
“దైవ చింతన సమాజ సేవగా రూపాంతరం చెందినప్పుడే అది పరిపూర్ణమవుతుంది”. పూర్వం రాజులు దేవాలయాల నిర్మాణానికి భూములు, ధనం దానం చేసేవారు, దీనివల్ల ఆ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేది. విద్య మరియు వైద్య కేంద్రాలు గా కూడా, దేవాలయాలు బాసిల్లుతూ ఉండేవి.
సరిగ్గా ఇదే సూత్రాన్ని వంటబట్టించుకుని, ఆచరణలో పెడుతున్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే శిథిలావస్థలో ఉన్న పురాతన ఆలయాలకు పునర్వైభవం తీసుకురావడమే నిజమైన సనాతన ధర్మ రక్షణ అని తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు.”
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శివుడంటే అపారమైన భక్తి అని అందరికీ తెలిసిందే. ఆయన తన నిత్య జీవితంలో, నివాసంలో అత్యంత నియమ నిష్ఠలతో “నమక, చమక” పఠనంతో రుద్రాభిషేకాలు నిర్వహిస్తారని సన్నిహితులు చెబుతుంటారు. ఆ శివభక్తే నేడు అల్లూరి జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న పురాతన శివాలయ పునరుద్ధరణ కు పురిగొల్పింది.
గత నెల మార్చి 14వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్తనపల్లి గ్రామాన్ని సందర్శించారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటూ సాగుతున్న పర్యటనలో, గ్రామస్తులు ఆయనను తమ గ్రామంలోని పురాతన శివాలయాన్ని దర్శించమని కోరారు. మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ ఆలయం, నేడు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకోవడం ఆయనను కలిచివేసింది. గ్రామస్థుల వినతి మేరకు ఆయన వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
చాలామంది నాయకులు హామీలు ఇచ్చి మరిచిపోతారు, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసిన వెంటనే తన మాటను నిలబెట్టుకున్నారు. పర్యటన ముగిసిన వెంటనే టీటీడీ (TTD) పాలక మండలికి లేఖ రాస్తూ, ఆ ప్రాంత భక్తుల మనోభావాలను వివరించారు. ఆయన విన్నపానికి టీటీడీ సానుకూలంగా స్పందించి, వెంటనే సాంకేతిక నిపుణుల బృందాన్ని అక్కడికి పంపింది. నిపుణుల కమిటీ అంచనాల మేర ఆలయ పునర్నిర్మాణం కోసం రూ. 55 లక్షల భారీ నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆలయాని పునరుద్ధరణ చేయడమే కాకుండా, ఒక సంపూర్ణ క్షేత్రంగా దీనిని తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. ఆలయం లో ఈశ్వరుని తో పాటు అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాల ప్రతిష్ఠ తో పాటు,నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం తాగునీరు (బోర్ వెల్), కూర్చునే బెంచీలు, మైక్ సిస్టం వంటి సౌకర్యాలు. కూడా ఏర్పాటు చేస్తున్నారు.
చరిత్రలో కొన్ని పుణ్యక్షేత్రాలు కొంతమంది వ్యక్తుల చొరవతోనే లోకానికి ప్రాచుర్యంలోకి వస్తాయి. ఇప్పుడు వర్తనపల్లి శివాలయం కూడా పవన్ కళ్యాణ్ చొరవతో వెలుగులోకి రానుంది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ఆధ్యాత్మిక సంపదను, కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని కాపాడుకోవడమే.
ఈ బృహత్తర కార్యానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు లకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలపడం ఆయన సంస్కారానికి నిదర్శనం. త్వరలోనే వర్తనపల్లిలో శివనామస్మరణ మారుమ్రోగనుంది.
