కోనసీమలో ONGC గ్యాస్ లీకేజీ: భారీ మంటలు, 5 కిలోమీటర్ల పరిధిలో ప్రజల తరలింపు
జనవరి 5, 2026 Published by Srinivas

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఉన్న ONGC డ్రిల్లింగ్ సైట్‌లో గ్యాస్ లీకేజీ చోటుచేసుకుని తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డ్రిల్ సైట్ నుంచి భారీగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
గ్యాస్ లీకేజీ కారణంగా చెలరేగిన మంటల ధాటికి సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో, భద్రతా చర్యల్లో భాగంగా డ్రిల్ సైట్ చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, ONGC అత్యవసర బృందాలు, జిల్లా యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
గ్యాస్ లీకేజీకి గల కారణాలపై ప్రాథమిక విచారణ ప్రారంభమైందని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కోనసీమ ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.
