Download App

వెనిజులాను కుదిపేసిన భూకంపం…

జూన్ 26, 2026 By Suresh Thota
2026 జూన్ 24న దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా ఒక భారీ ప్రకృతి విపత్తును ఎదుర్కొంది. కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.2 తీవ్రత కలిగిన, ఆ వెంటనే 7.5 తీవ్రతతో రెండవ శక్తివంతమైన భూకంపం వెనువెంటనే సంభవించాయి. ఇవి వెనిజులా చరిత్రలో, గత 125 సంవత్సరాల్లో నమోదైన...
వెనిజులాను కుదిపేసిన భూకంపం…

2026 జూన్ 24న దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా ఒక భారీ ప్రకృతి విపత్తును ఎదుర్కొంది. కేవలం 39 సెకన్ల వ్యవధిలో 7.2 తీవ్రత కలిగిన, ఆ వెంటనే 7.5 తీవ్రతతో రెండవ శక్తివంతమైన భూకంపం వెనువెంటనే సంభవించాయి. ఇవి వెనిజులా చరిత్రలో, గత 125 సంవత్సరాల్లో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపం గా నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని “కారకాస్” (Caracas) సహా ఉత్తర వెనిజులా అంతటా తీవ్ర ప్రకంపనలు సంభవించాయి.

ప్రారంభ అధికారిక లెక్కల ప్రకారం 32 మంది మరణించగా, 700 మందికి పైగా గాయపడ్డారు. అయితే రక్షణ చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొన్ని తాజా నివేదికలు 164 నుండి 188 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు, వెయ్యికి పైగా గాయపడినట్లు చెబుతున్నాయి. వేలాది మంది గల్లంతయ్యారనే వార్తలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా విపత్తు అసలు తీవ్రత ఇంకా పూర్తిగా బయటపడలేదు.

భూకంపానికి అత్యంత దెబ్బతిన్న ప్రాంతం లాగ్వైరా రాష్ట్రం. అనేక బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వందల సంఖ్యలో భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. రహదారులు, వంతెనలు దెబ్బతినడం, విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోవడం, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగడం వల్ల ప్రజల జనజీవనం ఒక్కసారిగా స్తంభించి పోయింది.

వెనిజులాను కుదిపేసిన భూకంపం…

భూకంపం తర్వాత అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. కొన్ని పాఠశాల భవనాలను సహాయ శిబిరాలుగా మార్చారు. విమానాశ్రయాలు, మెట్రో సేవలు, కొన్ని ప్రజా రవాణా వ్యవస్థలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోవడంతో వైద్యులు, వైద్య సిబ్బంది నిరంతరాయంగా శ్రమిస్తూ, అత్యవసర సేవలు అందిస్తున్నారు.

ఈ విపత్తు కేవలం ప్రాణనష్టంతోనే పరిమితం కాలేదు. ఆర్థిక నష్టం కూడా భారీగా ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా భూగర్భ శాస్త్ర సంస్థ (USGS) అంచనా ప్రకారం ఆర్థిక నష్టం 100 బిలియన్ డాలర్లకు మించి ఉండే అవకాశం ఉంది అని తెలిపింది. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం ఈ నష్టం వెనిజులా స్థూల జాతీయోత్పత్తి (GDP)లో 20 శాతం వరకు ఉండవచ్చని కొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి.

“వెనిజులా” ఇప్పటికే ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలతో సతమతమవుతుంది. ఇలాంటి సమయంలో ఈ భూకంపం మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అయ్యింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత పెను భారాన్ని మోపే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఇలాంటి విపత్తులు భారమే అయితే, ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వెనిజులాకు ఇది మరింత భారంగా పరిణమించబోతుంది. ఈ ఘటన ప్రపంచ దేశాలను కూడా కదిలించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ వెనిజులా ప్రజలకు సానుభూతి తెలియజేస్తూ, ఆ దేశ ప్రజలకు అన్ని విధాల సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. అమెరికా, బ్రెజిల్, మెక్సికో, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు కూడా సహాయ హస్తం అందించేందుకు ముందుకు వచ్చాయి.

వెనిజులాను కుదిపేసిన భూకంపం…

ఈ భూకంపం భూగర్భ ఫలకాల కదలికల ఒత్తిడి మూలం గా ఉత్పన్నం అయ్యింది అంటున్నారు…. “వెనిజులా” ప్రాంతం “కరేబియన్ ప్లేట్” (Caribbean Plate) మరియు సౌత్ అమెరికన్ ప్లేట్ (South American Plate) మధ్య ఉన్న భూకంప మండలంలో ఉంది. ఈ రెండు ఫలకాల మధ్య నిరంతర ఒత్తిడి పెరిగిపోవడం వల్ల అప్పుడప్పుడు భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈసారి వరుసగా రెండు భారీ ప్రకంపనలు రావడం వల్ల విధ్వంసం మరింత పెరిగింది. ఈ విపత్తు మరో కీలకమైన పాఠాన్ని గుర్తు చేస్తోంది. భూకంపాలను ఆపడం ఎవరి వల్లా కాదు. కానీ భూకంప పరిస్థితిలను తట్టుకునే నిర్మాణాలు, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ వ్యవస్థ, ప్రజల్లో అవగాహన, వేగవంతమైన సహాయక చర్యల ద్వారా నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ప్రకృతి ముందు మనిషి ఎంత మేధస్సు కలిగి ఉన్నా, పరిమితుడే అనే విషయాన్ని ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ గుర్తుచేస్తుంటాయి.

“వెనిజులా” భూకంపం ఒక దేశానికే పరిమితమైన విషాదం కాదు. ఇది ప్రపంచానికి ఒక హెచ్చరిక. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు, కరువులు మరింత తీవ్రతరమవుతున్న ఈ కాలంలో ప్రపంచ దేశాలు కేవలం అభివృద్ధి గురించే కాకుండా విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి. ప్రకృతి నుండి తీసుకోవడమే కాదు, దానిని ప్రేమించేలా, కాపాడుకునేలా, దానినుండి ఉత్పన్నమయ్యే విపత్తుల నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో, చిన్నప్పటి నుండి పిల్లలకు పాఠ్యాంశాల్లో చేర్చి, ప్రకృతి ప్రేమికుల్లా తీర్చి దిద్దాలి.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading