Download App

పెద్దల(రాజ్య)సభ నుండి ‘ఆప్’ పెద్దలు జంప్…?

ఏప్రిల్ 26, 2026 By Suresh Thota
భారత రాజకీయ క్రీడా విన్యాసం ఏప్రిల్ 24, 2026 ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఉన్న పది మంది రాజ్య సభ సభ్యులలో, ఏడుగురు సభ్యులు ఒక్కసారిగా బిజెపి గూటికి చేరడం కేవలం ఒక పార్టీ సభ్యులు మార్పిడి మాత్రమే కాదు,...
పెద్దల(రాజ్య)సభ నుండి 'ఆప్' పెద్దలు జంప్…?

భారత రాజకీయ క్రీడా విన్యాసం ఏప్రిల్ 24, 2026 ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచిపోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఉన్న పది మంది రాజ్య సభ సభ్యులలో, ఏడుగురు సభ్యులు ఒక్కసారిగా బిజెపి గూటికి చేరడం కేవలం ఒక పార్టీ సభ్యులు మార్పిడి మాత్రమే కాదు, ఇది దేశ ఎగువ సభలో అధికార సమతుల్యతను మార్చేసే ఒక భారీ రాజకీయ వ్యూహం.

రాజ్యసభలో ఆప్ కి ఉన్న మొత్తం 10 మంది సభ్యులలో 70% మంది (ఏడుగురు) బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకోవడం ఆ పార్టీ మూలాలను కదిలించింది. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన “రాఘవ్ చద్ధా” తో పాటు, పార్టీ వ్యూహకర్త “సందీప్ పాఠక్”, విద్యావేత్త “అశోక్ మిట్టల్” కీలక పాత్రధారులు. నిన్న సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో అధికారికంగా చేరారు.

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, విక్రమ్ సాహ్నీ, రాజేందర్ గుప్తాలు కూడా ఈ విలీన పత్రంపై సంతకాలు చేశారు. వీరి చేరికతో రాజ్యసభలో ఆప్ బలం నామమాత్రంగా మారిపోయింది. ​ఎందుకు ఇంతమంది ఒకేసారి జంప్ అవుతున్నారు. అనేది రాజకీయ వర్గాలలో ఆశక్తి కరంగా మారింది. ​ఒక్కరు లేదా ఇద్దరు కాకుండా ఏడుగురు సభ్యులు ఒకేసారి జంప్ అవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.

చట్టపరమైన రక్షణ వీరికి లభిస్తుంది. (Anti-Defection Law) రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ ప్రకారం, ఒక పార్టీలోని 2/3 వంతు సభ్యులు విడిపోయి వేరే పార్టీలో విలీనం అయితే, వారి సభ్యత్వానికి ఎటువంటి ముప్పు ఉండదు. అందుకే, 10 మందిలో 7 గురు (70%) కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాఘవ చద్దా 2011లో అన్నా హజారే నేతృత్వంలో జరిగిన “ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్” ఉద్యమం సమయంలో ఆయన అరవింద్ కేజ్రీవాల్‌కు దగ్గరయ్యారు. ఆ ఉద్యమం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టినప్పుడు, ప్రారంభ సభ్యులలో ఒకరిగా ఆయన రాజకీయ ప్రయాణం మొదలైంది. పార్టీలో ఆర్థిక విషయాలను చూడటం, లీగల్ టీమ్‌లో ఉండటం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, 2022లో పంజాబ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగారు. బాలీవుడ్ నటి “పరిణీతి చోప్రా”తో వివాహం అయ్యింది.

రాఘవ్ చద్ధాను ఏప్రిల్ 2న రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుండి ఆప్ తప్పించింది. ఆ స్థానాన్ని అశోక్ మిట్టల్‌కు ఇచ్చింది. అయితే, పార్టీ తనను అవమానించిందని రాఘవ్, తనపై దాడులు జరుగుతున్నా పార్టీ అండగా నిలవలేదని అశోక్ మిట్టల్ అసంతృప్తితో ఉన్నారు. “అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇప్పుడు సిద్ధాంతాలను పక్కన పెట్టింది” అని రాఘవ్ ఆరోపించారు. తనను తాను “నేను సరైన వ్యక్తిని తప్పుడు పార్టీలో (Right man in a wrong party)” ఉన్నాననే భావన తో వ్యాఖ్యానించడం ద్వారా ఆయన తన నిష్క్రమణను సమర్థించుకున్నారు.

“రాఘవ్ చద్ధా”కు సోషల్ మీడియాలో ఉన్న విపరీతమైన క్రేజ్ ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. ఆయన బీజేపీలో చేరుతున్నారనే వార్త రాగానే, ముఖ్యంగా యువత (Gen Z) ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 10 లక్షలకు పైగా (1 Million) తగ్గిపోయింది. శుక్రవారం 1.46 కోట్లుగా ఉన్న ఫాలోవర్లు శనివారం మధ్యాహ్నానికి 1.34 కోట్లకు పడిపోయారు. సోషల్ మీడియాలో నెటిజన్లు “హీరో టు జీరో” అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆయనను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆయన బీజేపీని విమర్శించిన వీడియోలను షేర్ చేస్తూ ఆయన రాజకీయ అవకాశవాదాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఈ చేరికల వల్ల రాజ్యసభలో బీజేపీ బలం 113కి, ఎన్.డి.ఎ బలం 148కి చేరింది. మెజారిటీ మార్కు 123 ని సులభంగా దాటడం వల్ల, ఇకపై ప్రభుత్వం ఎటువంటి కీలక బిల్లులైనా, ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే ఆమోదించుకునే వీలు కలిగింది.

​ముగింపు:

ఆప్ ఈ పరిణామాన్ని “ఆపరేషన్ లోటస్” అని విమర్శిస్తున్నా, అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడం వల్లే ఇలా జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామం జాతీయ రాజకీయాలపై పెను ప్రభావాన్ని చూపబోతోంది. ఒక యువ నాయకుడిగా రాఘవ్ చద్ధా తన పాత ఇమేజ్‌ను తిరిగి పొందుతారా లేదా అనేది ఆయన బీజేపీలో చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading