Download App
Movie Poster

Blast Zone

Cast: Arjun Sarja, Preethi Mukundan, Abhirami, Vivek Prasanna, John Kokken

Director: Subhash K Raj

Music Director: Ravi Basrur

Producer: Kalpathi S. Aghoram, Kalpathi S. Ganesh, Kalpathi S. Suresh

Release Date: May 28, 2026

బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Published మే 28, 2026 by Srinivas

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు ఇటీవలి కాలంలో సరైన మూవీయే పడలేదు. చాలా కాలం తర్వాత ఒక యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ట్రైలర్ చూసిన వారికి ఇది కుటుంబ కథా చిత్రమని కూడా అర్థమవడంతో పాటు.. తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలో, ఎవరికోసమో ఎదురు చూడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలో ఈ సినిమా చెబుతుందంటూ అర్జున్ కూడా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో చెప్పడంతో అంచనాలైతే భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? అర్జున్ చాలా కాలం తర్వాత తన రియల్ టాలెంట్‌ అయిన కరాటేతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారా? తెలుసుకుందాం.

Blast Zone Movie Review

కథేంటంటే..

కరాటేలో ఛాంపియన్‌ అయిన రాజారామ్‌ (అర్జున్‌ సర్జా)ది చిన్న కుటుంబం. భార్య నీలవేణి (అభిరామి), కూతురు నీలా (ప్రీతి ముకుందన్), తమ్ముడు (వివేక్ ప్రసన్న)తో కలిసి ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. రాజారామ్ కరాటే ఇన్‌స్టిట్యూట్ నడిపిస్తూ ఉంటాడు. నీలవేణి కూడా కరాటేలో ఛాంపియన్. తన కూతురు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బంది పడకూడదని భావించిన రాజారామ్.. విలువలతో పాటు కరాటేను కూడా నేర్పిస్తాడు. నీల బాబాయి వచ్చేసి వారికి ఉన్న మెడికల్ షాపును నడిపిస్తూ ఉంటాడు. మన కళ్ల ముందు అన్యాయం జరిగితే దానిపై తిరగబడాలని.. అది మన వాళ్లా.. బయటవాళ్లే అనేది చూడకూడదని.. అప్పుడే మన జన్మకు సార్థకత ఉంటుందంటూ కూతురికి రాజారాం చెబుతాడు. ఏడు వేల కోట్ల మైనింగ్ కోసం బడా ఇండస్ట్రియలిస్ట్ అయిన వరుణ్‌(జాన్ కొక్కేన్)తో స్థానిక ఎమ్మెల్యే డీల్ కుదుర్చుకుంటాడు. దీని కోసం ఎమ్మెల్యే నిర్వహిస్తున్న ట్రస్ట్‌కి వెయ్యి కోట్ల రూపాయలను వరుణ్ వైట్‌లో పంపించాల్సి వస్తుంది. ఆ పనిని అండర్ వరల్డ్ డాన్ అబ్రహం (అర్జున్ చిదంబరం)కి అప్పగిస్తాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. అబ్రహం.. రూ.వెయ్యి కోట్లను వంద నోటుకి కన్వర్ట్ చేస్తాడు. ఆ తరువాత కథ ఏం జరిగింది? అబ్రహం వెయ్యి కోట్లు తీసుకున్నాడా? అసలు అబ్రహం, వరుణ్ లైఫ్‌లోకి రాజారామ్ కుటుంబం ఎలా ఎంటర్ అవుతుంది? వంటి అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే..

Blast Zone Movie Review

సినిమా ఎలా ఉందంటే..

నాలుగు పాటలు, రెండు ఫైట్లు, నాలుగు కామెడీ సన్నివేశాల కాలం పోయింది. ప్రస్తుతం కథ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే సినిమా అంత సాలిడ్‌గా నిలబడుతుంది. ఈ సినిమా ఆ కోవకు చెందినదే. ఈ మూవీకి స్క్రీన్‌ప్లే, బీజీఎం ప్రాణం అని చెప్పాలి. సినిమాలో పాటలు లేవు.. కామెడీ సన్నివేశాలు లేవు. రొమాన్స్ అంతకు మించి లేదు. ఫస్ట్ హాఫ్ అంత కాస్త స్లో నెరేషన్ అయినా కూడా ఎక్కడా బోర్ అనిపించదు. రాజారామ్.. తన కూతురిని కరాటేలో ఛాంపియన్‌గా తీర్చిదిద్దడం.. విలువలతో పెంచడం.. ఆ తరువాత నీల కూడా అన్యాయాన్ని సహించలేకపోవడం.. వంటి అంశాలను చూపిస్తూనే.. మరోవైపు వరుణ్ తన స్వార్థం కోసం మైనింగ్ కోసం ఒక ఊరినే నాశనం చేయాలనుకోవడం వంటివి ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. మంచి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఫస్ట్ హాఫ్‌ను దర్శకుడు సుభాష్ ముగించారు. ఇక సెకండ్ హాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ అంతా చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. స్క్రీన్‌ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. కానీ అదే సమయంలో సినిమాటిక్ లిబర్టీని కూడా కాస్త ఎక్కువగానే సుభాష్ తీసుకున్నారు. కొన్ని సన్నివేశాలు అంటే విలన్స్‌ని వరుసబెట్టి చంపుకుంటూ పోవడం.. దానిని పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేకపోవడం వంటివి కాస్త అతిగా అనిపిస్తాయి. అయినా కూడా స్క్రీన్‌ప్లేతో వాటన్నింటినీ హైలైట్ కాకుండా చూసుకున్నారు.

Blast Zone Movie Review

ఎవరెలా చేశారంటే..

ఇక అర్జున్‌కి చాలా కాలం తర్వాత మంచి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పడింది. కూతురిని ట్రైన్ చేస్తూ.. గైడ్ చేస్తూ ఒక మంచి తండ్రిగానే కాకుండా ఒక మంచి కుటుంబ పెద్దగా అదరగొట్టేశారు. ఇక ప్రీతిముకుందన్ చాలా అందంగా కనిపించింది. యాక్షన్ సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించింది. అభిరామి కూడా చక్కగా నటించారు. ఒకవైపు తల్లిగా కూతురు గురించి ఆందోళన చెందుతూనే.. అవసరమైనప్పుడు సపోర్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అర్జున్ చిదంబరం కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. వివేక్ ప్రసన్న, జాన్ కొక్కేన్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు సుభాష్‌కు ఇది తొలి సినిమా అయినా కూడా కథను నడిపించిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాలో చెప్పుకోవలిసింది.. స్క్రీన్‌ప్లే గురించి. చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. రాజారాం కుటుంబం, పోలీసులు, విలన్స్.. ఈ ముగ్గురికి ముడి పెట్టిన తీరు.. ఆకట్టుకుంటుంది. ఇక బీజీఎం కూడా రవి బస్రూర్ అద్భుతంగా ఇచ్చారు. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

తీర్పు: ‘బ్లాస్ట్ జోన్’.. ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.