శ్రీకాళహస్తీశ్వరునికి వేడి నీటితో అభిషేకమా…?
జనవరి 6, 2026 Published by Rahul N

శ్రీ కాళహస్తి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి రోజున ప్రత్యేకంగా వేడి నీటితో (ఉష్ణ జలంతో) స్వామివారికి అభిషేకం చేస్తారు. ఎందుకు అంటే ఆరుద్ర నక్షత్రం శివునికి అత్యంత పవిత్రమైనది. తాండవ స్వరూపంలో ఉన్న శివుడి తేజస్సు కు సూచనగా ఈ ఉష్ణ జల అభిషేకం సంప్రదాయంగా చేస్తారు.
శ్రీ కాళహస్తిలో స్వామి వాయు లింగం కావడం వల్ల ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి రోజున చేసే అభిషేకానికి అత్యంత ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం మరియు నమ్మకం . ఈ రోజు దర్శనం చేసుకుంటే, రాహు, కేతు దోషాలు తగ్గుతాయి. ఆరోగ్యం, మనశ్శాంతి లభిస్తాయి శివ అనుగ్రహం విశేషంగా కలుగుతుంది అంటారు.
ఇది ఆగమ శాస్త్రం, ఋతుచక్రం, తత్త్వార్థం….. మూడింటి కలయికతో ఉన్న సంప్రదాయం. మామూలు రోజుల్లో వేడి నీటితో అభిషేకం చేయరు…. శైవ ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం శివాలయాల్లో నిత్య అభిషేకం సహజ ఉష్ణోగ్రత నీటితోనే చేయాలి. వేడి నీటితో రోజూ చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధం…..లింగ తత్త్వం శాంత స్వరూపం అందుకే చల్లని సహజ ఉష్ణోగ్రత తో కూడిన జలం శాంతి, స్థైర్యం, సమత్వం, నకు సూచన….. వేడి నీరు తీవ్ర శక్తి తో కూడినది. ఇది రోజూ నిర్వహించే అభిషేకం కాదు, శ్రీ కాళహస్తి ఆలయం సూర్య, మరియు చంద్ర గ్రహణ సమయంలలో కూడా తెరిచి ఉంటుంది. ఇది ప్రపంచం లో ఏ శివాలయం లోనూ ఉండదు. సాధారణ రోజుల్లో వేడి జలం వాయు తత్త్వాన్ని అసమతుల్యం చేస్తుంది.

ఆరుద్ర నక్షత్రం నకు ఒక విశిష్టత ఉంది. ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ తత్త్వం, ఆరుద్ర రుద్ర తత్త్వనకు పరాకాష్ఠ, శివుడు ఆ రోజు తాండవ స్వరూపంలో ఉంటాడని విశ్వాసం. ఆ తేజస్సుకు ఉష్ణ జల అభిషేకం అనుకూలం, పౌర్ణమి కి పూర్ణ శక్తి తో చంద్ర కళలు ఉంటాయి, చంద్రుడు శీతలత్వం తో ఆహ్లాదకరంగా ఉంటాడు.
తాత్త్వికంగా ఒక్క మాటలో నిత్యం శాంత స్వరూపం సాధారణ జలం, ఆరుద్ర, పౌర్ణమి నాడు ఉగ్ర, తేజోమయ స్వరూపం ఉష్ణ జలం… ఈ తిది, నక్షత్రం రోజున పంచ భూతాల శివ లింగ క్షేత్రాల లో పూజా కైంకర్యాలు ఎలా జరుగుతాయో చూద్దాం.
“చిదంబరం” లో నటరాజ స్వామి ఆరుద్ర దర్శనానికి కేంద్ర బిందువు. శివుడు ఇక్కడ నటరాజ తాండవ స్వరూపం. ఆరుద్ర రోజు మహాభిషేకం (108 కలశాలు) రహస్య దర్శనం (ఆకాశ తత్త్వం) ఇక్కడ ఆవు నెయ్యి , పాలు, తేనె, చందనం నకు ఎక్కువ ప్రాధాన్యం మరియు మహా నృత్యోత్సవం జరుగుతుంది.

“కాంచీపురం” లో పృథ్వీ తత్వ శివలింగం కావున అభిషేకాలు చేయరు. ఆరుద్ర నక్షత్రం పూజ, వస్త్రం తో అలంకార సేవ , పుష్పాలు, విభూతి అలంకారం,చందనం లేపనం (అభిషేకం కాదు) దీపారాధన,వేద పారాయణం, రుద్ర జపం తో కూడినవి మాత్రమే చేస్తారు.

“జంబు కేశ్వరం” జల తత్వ శివలింగం. ఇక్కడ నీరు చైతన్య ప్రవాహం తో కూడుకున్నది. ప్రధాన విశేషం స్వామి వారి లింగం కింద సహజంగా నీరు ఉద్భవించటం వల్ల, పౌర్ణమి తో కూడిన ఆరుద్ర రోజున అది మహా శక్తి వంతమైన స్వరూపం గా భావిస్తారు.

“తిరువణ్ణామలై” (అరుణాచలేశ్వరుడు) అగ్ని లింగ క్షేత్రం, ఇక్కడ వేడి నీటితో చేయరుకానీ, దీపారాధన, రుద్ర హోమాలు ఎక్కువ, ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ నకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శివుడు “అగ్ని స్వరూపం”గా పూజింపబడతాడు.
వీటితో పాటు… “కాశీ” లో విశ్వేశ్వరుడు కి పౌర్ణమి, ఆరుద్ర నాడు మహన్యాస పూర్వక పాశుపత రుద్రాభిషేకం ప్రత్యేకంగా చేస్తారు. వేడి నీటి సంప్రదాయం లేదు. గంగా జలం తో కూడిన అభిషేకము తో ప్రధానము గా నిర్వహిస్తారు.

భక్తులు ఆరుద్ర–పౌర్ణమి రోజున పాటించాల్సిన నియమాలు. పూర్ణ ఉపవాసం లేకపోతే జలం, పాలు, పండ్లు, తీసుకోవచ్చు. ఉల్లిపాయ, వెల్లుల్లి పూర్తిగా త్యజించాలి. బ్రహ్మచర్య నియమం తప్పనిసరి అంటే
ఇంద్రియ నియంత్రణ, ఇది రుద్ర తత్త్వానికి ముఖ్యమైన నియమం.
ఇంటిలో చేసుకోవాలంటే “ఓం నమః శివాయ” జపం తో బాటు నమక ,చమకం లతో కూడిన పారాయణం, అభిషేకానికి ద్రవ్యాలు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు, బిల్వ పత్రాలు, విభూతి తో చేసుకోవచ్చు. ఇంట్లో వేడి నీటితో చేయరాదు.
ఆరుద్ర రోజు శివుడి తాండవ తేజస్సు, పౌర్ణమి సంపూర్ణ శక్తి, కి… శ్రీ కాళహస్తిలో వేడి నీటి అభిషేకం తో వాయు తత్త్వ సమతుల్యత ఏర్పడుతుంది.
“పౌర్ణమి తో ఆరుద్ర నక్షత్రం రోజున స్వామి వారిని పూజించినవారికి రాహు, కేతు ప్రభావం పూర్తిగా తగ్గుతుంది”అని వేద పండితులు చెబుతున్నారు.
