Download App

విశాఖ ఎయిర్‌పోర్ట్ లో పౌర సేవలకు స్వస్తి… రక్షణ కోటగా మారనున్న ఐఎన్ఎస్ డేగా…

మే 28, 2026 By Suresh Thota
భారతదేశ తూర్పు తీర రక్షణ వ్యూహంలో అత్యంత కీలకమైన మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఉత్తరాంధ్ర వాసుల కల అయిన "భోగాపురం" అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతున్న వేళ, విశాఖపట్నం పాత విమానాశ్రయం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది. 2026, జూలై మొదటి వారంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైభవంగా...
విశాఖ ఎయిర్‌పోర్ట్ లో పౌర సేవలకు స్వస్తి… రక్షణ కోటగా మారనున్న ఐఎన్ఎస్ డేగా…

భారతదేశ తూర్పు తీర రక్షణ వ్యూహంలో అత్యంత కీలకమైన మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. ఉత్తరాంధ్ర వాసుల కల అయిన “భోగాపురం” అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమవుతున్న వేళ, విశాఖపట్నం పాత విమానాశ్రయం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతుంది. 2026, జూలై మొదటి వారంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్ వైభవంగా ప్రారంభం కానుండటంతో.. జూలై 9 నుండి ప్రస్తుత విశాఖపట్నం విమానాశ్రయం మరియు దాని చుట్టూ ఉన్న వైమానిక పరిధి (Airspace) పై పూర్తి నియంత్రణను ఇండియన్ నావీ (భారత నావికాదళం) తన చేతుల్లోకి తీసుకోనుంది.

​ఒకప్పుడు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి పౌర విమానాలను శంషాబాద్‌కు తరలించి, దానిని పూర్తిగా రక్షణ రంగానికి ఎలాగైతే పరిమితం చేశారో.. ఇప్పుడు విశాఖ ఎయిర్‌పోర్ట్ విషయంలోనూ అదే వ్యూహం అమలు కాబోతోంది. అయితే, భూపరివేష్టిత నగరమైన హైదరాబాద్‌లోని బేగంపేట కంటే, వ్యూహాత్మక సముద్ర తీర ప్రాంతమైన “విశాఖపట్నం” ఎయిర్‌పోర్ట్ పూర్తి స్థాయిలో నావికాదళం పరమవ్వడం వెనుక దేశ భద్రతకు సంబంధించిన ఎన్నో కీలక సమీకరణాలు ఉన్నాయి.

ఐఎన్ఎస్ డేగా ప్రస్థానం…

విశాఖపట్నం రన్‌వే మరియు ఎయిర్‌పోర్ట్ ఉన్న ప్రాంతం నిజానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) స్వంత ఆస్తి కాదు. 1986 నుండి దీని పూర్తి యాజమాన్య హక్కులు భారత నావికాదళం వద్దే ఉన్నాయి. ఇక్కడ ఉన్న నావికాదళ వ్యూహాత్మక విమాన స్థావరమే ఈ “ఐఎన్ఎస్ డేగా” (INS Dega), నావికాదళ నిబంధనల ప్రకారం కేవలం సముద్రంలో తేలే యుద్ధ నౌకలకే కాదు, తీరంలో ఉండే ఇలాంటి కీలక ఎయిర్ స్టేషన్లను కూడా నావికాదళ అధికారులు తమ స్థావరాలుగా పరిగణిస్తూ వాటి పేరు ముందు ‘INS’ (Indian Naval Ship) అని చేరుస్తారు.

ఈ స్థావరానికి “డేగా” అని పేరు పెట్టడం వెనుక ఒక అర్థం ఉంది. తెలుగు భాషలో “డేగ” అనే (Falcon/Hawk) పక్షి ఆకాశంలో చాలా ఎత్తున ఎగురుతూనే, భూమిపై లేదా నీటిలో ఉన్న అత్యంత చిన్న లక్ష్యాన్ని కూడా స్పష్టంగా చూడగలిగే తీక్షణమైన కంటి చూపు దాని సొంతం. దానికి చాలా చురుకైన నిఘానేత్రం కలిగి (Sharp Vision) ఉంటుంది. అలాగే లక్ష్యంపై మెరుపు వేగంతో విరుచుకుపడే నైజం దీనిది.

విశాఖపట్నంలోని ఈ ఎయిర్ స్టేషన్ ముఖ్య ఉద్దేశ్యం కూడా బంగాళాఖాతంలో శత్రువుల కదలికలపై నిరంతరం “డేగ కన్ను” వేసి ఉంచడం మరియు అవసరమైనప్పుడు శత్రువులపై మెరుపు దాడి చేయడం. స్థానిక తెలుగు భాషకు, సంస్కృతికి గౌరవమిస్తూ “ఇండియన్ నావీ” దీనికి ఈ పేరు పెట్టింది.

1970లలో కేవలం హెలికాప్టర్ల ల్యాండింగ్ కోసం ఒక చిన్న హెలిప్యాడ్ లాగా ప్రారంభమైన ఈ స్థావరం, ఆ తర్వాత ప్రాధాన్యత పెరగడంతో 1991, అక్టోబర్ 21న పూర్తి స్థాయి నేవల్ ఎయిర్ స్టేషన్‌గా మారి “INS డేగా” గా అధికారిక నామకరణం పొందింది. అయితే, ఉత్తరాంధ్ర ప్రజల ఆర్థిక, సామాజిక అవసరాల దృష్ట్యా, పౌర విమానాల రాకపోకలకు నావీ ఇక్కడ అనుమతినిచ్చింది.

విశాఖ ఎయిర్‌పోర్ట్ లో పౌర సేవలకు స్వస్తి… రక్షణ కోటగా మారనున్న ఐఎన్ఎస్ డేగా…

​’ఉమ్మడి’ రన్‌వే సమస్యలు.. పెరిగిన భద్రతా ముప్పు

గత కొన్ని సంవత్సరాలుగా ఇటు పౌర విమానాలు, అటు నావీకి చెందిన యుద్ధ విమానాలు ఒకే రన్‌వేను పంచుకుంటూ వచ్చాయి. కానీ, ఇటీవలి కాలంలో విమానాల రద్దీ విపరీతంగా పెరగడం, బంగాళాఖాతంలో అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు మారడంతో ఈ ఉమ్మడి నిర్వహణ రక్షణ రంగానికి ఒక సవాలుగా మారింది. ​ఒకే రన్‌వేపై శత్రు దేశాల నిఘాను తిప్పికొట్టే పి-8ఐ (P-8I) లాంటి లాంగ్-రేంజ్ మెరైన్ నిఘా విమానాలు, ఫైటర్ జెట్లు, మరోవైపు సాధారణ ప్రయాణికుల విమానాలు పక్కపక్కనే నడపడం వల్ల “ఎయిర్‌స్పేస్ కంజెషన్” (ఆకాశంలో ట్రాఫిక్ జామ్) ఏర్పడేది. వీటికి తోడు, రక్షణ రహస్యాలు, వ్యూహాత్మక ఆపరేషన్లను అత్యంత గోప్యంగా ఉంచడం నావికాదళానికి కష్టతరంగా మారింది. అంతర్జాతీయ పౌర విమానాలు ల్యాండ్ అయ్యే చోట మిలిటరీ గ్రేడ్ భద్రతను వంద శాతం అమలు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పౌర విమానయానాన్ని, సైనిక అవసరాలను వేరు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

​జూలై 9 నుండి మారబోయే సమీకరణాలు

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ఆధునికంగా నిర్మించిన “అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం” జూలై మొదటి వారంలో (ప్రస్తుతానికి జూలై 5 లేదా 8 తేదీల్లో) పౌర సేవలకు సిద్ధమవుతోంది. దీంతో జూలై 8 అర్ధరాత్రి నుండి పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ లో పౌర విమానాల రాకపోకలు శాశ్వతంగా ఆగిపోనున్నాయి.

జూలై 9 ఉదయం నుండి విశాఖ ఎయిర్‌పోర్ట్ వంద శాతం “మిలిటరీ ఓన్లీ” జోన్‌గా మారుతుంది. పౌర విమానాల కోడ్ (VTZ) భోగాపురానికి బదిలీ అవుతుంది. జూలై 9 తర్వాత విశాఖపట్నం రీజినల్ ఎయిర్‌స్పేస్‌లోకి ప్రవేశించే ఏ ఇతర విమానమైనా సరే, ముందుగా విశాఖపట్నం నేవల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుండి ప్రత్యేక అనుమతి తీసుకోవడం తప్పనిసరి. భోగాపురం విమానాశ్రయాన్ని తూర్పు ఎయిర్ ట్రాఫిక్ నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి విమానయాన శాఖ ఇప్పటికే ఐదు కొత్త వైమానిక మార్గాలను (V40, V50, W32 వంటివి) ప్రవేశపెట్టింది. పాత రూట్లను మార్చడం ద్వారా పౌర విమానాలు రక్షణ పరంగా అత్యంత సున్నితమైన నావీ ఆపరేషనల్ జోన్లలోకి వెళ్లకుండా కట్టడి చేశారు.

విశాఖపట్నంలోని “INS డేగా” భారత తూర్పు నావికాదళ కమాండ్ (ENC) కు గుండెకాయ లాంటిది. బంగాళాఖాతంలో చైనా నౌకలు, జలాంతర్గాముల కదలికలు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, మన యుద్ధ విమానాలు, నిఘా డ్రోన్ల అత్యవసర ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లకు ఎలాంటి అంతరాయం లేని స్వతంత్ర రన్‌వే నావీకి అత్యంత అవసరం. పౌర విమానాలు పూర్తిగా వెళ్ళిపోయాక, “INS డేగా” రన్‌వే చుట్టూ భద్రతను మిలిటరీ గ్రేడ్‌కు పెంచుతారు. దీనివల్ల మన వ్యూహాత్మక ఆపరేషన్లు అత్యంత గోప్యంగా సాగుతాయి.

​ఈ చారిత్రాత్మక మార్పు వలన అటు దేశ భద్రతకు, ఇటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బంగాళాఖాత రీజియన్‌ లో భారత నావికాదళ అధికారులు, అక్షరాలా తమ పేరుకు తగ్గట్టే “INS డేగా” ఇకపై శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ, తూర్పు తీరానికి అభేద్యమైన రక్షణ కవచంగా నిలవనుంది. అదే సమయంలో, ఉత్తరాంధ్ర ప్రజలకు మరియు పారిశ్రామిక రంగానికి భోగాపురం రూపంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో కూడిన సరికొత్త అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం ఆర్థిక ప్రగతి ని పరిపుష్టం చేస్తుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading