అమెరికా ఆధిపత్య ధోరణికి… వెనిజులా అధ్యక్షుడు బలి…
జనవరి 6, 2026 Published by Srinivas

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తున్నారని అమెరికా ఆరోపిస్తూ… ఆయన్ని, ఆయన భార్యను అపహరించుకుపోయింది. కనీసం ఆ దేశ సైన్యం కొంచెం కూడా ప్రతిఘటించలేకపోయింది. అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్ తీసుకుపోయినట్టుగా ….. తీసుకుపోయింది. ఆ దేశ సార్వ బౌమత్వానికి సవాలు విసిరింది. జనవరి 3, 2026న US “Absolute Resolve” ఆపరేషన్‌లో కారాకస్ సహా అనేక ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు చేసి, మదురోను పట్టుకుని USA తమ నౌక ద్వారా న్యూయార్క్‌కు తరలించింది.
అంతేకాదు, 2024లో జరిగిన ఎన్నికలు స్వేచ్ఛాయుతంగానూ, న్యాయసమ్మతంగానూ జరగలేదన్న కారణంతో మదురోను వెనెజ్వెలా చట్టబద్ధ అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడం లేదు. తమ వద్ద ఉన్న అపారమైన చమురు నిల్వలను, సహజ వాయువు ను స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతోనే అమెరికా కుట్ర పన్నుతోందని వెనజులా ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనెజులాలో ఉన్నాయని ఒక అంచనా.
అమెరికా వెనుజులా అధ్యక్షుడను కిడ్నాప్ చేయడానికి ముందే వెనిజులా అధ్యక్షుడు చైనా అధికారులు తో సమావేశమయ్యారు. ఆ రాత్రికి యూఎస్ ఆధ్వర్యం లో యుద్ధ విమానాలు ప్రవేశించి, మదురో నీ ఆయన భార్యను తీసుకుపోయారు. వెనిజులా ప్రభుత్వం చైనా దగ్గర తీసుకున్న రాడార్లు అసలు గుర్తించ లేకపోయాయి. దీని వెనుక CIA కుట్ర దాగి ఉందని…. ఆ దేశ ప్రభుత్వ అధికారులను ప్రలోభాలకు గురి చేసి ఆ దేశ సైనిక అధికారులను లొంగదీసుకున్నది అని వార్తలు వస్తున్నాయి.
వెనిజులాలో ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా అస్థిరస్థితిలో ఉంది. నికోలస్ మదురోను అమెరికా సైన్యం పేలుళ్లు, దాడుల తర్వాత అరెస్ట్ చేసి USకి తరలించడంతో అధికారం ఖాళీ అయింది. ప్రస్తుతం రాజ్యాంగ ప్రకారం ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ దేశాన్ని ఎవరు నిజంగా నడుపుతున్నారు అన్నది స్పష్టత లేదు. అయితే, పరిస్థితి అంత సులభంగా పరిష్కారమయ్యే అవకాశాలు లేవని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు.
వెనెజులా నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు రావడానికి నికోలస్ మదురో కారణమని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, అణచివేత కారణంగా 2013 నుంచి వెనెజ్వెలా నుంచి పారిపోయిన జనాభా అక్షరాలా 80 లక్షల మంది అని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ ఎటువంటి ఆధారాలు చూపించనప్పటికీ, ఆ దేశంలో అణచివేత కారణం గా…. వారందరూ అమెరికాకు బలవంతంగా పంపబడుతున్నారని ఆరోపిస్తున్నారు.
అమెరికాలో పెరుగుతున్న మాదకద్రవ్యాల సరఫరాకు, ముఖ్యంగా ఫెంటానిల్, కొకైన్‌ను అరికట్టడంపై ట్రంప్ దృష్టి సారించారు. “ట్రెన్ డి అరగువా” “కార్టెల్ డి లాస్ సోలెస్” అనే రెండు వెనెజులా ముఠాలను ‘విదేశీ ఉగ్రవాద సంస్థల’ జాబితాలో చేర్చారు. రెండవ గ్రూపునకు మదురో స్వయంగా నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ట్రంప్ ప్రకటనను మదురో తీవ్రంగా ఖండించి, తనను పదవి నుంచి తొలగించడానికి, వెనెజ్వెలాలోని విస్తారమైన చమురు నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ‘మాదకద్రవ్యాలపై యుద్ధాన్ని’ ఒక సాకుగా ఉపయోగిస్తోందని అన్నారు.
వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ స్టేట్ టీవీలో ప్రసంగిస్తూ, అమెరికా అధికారులు ఇటీవల నార్కో-టెర్రరిజం మరియు డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలపై అరెస్టు చేసి తీసుకెళ్లిన అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వెనిజులా సుప్రీం కోర్టు, నికోలస్ మదురో దేశానికి ఏకైక చట్టబద్ధ నాయకుడిగా ధృవీకరిస్తూ, సైన్యం మరియు రాజకీయ నాయకుల ఏకగ్రీవ మద్దతు తో రోడ్రిగ్జ్‌ను తాత్కాలికంగా అధ్యక్ష పదవి చేపట్టమని ఆదేశించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వెనిజులా వ్యవహారాలను తమ దేశం పర్యవేక్షిస్తుందని ప్రకటించగా, రోడ్రిగ్జ్ దానిని సార్వభౌమత్వంపై అక్రమ దాడిగా ఖండించారు.
ఈ దాడిని అంతర్జాతీయ స్థాయిలో రష్యా, చైనా, ఇరాన్, క్యూబా, ఉత్తర కొరియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, స్పెయిన్, ఉరుగ్వే , ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, మొదలగు దేశాలు ఖండించాయి. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చైనా ను కట్టడి చేయడానికే వెనిజులా మీద దురాక్రమణ కు కారణం అని అభిప్రాయ పడుతున్నారు. అమెరికా ఆధిపత్య ధోరణి కి తలవంచకపోతే ఏదో ఒక నెపంతో ఆంక్షలు విధించి కాని , ఆ దేశ ప్రభుత్వాన్ని పడగొట్టి తనకు అనుకూలం గా ఉండే వారిని నియమించుకుని తమ దారి కి తెచ్చుకుంటుంది. ఇరాన్ లో కూడా ఇవే ప్రయత్నాలు మొదలు పెట్టింది.అక్కడ ధర్నాలతో ఇరాన్ దద్దరిల్లుతుంది. భారత దేశంలో ఆ ఆటలు చెల్లలేదు. సమర్ధవంతమైన ప్రధాని మోదీ నాయకత్వం సమర్థత తో ఇక్కడ ఎదుర్కొంది. ఇక్కడ ప్రజలు వివేకంతో సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కాబట్టి, ఈ దేశం సుస్థిరంగా ఉంది అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
