డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
Published అక్టోబర్ 2, 2026 by Srinivas
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంపై అంచనాలు పెరగడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా చూశానని.. చాలా బాగుందంటూ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించడం.. ఈ సినిమాకు ప్రెజెంటర్‌గా రాజమౌళి ఉండటం వంటి కారణాలెన్నో ఉన్నాయి. రాజమౌళి ఇన్వాల్వ్ అయ్యారంటే సినిమా ఓ రేంజ్‌లో ఉండే అవకాశం ఉందనేది ప్రేక్షకుల భావన. పైగా ట్రైలర్‌లో నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే…
సూరి (ఫహాద్ ఫాజిల్) ఒక అనాథ. డబ్బు సంపాదనే అతని ధ్యేయం. ఈ క్రమంలో అతను అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ దగ్గర పందేలు వేస్తూ.. ఏదో ఒకరకంగా డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆ ఏరియా డాన్ అస్లాం భాయ్ (మహేష్ మంజ్రేకర్)ను గొర్రెల పొట్టేలు పందెంలో మోసం చేసి గెలు్తాడు. విషయం తెలుసుకున్న అస్లాం భాయ్.. రెండు రోజుల్లో రూ.25 లక్షలు చెల్లించాలని అల్టిమేటమ్ జారీ చేస్తాడు లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు. రెండు రోజుల్లో అంత డబ్బుసంపాదించడం మామూలు విషయం కాదు.. దీనికోసం అడ్డదారిని ఎంచుకుంటాడు. స్కూల్ బయట మేజిక్ చేస్తూ స్కూలు పిల్లలను కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తాడు. కానీ అది అవదు. ఆ సమయంలోనే సంపన్న కుటుంబానికి చెందిన దివ్య (స్సారా పాలేకర్) అతని జీవితంలోకి వస్తుంది. సూరిని గొప్ప మెజీషియన్‌గా భావించిన దివ్య, తనకు సహాయం చేయమని కోరుతుంది. ఆమెకు కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు దివ్యే తనకు మార్గమని భావించిన సూరి, ఆమెతో కలిసి జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఆ తరువాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపు తీసుకుంది? దివ్య పరిచయం తర్వాత సూరి జీవితంలో వచ్చిన మార్పులేంటి? ఆమె పవర్స్‌ని సూరి ఎలా ఉపయోగించుకున్నాడు? వంటి అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
రాజమౌళి కొడుకు నిర్మాత.. రాజమౌళి సమర్పణ.. ఫహద్ ఫాజిల్ హీరో.. పైగా పెద్ద హీరోలు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం వంటి అంశాలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఆ అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా లేదు. రొటీన్ కథ. స్లో నెరేషన్.. స్క్రీన్‌ప్లే చాలా నిరుత్సాహ పరుస్తుంది. హీరో–పాప ఎమోషన్ ఏమాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అవదు. అసలు ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లడమే చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా సాగదీతే. సూరి పాత్ర నేపథ్యాన్ని తెలియజేస్తూ ప్రారంభమైన కథ.. అతను డబ్బు కోసం ఏవో తప్పులు చేసి దొరికిపోవడం.. చివరకు విలన్నే మోసగించడం.. అతను వచ్చి వార్నింగ్ ఇవ్వడం.. బేబి దివ్య ఎంట్రీ వంటి అంశాలతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. దివ్య ఎంట్రీ తర్వాత సిని జానరే మారిపోతుంది. సెకండాఫ్‌లో అసలు కథ ప్రారంభమవుతుంది. ఇది కూడా స్లోగానే సాగుతుంది. దీంతో చూసేవారికి విసుగు అనిపిస్తుంది. దివ్యకు సంబంధించిన విషయాలను రివీల్ చేసిన తర్వాత కూడా కథలో వేగం ఉండదు. అక్కడక్కడ కాస్త కామెడీ మాత్రం వర్కవుట్ అయ్యింది. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. లాజిక్‌ల జోలికి అయితే వెళ్లకపోవడమే మంచిది. క్లైమాక్స్ పర్వాలేదనిపిస్తుంది.

ఎవరెలా నటించారంటే..
ఫహాద్ ఫాజిల్ ఇప్పటికే సీరియస్ డ్రామాలు, లైట్‌హార్టెడ్ రొమాంటిక్ కామెడీలు, థ్రిల్లర్లలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో ఈ సినిమా ఆయనకు కొట్టిన పిండే కాబట్టి అద్భుతంగా నటించాడు. ప్రతి సన్నివేశంలోనూ సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక బేబీ సార పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకం. దివ్య పాత్రలో ఆమె ఒదిగిపోయింది. విలన్‌గా మహేశ్ మంజ్రేకర్ పాత్ర నిడివి తక్కువే. విలన్‌గా ఆయనంత ప్రభావాన్ని చూపించలేకపోయారు. సౌరవ్ సచ్‌దేవ్, వెంకటేష్ కాకుమాను, సుబ్బరాజ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ పరంగా..
టెక్నికల్‌గా సినిమా పర్వాలేదనిపిస్తుంది. కాల భైరవ నేపథ్య సంగీతం బాగున్నా.. పాటలు అంతగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పేలవంగా ఉంది. సినిమా ఫస్ట్, సెకండాఫ్ చాలా సాగదీత. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చూసే ప్రేక్షకులకు కాస్త ట్రబులే
Rating: 



(2.25/5)
