కామ్రేడ్ కళ్యాణ్ మూవీ రివ్యూ
Published అక్టోబర్ 9, 2026 by Srinivas
శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రమోషన్స్ బీభత్సంగా చేశారు. ఇక చిత్ర యూనిట్ తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కోన వెంకట్ చాలా హుషారుగా కనిపించారు. దీనికి కారణం ‘కామ్రేడ్ కళ్యాణ్’ కాపీ చూడటమేనని.. రేటింగ్స్ 3, 3.5 రేటింగ్స్ అలా పైకి వెళతాయని చెప్పి సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు. మరి ఆ అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
90ల నాటి కథ ఇది. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తాడికొండ కళ్యాణ్ (శ్రీవిష్ణు) నివసిస్తూ ఉంటాడు. పెద్దగా చదువుకోని కళ్యాణ్అతను నివసించే ఊళ్లోనే ఓ థియేటర్ లీజుకు తీసుకుని నడిపిస్తూ ఉంటాడు. అది నక్సల్ ప్రభావిత ప్రాంతం కావడంతో దళాల ఏరివేత కోసం ఐపీఎస్ అధికారి జార్జ్‌కుట్టి (షైన్ టామ్ చాకో) ప్రత్యేకతంగా నియమితులవుతాడు. ఈ క్రమంలోనే మాస్టార్ (సాయిచంద్) దళానికీ, జార్జ్‌కుట్టీకి మధ్య పోరు జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ ఊళ్లోకి ఒరియాకి చెందిన సితారదేవి (మహిమా నంబియార్) తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కల్యాణ్ తల్లి సరస్వతమ్మ (రాధికా శరత్‌కుమార్)ను సితార కాపాడుతుంది. ఆమెను చూసి చూడగానే కల్యాణ్ ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి అన్న చేసిన అప్పుల కారణంగా బిష్వాస్ (ఉపేంద్ర లిమాయే) ఆ కుటుంబం వెంట పడతాడు. డబ్బిస్తారా? లేదంటే సితారను తీసుకెళ్లి పెళ్లి చేసుకోమంటారా? అంటూ ఆమె కుటుంబాన్ని బెదిరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అప్పునంతా తను కడతానని కళ్యాణ్ చెబుతాడు. ఇక ఆ కుటుంబాన్ని ఎలాగైనా గట్టెక్కించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన స్నేహితుడు దుబాయ్ బాబు (సత్య) సాయంతో స్కీం అంటూ పళ్లం రాజు (ప్రభాస్ శీను), ఎస్సై అప్పలనాయుడు (బ్రహ్మాజీ)తో కలిసి చేసే పనులేంటి? ఆ తరువాత కళ్యాణ్ కాస్తా కామ్రేడ్ కల్యాణ్‌గా మారి పోలీసుల లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఎలా మారాడు? అసలు అడవిలోని అన్నలకీ, కళ్యాణ్‌కి సంబంధం ఏమిటి? సితారతో ప్రేమాయణం వర్కవుట్ అయ్యిందా? ఆమె కుటుంబాన్ని కల్యాణ్ ఆదుకున్నాడా? అన్నలకీ, పోలీసులకీ మధ్య యుద్ధం ఎప్పుడు ఎలా ఆగింది? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే..
నక్సలైట్ దళాలు, పోలీసుల కూబింగ్ వంటివి ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో కొంత కాలం క్రితం వరకూ నిత్యం వినపడిన మాటలే. అదే ప్రాంతాన్ని తన కథను చెప్పేందుకు దర్శకుడు ఎంచుకోవడం బాగుంది. అయితే నక్సల్స్ అనగానే మనకు ఓ సీరియస్ కథేమో అనిపిస్తుంది. కానీ కామ్రేడ్ కల్యాణ్ ఆ కోవకు చెందినది కాదు. ఆద్యంతం కామెడీతో కళ్యాణ్ కనిపిస్తాడు.నక్సలిజాన్ని కూడా కామెడీ నేపథ్యంలో రూపొందించడం జరిగింది. సినిమాను లాజిక్స్ పరంగా చూస్తే ఏమాత్రం కరెక్ట్ అనిపించదు. చాలా సిల్లీగా జబర్దస్త్ టైపు కామెడీ పంచులతో సినిమాను దర్శకుడు నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ సీన్లతో నడిపించాడు. మధ్యమధ్యలో కాస్త సీరియస్ సన్నివేశాలు కనిపించినా కూడా కామెడీ మాటున అవి పెద్దగా హైలైట్ అవలేదు. ఇంటర్వెల్‌కి ముందు సన్నివేశాలు.. అనూహ్యంగా తీసుకునే టర్న్‌తో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కథ సీరియస్ టర్న్ తీసుకుంటుందని అంతా భావిస్తాం కానీ అలాంటిదేం జరగలేదు. చాలా సీరియస్‌గా చెప్పాల్సిన అంశాలను సైతం కామెడీ వేలోనే చెప్పడం జరిగింది. అడవిలో కూడా కామెడీగానే కథను నడిపించారు. ముఖ్యంగా ఆర్ నారాయణమూర్తిని, ఆయన సినిమాల్ని గుర్తు చేస్తూ ‘ఎత్తరా ఎత్తు…’ పాట ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఈ సినిమా కథేంటనేది చూసే ప్రేక్షకులకు స్పష్టంగా అర్థం అవుతుంది. కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. సత్య ఎంట్రీతో కాస్త పర్వాలేదనిపిస్తుంది. హీరో కోసం సత్య ఇంగ్లీష్‌లో ప్రేమలేఖ రాస్తాడు. ఈ సన్నివేశం నుంచి సినిమా కాస్త పర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ – శ్రీకాంత్ అయ్యంగార్ కలిసి చేసిన సందడి పర్వాలేదనిపిస్తుంది. ఒక మెసేజ్‌తో సినిమాని ముగించారు.
ఎవరెలా చేశారంటే..
శ్రీవిష్ణుకి ఇలాంటి కామెడీ ఎంటర్‌టైనర్స్ ఏమీ కొత్త కావు కాబట్టి కామ్రేడ్ కల్యాణ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అతనికి సుదర్శన్, సత్య యాడ్ అవడంతో కామెడీతో నడిపించారు. ఇక సత్య విషయానికి వస్తే సినిమా ప్రారంభం నుంచి ఉంటే బాగుండేది. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా చివరి వరకూ కనిపించి నవ్వులు పంచుతాడు. హీరోయిన మహిమా నంబియార్‌కు నటనకు ప్రాధాన్యం లేనిపాత్ర.కానీ అందంగా కనిపించి మెప్పించింది. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్‌గా రాధికా శరత్ కుమార్ మంచి సందడి చేశారు. షైన్ టామ్ చాకో పాత్ర తేలిపోయింది. సుదర్శన్, బ్రహ్మాజీ, రఘుబాబు, ఉపేంద్ర లిమాయే, వెన్నెల కిశోర్, మురళీధర్ గౌడ్, ప్రభాస్ శ్రీను, శ్రీకాంత్ అయ్యంగార్, శత్రు, సాయిచంద్, ముక్కు అవినాష్.. వంటి కమెడియన్స్ ఉన్న కూడా వారితో దర్శకుడు కడుపుబ్బ నవ్వించలేకపోయారు.

టెక్నికల్ పరంగా..
దర్శకుడు జానకిరామ్ మారెళ్ల ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను అయితే ఎంచుకున్నారు కానీ కామెడీయే పెద్దగా వర్కవుట్ కాలేదు. జబర్దస్త్ పంచులు సైతం అంతగా వర్కవుట్ కాలేదు. వాస్తవికతకు దూరంగా కథను నడిపించారు. ఇక ఈ సినిమా విషయంలో ముందుగా చెప్పుకోవల్సింది.. సినిమాటోగ్రఫీ. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాయిశ్రీరామ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. విజయ్ బుల్గానిన్ అందించిన బీజీఎం, పాటలు పర్వాలేదనిపించాయి. దర్శకుడు జానకిరామ్ మారెళ్ల మేకింగ్‌పై పట్టు ప్రదర్శించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గా.. ఎలాంటి అంచనాలు లేకుండా.. లాజిక్స్ వెదక్కుండా చూస్తే ‘కామ్రేడ్ కళ్యాణ్’ కొంతమేర మెప్పిస్తాడు.
Rating: 



(2.5/5)
