
ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసి చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని అందించి నేటికి ఏడాది పూర్తి అయిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తుందన్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.
తణుకు నియోజకవర్గంలో సుమారు రూ.6.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభిచడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. నియోజకవర్గంలోని తణుకు, అత్తిలిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపనలతో పాటు కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఈర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలను హోంమంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్ల లాంటి వారన్నారు. అలాంటి వ్యక్తుల విగ్రహాలను ఒకేచోట ఏర్పాటు చేసుకోవడం దళితుల ఐక్యతకు నిదర్శనమని చెప్పారు. 2019లో జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే.. దళితులను టార్గెట్ చేసి పాలన సాగించారని మండిపడ్డారు. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా ముద్రవేసి చనిపోయేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడ్ని చంపి డోర్ డెలివీర చేసిన ఘనత వైసీపీ నాయకులదేనని మండిపడ్డారు. ఓ మహిళా అధికారిని ఎన్నో రకాలుగా వేధించారన్నారు. మాజీ ఎమ్మెల్యే టీడీఆర్ బాండ్ల స్కామ్ లో మునిగిపోయారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో దళితుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందన్నారు.
