తిస్తామని చెప్పింది. ఇది ప్రకృతికి మరణ శాసనం లాంటిది అని, ఆరావళి భౌగోళిక స్వరూపం మారిపోతుంది అని పర్యావరణ నిపుణుల ఆందోళన చెందుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. దీని మూలంగా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. ఫలితంగా ముందుగానే చలి గాలులు దేశంలోకి ప్రవేశిస్తున్నాయి.
అటువంటి సమయంలో ఈ 100 మీటర్ల నిబంధన వల్ల ఆరావళిలోని 90% కంటే ఎక్కువ ప్రాంతాలు లీగల్ రక్షణ కోల్పోయే అవకాశం ఉందని, దాంతో మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్‌కు దారి తీస్తుందని పర్యావరణ పరిరక్షణ నిపుణులు భయపడుతున్నారు.
కోర్టు తీర్పుతో…
డిసెంబర్ 29, 2025న దేశవ్యాప్తంగా ఈ 100 మీటర్ల వరకు మైనింగ్ జరపవచ్చు అనే తీర్పు పైన… కేంద్రం సూచించిన కొత్త నిర్వచనాన్ని కోర్టు ముందు అంగీకరించింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో…. తాత్కాలికంగా స్టే ఇచ్చి… తాము మిగతా నిర్దేశించిన ప్రాంతాల్లో తదుపరి నిర్ణయం అంటే “Management Plan for Sustainable Mining (MPSM)” నివేదిక వచ్చే వరకు కొత్త మైనింగ్ లీజులు ఇవ్వొద్దని ఆదేశించింది. తాత్కాలికంగా నిలిపి వేసిన ఈ కేసు ను 21 జనవరి 2026 కి వాయిదా వేసింది .
పర్యావరణ పరంగా ఆరావళి పర్వతాలు పెట్టని కోట వంటివి… వీటిని నాశనం చేస్తే ఉత్తర భారతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది… హర్యానా , రాజస్థాన్ లోని కొన్ని జిల్లాలలో ఆరావళి పర్వతాలు ధ్వంసం అయ్యాయి… జీవ వైవిధ్యం దెబ్బతిన్నది. ఈ పర్వతాలు దెబ్బతింటే థార్ ఎడారి డిల్లీ వరకు వ్యాపించే ప్రమాదం ఉంది… ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మీదుగా వ్యాపించి ఉన్న ఈ పురాతన పర్వతశ్రేణి…. థార్ ఎడారిని తూర్పు వైపు విస్తరించకుండా “గ్రీన్ బ్యారియర్”లా పనిచేస్తుంది. అలాగే భూగర్భ జలాలు అడుగంటకుండా… ఈ నాలుగు రాష్ట్రాలను ఆరావళి పర్వత శ్రేణులు కాపాడుతున్నాయి.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) 2024 ఇచ్చిన నివేదికలో 100 మీటర్ల లోపు పర్వతాలు థార్ ఎడారి నుండి వచ్చే ధూళి, ఇసుకను అడ్డుకోవడంలో ఈ కొండలు కీలక పాత్రను పోషిస్తున్నాయి అని ఇచ్చింది. అసలే వాయు కాలుష్యంతో విలవిలలాడుతున్న డిల్లీ, ఈ మైనింగ్ వల్ల దుమ్ముతో భవిష్యత్తు లో మరింత ఇబ్బంది పడుతుంది అని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోర్టు తీర్పు మేరకు పురాతన పర్వతాలు భవితవ్యం తేలనుంది.
పార్టీలు భావితరాలను , ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
